రాష్ట్రంలో పార్టీ శ్రేణులను మరింతగా కలుపుకొనిపోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షురాలితో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఉప ఎన్నికల ఏర్పాట్లు, పిసిసి అధ్యక్షుడు బొత్సతో విభేధాలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. 18 స్థానాల్లో జరగనున్న ఉప ఎన్నికలను ఏమాత్రం అలక్ష్యం చేయరాదని ఈ సందర్భంగా సోనియా స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే ముందు ఆయా స్థానిక పార్టీ కమిటీల అభిప్రాయాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించినట్లు తెలిసింది. పిసిసి అధ్యక్షునితో విభేదాలను సరిచేసుకోవాలని, పార్టీ శ్రేణులను కలుపుకుపోయినప్పుడే మెరుగైన పాలన సాధ్యమౌతుందని ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ఉద్బోధించినట్లు సమాచారం. పార్టీలో అనైక్యత లేదన్న సందేశం కింది స్థాయి శ్రేణులకు చేరేలా వ్యవహరించాలని పేర్కొన్నట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తే బాగుంటుందని సమావేశంలో సిఎం కోరినట్లు సమాచారం.
అధిష్టానం దూతగా వాయలార్
ఉప ఎన్నికల నేపథ్యలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కొత్తమార్గాన్ని ఎంచుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా గులాం నబీ వ్యవహరిస్తుండగానే రాష్ట్ర మాజీ ఇన్‌ఛార్జి, సీనియర్ నేత వాయలార్ రవిని రాష్ట్రానికి పంపింది. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన వాయలార్ రెండు మూడు రోజులు రాష్ట్రంలోనే మకాం వేయనున్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, ముఖ్యమంత్రి పనితీరు, ఉప ఎన్నికల సన్నద్ధత అంశాలపై ఈ సందర్భంగా ఆయన ముఖ్యనేతల అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు ఎఐసిసి నేతలు చెప్పారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వపరంగా తక్షణం నాయకత్వ మార్పిడికి అవకాశం లేదని పార్టీ నేతలు స్పష్టం చేశారు.