ఆంధ్ర - మహారాష్ట్ర సరిహద్దులో గురువారం రాత్రి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. ఆంధ్ర - మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ దళాలు అటువైపు గాలిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఇరువైపుల నుండి దాదాపు అరగంట పాటు కాల్పులు జరిగినట్లు తెలిసింది. ఆ తర్వాత ఘటనా స్థలం వద్ద గ్రేహౌండ్స్ దళాలు గాలింపు జరపగా నాలుగు మారుణాయుధాలు కనిపించాయని, వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆంధ్ర - మహారాష్ట్ర సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ దళాలు భారీ ఎత్తున కూంబింగ్ జరుపుతున్నట్లు తెలిసింది.