దళిత గిరిజనవాడలను అభివృద్ధి చేయాలని కోరుతూ కెవిపిఎస్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర ఆదివారం మంగళగిరిలోని దళిత గిరిజనపేటల్లో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను యాత్ర బృదం దృష్టికి తీసుకొచ్చారు. 21వ వార్డు ఎస్‌టి కాలనీ మురుగునీరు పారుదల లేక అంటురోగాలతో బాధపడుతున్నామని, వర్షం పడితే 150 ఎస్‌టిల కుటుంబాల ఇళ్లు నీటిలో మునిగిపోతున్నాయని వాపోయారు. 23, 15, 31 వార్డుల్లో మంచినీరు సక్రమంగా అందడంలేదని, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా నిర్మించడం వల్ల ఎక్కడనీరు అక్కడ నిలిచిపోతుందని, ఇళ్ల స్థలాల కోసం అనేక పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. 3,4 వార్డుల్లో దేవస్థానం భూమిలో 50ఏళ్లుగా ఇళ్లు వేసుకొని నివాసముంటున్నప్పటికీ పట్టాలు ఇవ్వడంలేదని యాత్ర బృందానికి విన్నవించారు. పాదయాత్ర బృందంలో కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి కట్టెపోగు వెంకయ్య, సిహెచ్.పార్వతి, బొక్కా ఆదియ్య, శ్రీను, పి.పూర్ణ, చంద్రరావు, రాజు, పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్‌ఎస్.చెంగయ్య, డివిజన్ కార్యదర్శివర్గసభ్యులు పి.బాలకృష్ణ, పట్టణ కార్యదర్శివర్గసభ్యులు కె.అంకమరావు, కెవిపిఎస్ నాయకులు పెదపూడి లక్ష్మణరావు, కె.సుధాకర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.భాగ్యరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు ఎం.నాగేశ్వరరావు, ఎస్‌కె.బాషా పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరిరూరల్
దళితవాడలన్నీ అభివృద్ధికి ఆమడదూరంలోకి నెట్టబడుతున్నాయని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు ఎం.రవి పేర్కొన్నారు. కెవిపిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రల్లో భాగంగా శనివారం రాత్రి చినకాకాని గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో రవి మాట్లాడుతూ ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయే మినహా వారి సమస్యలు పరిష్కరించడంలేదన్నారు. దళితుకుల కేటాయించిన అరకొర నిధులు ఖర్చు చేయడంలేదన్నారు. దీనిపై దళితులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుసంఘం నాయకులు, మాజీ సర్పంచ్ వై.గంగాధరరావు మాట్లాడుతూ దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి కెవిపిఎస్ పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో కెవిపిఎస్ బృంద సభ్యులు కె.వెంకయ్య, పార్వతి, బొక్కా ఆదియ్య, పూర్ణ, శ్రీనివాసరావు, బండ్లరాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి -ఫిరంగిపురం
కెవిపిఎస్ సైకిల్‌యాత్ర మండలంలోని పొనుగుపాడు, గుండాలపాడు, నుదురుపాడు, ఫిరంగిపురం, 113 తాళ్లూరు, తక్కెళ్లపాడు గ్రామాల్లో నిర్వహించారు. కెవిపిఎస్ డివిజన్ అధ్యక్షులు సిహెచ్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ గుండాలపాడు గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంకు ఉన్నప్పటికీ దళితవాడలకు సరిగా తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నారని, దళితవాడలో వీధిలైట్లు లేవని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. మండలంలో వ్యవసాయ పనులు లేక ఇళ్ల వద్దనే ఉంటున్నామని, ఉపాధి పనులు చూపాలని స్థానికులు యాత్ర బృదం దృష్టికి తీసుకొచ్చారు. కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి జి.రవిబాబు మాట్లాడుతూ దళితవాడకు చాలినంత శ్మశాన స్థలంలేకపోతే ఉన్న కాస్త స్థలాన్నే ఇతరులు ఆక్రమించకుంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో పి.బాలకృష్ణ, ఎ.లెనిన్, విజయకృష్ణ, ప్రకాష్, సుధీర్, ఎస్‌కె.వలి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడేపల్లి
