డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత, చేవెళ్ళ సుజలస్రవంతి పథకానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవడం పట్ల రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం సిఎల్పీ కార్యాలయంలో మంత్రులు గీతారెడ్డి, సారయ్య, ప్రసాదకుమార్, ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన కృషికి అభినందనలు తెలిపారు. గీతారెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతంలో ఏడు జిల్లాలకు మేలు జరిగేవిధంగా ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందాలు జరగడం సంతోషంగా ఉందని, ఇంతకంటే తెలంగాణాకు ఇంకేమీ మేలు కావాలని ప్రశ్నించారు. సాగునీరుతో పాటు ఏడు జిల్లాల సహా హైదరాబాద్‌కు దాహార్తి తీరుతుందన్నారు. ఎన్నోఏళ్ళుగా తెలంగాణా ప్రజలు కన్నకలలు నిజమయ్యాయని, విద్యుత్‌కోసం ఎంత ఖర్చుచేస్తారనేది తమ వద్ద వివరాలు లేవని సారయ్య చెప్పారు.
దామోదర మండిపాటు
ప్రాణహిత-చేవెళ్ళకు రెండు రాష్ట్రాల ఒప్పందాలు చేసుకుంటున్న క్రమంలో తనను ఆహ్వానించకపోవంపై డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ మండి పడుతున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు వలన సింహభాగం మెదక్‌జిల్లాకు ఉపయోగ పడుతుంది. అందులో కీలకపాత్ర వహించాల్సిన సమయంలో దామోదరను పిలవకుండా మంత్రినే తీసుకెళ్ళడమేంటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై బొత్స సత్యనారాయణతో దామోదర చర్చించినట్లు తెలిసింది.