చమురు వదలాల్సిందేనా ?

  • బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక
  • పెరగనున్న డీజిల్‌, ఎల్‌పిజి ధరలు - ప్రణబ్‌ సంకేతాలు

రైల్వే ఛార్జీల పెంపు, ఎక్సైజ్‌, సేవా పన్నుల రూపంలో సామాన్యులపై భారాలు మోపడానికి బడ్జెట్‌ సమావేశాలు సాక్షిగా నిలవగా, బడ్జెట్‌ సమావేశాల తర్వాతా మరో బాదుడుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంధన ధరల రూపంలో ఈ ధరాఘాతం ఎదురు కానుంది. సమావేశాలు ముగిశాక డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. 'బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తాం. ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. భాగస్వాములందరితో మాట్లాడి ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సిన కొన్ని అంశాలపై ఈ యంత్రాంగం దృష్టి సారిస్తుంది' అని చెప్పారు. ఆయిల్‌ ధరలపై సబ్సిడీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. 2010 జూన్‌లో పెట్రోల్‌ ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసింది. కాగా డీజిల్‌, కిరోసిన్‌, వంటగ్యాస్‌లకు మాత్రం సబ్సిడీకి అందిస్తోంది. పెరుగుతున్న ముడిచమురు ధరల సమస్యలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన పద్ధతుల కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని, సంబంధిత భాగస్వాములందరితో చర్చించి దీనిపై త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు.

< Publiture