మన్మోహన్ సర్కారు దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే తిరోగమన చర్యలకు వెంటనే తెరదించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. శని,ఆదివారాల్లో ఇక్కడ భేటీ అయిన పొలిట్‌బ్యూరో దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పలు అంశాలను సమీక్షించింది. రోజురోజుకూ పెరుగుతున్న ధరా భారం నుండి ప్రజలు సాంత్వన కోసం ఎదురు చూస్తున్నారని, రానున్న బడ్జెట్‌లో ఈ భారాన్ని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోరాదని కోరుకుంటున్నారని పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో వివరిం చింది. మల్టీబ్రాండ్ రిటైల్ వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే చర్యలకు వెంటనే స్వస్తి చెప్పాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఒఎన్‌జిసి షేర్ల డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ఈ విధానంలోని లోపాలను ఎత్తి చూపిందని పేర్కొంది. సమర్ధవంతమైన లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు వీలుగా లోక్‌పాల్ బిల్లును తగు విధంగా సవరించి పార్లమెంట్ ఆమోదం పొందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ప్రజాపంపిణీ వ్యవస్థను విస్తరిం చేందుకు, రాష్ట్రాల హక్కు లలో చొరబాటును నివారించేందుకు వీలుగా ఆహార భద్రతా బిల్లును సవరించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ప్రతికూల ఫలితాలు కేంద్రంలోని యుపిఎ సర్కారుపై ప్రజల అసంతృప్తికి దర్పణం పడుతున్నా యని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ధరల పెరుగుదలను, ఉన్నత స్థాయిలోని అవినీతిని అరికట్టటంలో ఘోరంగా విఫల మైన యుపిఎ సర్కారుపై ప్రజల అసంతృ ప్తికి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దర్పణం పడుతున్నాయని పేర్కొంది.
ఫిబ్రవరి 28 సార్వత్రిక సమ్మె:గత నెల 28న జరిగిన సార్వత్రిక సమ్మెను పూర్తి స్థాయిలో విజయవంతం చేసిన కార్మిక సంఘాలు, ఉద్యోగ, కార్మిక వర్గాలను పొలిట్‌బ్యూరో అభినందనలు తెలిపింది. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ సమ్మె పిలుపునకు దేశంలోని ప్రభుత్వ రంగంతో పాటు పారిశ్రామిక, సేవల రంగాలలోని అన్ని వర్గాల ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా స్పందించి విజయవంతం చేశారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ సమ్మె పిలుపునకు దేశవ్యాప్తంగా లభించిన సానుకూల స్పందన కేంద్రంలోని యుపిఎ సర్కారు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిఫలిస్తోందని తెలిపింది. ఉద్యోగ, కార్మిక వర్గాలు తమ హక్కులు, జీవనాన్ని పరిరక్షించుకునేందుకు పోరాటాలను ఉధృతం చేయాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.
సమాఖ్య తత్వ పరిరక్షణ:కేంద్రం ప్రతిపాదిస్తున్న జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సిటిసి) ఏర్పాటుపై అనేక మంది ముఖ్యమంత్రులు వ్యక్తంచేసిన వ్యతిరేకతను పొలిట్‌బ్యూరో గట్టిగా సమర్ధించింది. రాష్ట్రాల హక్కులపై దాడి చేసే రైల్వే భద్రతాదళ చట్ట సవరణపై వ్యక్తమైన వ్యతిరేకతను కూడా తాము సమర్ధిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ సవరణ రాష్ట్రాల పోలీస్ హక్కులను రైల్వే పోలీసులకు ధారాదత్తం చేస్తుందని, ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికా రాల రాజ్యాంగ విభజనకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. రాష్ట్రాల హక్కులపై కేంద్రం చేస్తున్న దాడులను నిరసిస్తూ సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టాలన్న భావన బలపడడం సానుకూల పరిణామ మని వివరించింది. కేంద్ర, రాష్ట్ర సంబం ధాల పునర్వ్య వస్థీకరణపై విస్తృతమైన అవగా హనకు రావాలని దేశంలోని అన్ని ప్రజా తంత్ర రాజకీయ శక్తులకు సిపిఎం పిలుపునిచ్చింది.
2జి స్పెక్ట్రమ్ తీర్పు:ముందు వచ్చిన వారికి ముందు అన్న పద్ధతిలో గత యుపిఎ ప్రభుత్వ హయాంలో కేటాయించిన 122 2జి లైసెన్స్‌లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయటాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా విమర్శించింది. అత్యంత విలువైన జాతి సంపదనుకేటాయించటంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఈ చారిత్రాత్మక తీర్పు ప్రభుత్వానికి సూచించిందని గుర్తు చేసింది. సహేతుకమైన ఈ తీర్పును ఆమోదించటానికి బదులు మన్మోహన్ సర్కారు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయటమే కాక రాష్ట్రపతి సమీక్షను కోరటం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడిన వర్గాల ప్రయోజనాల కొమ్ము కాసేందుకు సిద్ధమైందని విమర్శించింది. శాసనవ్యవస్థ నిర్ణయాధికారాలను న్యాయవ్యవస్థ ఆక్రమిస్తోందన్న పేరిట విచక్షణాధికారాలను కేంద్రం తన గుప్పిట్లోనే వుంచుకోవాలని భావిస్తోందని అభిప్రాయపడింది. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన కుంభకోణాన్ని మన్మోహన్ సర్కారు పూర్తిగా సమర్ధిస్తోందన్న