అదే అలసత్వం..పాఠాలు నేర్వని ప్రభుత్వం

అదే అలసత్వం.. అంతులేని నిర్లక్ష్యం.. గత విద్యాసంవత్సరం చేసిన తప్పిదాలతోనైనా పాఠాలు నేర్వని రాష్ట్రప్రభుత్వం, ఈ ఏడాదీ అదేతీరును ప్రదర్శిస్తోంది. పాఠ్యపుస్తకాల పంపిణీపై చిన్నచూపు చూస్తోంది. పాఠ్యపుస్తకాలు ముద్రించి పాఠశాలల పునఃప్రారంభానికి ముందే చేరవేయకుండా అలసత్వం ప్రదర్శిస్తోంది. గత విద్యాసంవత్సరం పుస్తకాలు అందక విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాదీ అవేతిప్పలు తప్పేలా లేవు. జిల్లాలో 4343 (ప్రభుత్వ గుర్తింపు పొందినవాటితోకలిపి) ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో గతేడాది ఐదు లక్షల 64 వేల 408 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాదీ అంతే సంఖ్యలో విద్యార్థులు ఉంటారనేది అంచనా. వీరికి ఈ సంవత్సరం 23 లక్షల 99 వేల 150 పుస్తకాలు అందించాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతేడాది పంపిణీ చేయగా మూడు లక్షల 23 వేల 457 పుస్తకాలు మిగిలాయి. ఇవి పోనూ ప్రభుత్వం నుంచి ఈ ఏడాది జిల్లాకు అందాల్సిన మొత్తం పుస్తకాలు 13 లక్షల 75 వేల 693.ఇప్పటికి అందింది 30 శాతమే. జూన్‌ 12 నాటికి పాఠశాలలను పునఃప్రాంరంభిస్తారు. అంటే ఇంకా 35 రోజుల్లో విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించాల్సిఉంది. ప్రభుత్వం తీరుచూస్తే వారికి పుస్తకాలు ఇవ్వకుండానే తరగతులు నిర్వహించేలా ఉంది. ఇప్పటికీ జిల్లా విద్యార్థులకు అందించాల్సిన పుస్తకాల్లో 30 శాతం(ఏడులక్షలు) మాత్రమే రాష్ట్రకేంద్రం నుంచి జిల్లాకు వచ్చాయి. జిల్లా అధికారులు మాత్రం వారంరోజుల్లో 60 శాతం పుస్తకాలు వస్తాయని, ఈనెల 20 తేదీ నుంచి ఆయా మండలాలకు పంపుతామని చెబుతున్నారు. పుస్తకాలు పూర్తిస్థాయిలో ఎప్పుడొస్తాయో.. మండల కేంద్రాలకు ఎప్పుడెళతాయో.. పాఠశాలలకు ఎప్పుడు చేరతాయో.. విద్యార్థులు చేతిల్లోకి ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.

గతేడాదివలె పాట్లు తప్పవా?

గత విద్యాసంవత్సరం ఒకటి, రెండో తరగతి పాఠ్య పుస్తకాలు టైటిల్స్‌ మారాయి. అవి విద్యార్థులకు అందేసరికి రెండునెలలు ఆలస్యమైంది. ఈఏడాది 3, 6, 7 తరగతుల పాఠ్యపుస్తకాల టైటిల్స్‌ మారాయి. వాటికి సంబంధించి ముద్రణ ఎప్పటికి పూర్తవుతుందో జిల్లా అధికారులకూ తెలియడంలేదు. గతేడాది 179 టైటిళ్లకు ప్రతిపాదనలు పంపారు. ఈసారి ఒకటి నుంచి మూడోతరగతికి ఒకే ఇంగ్లీష్‌, ఆరోతరగతిలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ మాధ్యమాలకు ఒకే ఇంగ్లీష్‌ పుస్తకం ఉండడంతో టైటిళ్లను 174కు కుదించారు. అయితే మారిన టైటిల్‌ పుస్తకాలతోపాటు ఇతర టైటిల్స్‌ హైదరాబాద్‌ ప్రింటింగ్‌ప్రెస్‌లో ఇంకా ముద్రణకే నోచుకోలేదు. వాటి ముద్రణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

జూన్‌ 12 నాటికి పంపిణీ చేస్తాం

జూన్‌ 12వ తేదీ నాటికి జిల్లాలో పూర్తి స్థాయిలో పుస్తకాల పంపిణీని పూర్తిచేస్తాం. పంపిణీ ప్రక్రియ 20వ తేదీన ప్రారంభిస్తాం. ఇప్పటికే దీనిపై సమీక్షించాం. పుస్తకాలు వీలైనంత త్వరగా విద్యార్థులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

అంజనేయులు, డిఇఓ