హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • 600 గుడిసెలు దగ్ధం - బాలిక మృతి
  • కబ్జాదారులపై అనుమానం

షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో బాలిక మృతి చెందింది. 600 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. రెండు కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటనను చూసి బాధితులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. పేదల సిలిండర్లు, బైక్‌లు దగ్ధమయ్యాయి. వందలాది కుటుంబాలు నిరాశ్రయుల య్యాయి. ఉదయం స్కూల్‌కు వెళ్లొచ్చేసరికి తమ ఇళ్లు కాలుతున్నాయంటూ పిల్లలు బోరున విలపించారు. కానీ ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది సకాలంలో రాకపోవడంతో గుడి సెలు సగం కాలిపోయాయి. ఈ హృదయ విదారక సంఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌ ప్రాంతానికి చెందిన సాయినగర్‌లో శనివారం చోటుచేసుకుంది.

నాగోల్‌ ప్రాంతంలోని సాయినగర్‌లో 600 గుడిసెలు దగ్ధమైన ఘటనకు సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐదేళ్లుగా తమ గోడును పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు సర్వం కోల్పోయాక సాయం చేస్తామనడం సిగ్గుచేటుగా ఉందని దుమ్మెత్తిపోస్తున్నారు. తమకు ఇళ్లులేకనే ఇక్కడ గుడిసెలు వేసుకుంటే తమను ఇక్కడి నుంచి తరలించాలని అధికారపార్టీకి చెందిన నాయకులు, కబ్జాదారులు కుట్రలు పన్ని తమ గుడిసెలను కాలబెట్టారని ఆరోపిస్తున్నారు. గుడిసెవాసులు లేని సమయంలో కావాలనే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పేదలు నివసిస్తున్న గుడిసెలకు అంటుకుని కాలిపోయాయి. సర్వే నెం.69/1లో 7 ఎకరాల ఏడు గుంటల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి వలసొచ్చిన పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకుని ఐదేళ్ల నుంచి నివాసం ఉంటు న్నారు. వీరంతా ఆటోడ్రెవర్లు, హమాలీలు, ఇంటిపనివారలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వృద్ధులు, పిల్లలు గుడిసెల్లో ఉన్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో గుడిసెలకు నిప్పంటుకుంది. మంటలు ఉవ్వెత్తున చెలరేగాయి. సమయానికి ఫైర్‌ఇంజన్‌ రాకపోవడంతో ఆ మంటల్లో సంధ్య(10) కాలిపోయింది. 600 కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. సామాన్లు, వంటపాత్రలు, బియ్యం, మంటల్లో కాలిబూడియ్యాయి. రెండు కోట్లరూపాయల నష్టం సంభవించింది. వీరందరికీ ప్రభుత్వం నుంచి తగిన ఆర్థికసాయం అందిస్తామని ఎంపి సర్వే సత్యనారాయణ తెలిపారు. బాధితులందరికీ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద ఇళ్లు నిర్మించిస్తామని సర్వే హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదం జరిగి 600 పేద కుటుంబాలు నిరాశ్రయులయ్యారని సిఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సర్వే తెలిపారు. అగ్ని ప్రమాదానికి స్థానిక కాలనీవాసులపై అనుమానం ఉందని దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు సర్వే తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఐదేళ్ల క్రితం వేసుకున్న గుడిసెలు

సాయినగర్‌లో సర్వే నెం.69/1లో 600 పేద కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆ ప్రాంతంలో పేదలు గుడిసెలు వేసుకుని జీవించడం స్థానిక కాలనీవాసులకు ఇష్టం లేదు. వారిని అక్కడి నుంచి తరలించాలని కాలనీవాసులు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో భూపోరాటంలో భాగంగా గుడిసెలు వేసుకున్నారు. అంతకుముందు సబ్బరి సొసైటీలో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ పేదలు చేరారు. ఆ సొసైటీ ఆధ్వర్యంలో పట్టాలు కూడా పొందారు. కొందరు బడాబాబులు ఆ స్థలాన్ని ఆర్‌టిఎ శిక్షణ కోసం కేటాయించారు. దీంతో అక్కడి పేదలు హైకోర్టుకు స్టే తెచ్చుకోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తమకు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్‌, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి 600 కుటుంబాల పేదలను గుర్తించారు. వారికి పట్టాలు ఇవ్వొచ్చని నివేదిక తయారు చేశారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది.

సంఘటన స్థలాన్ని సందర్శించిన కలెక్టర్‌...

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చనిపోయిన బాలిక కుటుంబానికి రూ.1.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. దీంతోపాటు ప్రతీ బాధిత కుటుంబానికీ వంట పాత్రలకు రూ.1500, బట్టలకు రూ.1500 మొత్తం రూ.3000 ఇస్తామని, పునరావాసం కోసం రూ.5 వేల నగదు, 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్‌ తక్షణ సాయం కింద అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వంతో మాట్లాడి శాశ్వత గృహ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ వెంట సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, జెసి సుదర్శనరెడ్డి, ఆర్‌డిఓ రాజేందర్‌, ఎల్‌బినగర్‌ డిసిపి నాగేందర్‌కుమార్‌, ఎసిపి అమరేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.