గ్రామాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాటం సంఘం (కెవిపిఎస్) సైకిల్ యాత్ర ఆదివారం మెల్లెంపూడి, గుండిమెడ, చిర్రావూరు, ప్రాతూరు, కుంచనపల్లి, తాడేపల్లి పట్టణంలోని క్రిస్టియన్‌పేట, అమరారెడ్డినగర్, మైసూర్ కంపెనీ, 1వ వార్డు, రన్నింగ్‌రూమ్ సెంటర్, లంబాడిపేట, ముగ్గురోడ్డు ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సైకిల్‌యాత్ర దృష్టికి తీసుకువచ్చారు. ప్రాతూరు, చిర్రావూరులో ఇసుక క్వారీలు మూతపడటం వల్ల వెయ్యిమంది జనాభా ఆర్థికలేమితో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. తాడేపల్లిపట్టణంలో మున్సిపాలిటీ పెంచిన పన్నులు పేదలకు భారంగా పరిణమించాయని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోయారు. కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని కోరారు. ఇప్పటివరకు దారిమళ్లించిన రూ.25వేలకోట్లును తిరిగి దళితవాడల అభివృద్ధికి ఖర్చుచేయాలని డిమాండ్ చేశారు. యాత్రలో వడ్డేశ్వరం బాబురావు, బిక్షాలు, కంచర్ల సాంబశివరావు, పల్లె కృష్ణ, జి.రాకేష్‌బాబు, డోకుపర్తి రాజేంద్రబాబు, కాజ వెంకటేశ్వరరావు, అమ్మిశెట్టి రంగారావు, వై.బర్నబాసు, కటికల పౌలు, డి.విజయబాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-వినుకొండ
కెవిపిఎస్ చేపట్టిన సామాజిక చైతన్య యాత్రలు రెండోరోజుకు చేరాయి. నాయకులు ఆటోలో గ్రామాలలోని దళతవాడల్లో తిరుగుతూ దళితుల హక్కులపై స్థానికులను చైతన్యవతం చేస్తున్నారు. పలుగ్రామాల్లో దళితులు నాయకులకు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. దళిత కాలనీల్లో తాగునీటి సౌకర్యాలులేవని, డ్రెయినేజి, రోడ్లు, విద్యుత్ సౌకర్యం లేనందువల్ల రాత్రివేళల్లో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురికావల్సి వస్తున్నట్లు యాత్రదృష్టికి తీసుకువచ్చారు. కెవిపిఎస్ డివిజన్ అధ్యక్షులు డి.దేవసహాయం మాట్లాడుతూ చాల గ్రామాల్లో దళితులు వివక్షతకు గురవుతూనే ఉన్నారని చెప్పారు. దళితులకు కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడమూ వివక్షేనన్నారు. సామాజిక చైతన్య యాత్రల ద్వార దళిత, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని ఈనెల 23న కలెక్టరుకు వివరించి సమస్యలను పరిష్కరించాలని కోరనున్నట్లు చెప్పారు. యాత్రల్లో సంఘం డివిజన్ కార్యదర్శి కె.నాగేశ్వరరావు, జి.యేసు, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి పి.అంజయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మేడికొండూరు
కెవిపిఎస్ సత్తెనపల్లి డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సైకిల్‌యాత్ర ఆదివారం మేడికొండూరుకు వచ్చింది. మండలంలోని కొర్రపాడు, జంగంగుంట్లపాలెం, వెలవర్తిపాడు, సిరిపురం గ్రామాల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కాలనీల్లోని ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తమ సమస్యలను కెవిపిఎస్ నాయకులకు విన్నవించారు. దళిత, గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిపై ప్రజలను చైతన్యం చేసి పోరాడేందుకే యాత్ర చేపట్టినట్లు కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి గంజిమాల రవి చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేకా రవి, మండల నాయకులు కె.ఇన్నయ్య, నారాయణ, నాగమల్లేశ్వరరావు, సత్తెనపల్లి డివిజన్ రైతుసంఘం నాయకులు బొట్ల రామకృష్ణ పాల్గొన్నారు.