ఎవరి మేలు కోసం భూమి హక్కుల చట్టం?

about land title lead act uses impacts on farmers problems article

రాష్ట్ర ప్రభుత్వం భూహక్కుల చట్టం ఎ.పి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 27/ 2023 అక్టోబర్‌ 31 నుండి అమలులోకి వచ్చే విధంగా జీవో నెంబర్‌ 572 విడుదల చేసింది. ఈ చట్టం వల్ల రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని రైతులకు సమగ్ర హక్కుల రికార్డు తయారవుతుందని చెప్తున్నది.కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ లోని నీతి ఆయోగ్‌ ఈ చట్టాన్ని ప్రతిపాదించింది. మోడల్‌ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రూపొందించింది. అన్ని రాష్ట్రాలు చట్టాలు చేయాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం, రాష్ట్రపతి ఆమోదం పొందడంతో అక్టోబర్‌ 31 నుండి అమలుకు పూనుకున్నది. కేంద్ర ప్రభుత్వం మోడల్‌ యాక్ట్‌ రూపొందించే క్రమంలో కొన్ని నిర్ధారణలు ప్రకటించింది.

1.దశాబ్దాల పాటు (సగటు 20 సంవత్సరాలు) సాగుతున్న కోర్టు లిటిగేషన్లను అరికట్టి మూడు సంవత్సరాలలో ప్రజలకు వివాదాలు లేని రికార్డు తయారు చేయడం.

2. ప్రభుత్వానికి, పెట్టుబడిదారులకు, మౌళిక సదుపాయాలు కల్పించే వారికి అవరోధాలు లేకుండా చూడడం-భూమి మార్కెట్‌ను అభివృద్ధి పరచడం.

3. పట్టణ, గ్రామీణ సంస్థల ఆదాయాలు పెంచడం.

4. సన్న చిన్నకారు రైతులకు పరపతి కల్పించడం.

5.పట్టణీకరణలో పెరుగుతున్న గృహ అవసరాలు తీర్చడం.

6. బినామీ ట్రాన్సాక్షన్లు అరికట్టడం, బ్లాక్‌ మనీని అరికట్టడం.ఈ అంశాలను సాధించాలంటే అన్ని రాష్ట్రాలు చట్టం చేయాలంది. అలా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసి అమలులోకి తెచ్చింది. రూల్స్‌ విడుదల చేయవలసి ఉంది. ఈ చట్టం అమలుకు గాను మూడు స్థాయిలలో (1. భూమి రిజిస్ట్రేషన్‌ అధికారి, 2. అప్పిలేటు అధికారి, 3 భూమి ప్రాధికార సంస్థ) నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది.

 

  • భూ సర్వే

రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల నుండి భూముల సర్వే కార్యక్రమం జరుగుతుంది. సర్వేయర్ల ద్వారా కాకుండా డ్రోన్ల ద్వారా సర్వే జరుగుతుంది. వ్యవసాయ భూములతో పాటు గ్రామ కంఠాలు, మంద బయళ్ళు, తదితర భూములన్ని సర్వే చేస్తున్నారు. ఈ సర్వేను పరిశీలిస్తే సరిహద్దులు సక్రమంగా రావడం లేదని వాస్తవ విస్తీర్ణానికి, డ్రోన్‌లు చూపిస్తున్న విస్తీర్ణానికి పొంతన ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సర్వే పూర్తయిన గ్రామాలలో పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నారు. ల్యాండ్‌ పార్సిల్‌లో ఉన్న రైతులందరికీ జాయింట్‌ పట్టాలు ఇస్తున్నారని, క్రయ విక్రయాలకు బ్యాంక్‌ తనఖాలకు అందరి ఆమోదం కావాలన్న షరతు ఉన్నదని విమర్శలు వచ్చాయి. భూమి రిజిస్ట్రేషన్‌ అధికారిగా స్థానిక ఎమ్మార్వో ఉండాలి. సంచార మొబైల్‌ ఎమ్మార్వోగా మరొకరిని నియమించారు.

భూ సర్వే పూర్తయిన క్రమంలో గ్రామాలలో రిజిస్ట్రేషన్‌ అధికారి రికార్డులలో నమోదు చేయాలి. భూమి కలిగిన యజమాని నివాస గృహం లేదా స్థలం కలిగిన యజమాని తమకు ఉన్న హక్కు పత్రాలను రిజిస్ట్రేషన్‌ అధికారికి అందించాలి. అన్నీ సక్రమంగా ఉంటే నమోదు చేస్తారు. కోర్టు లిటిగేషన్‌ ఉన్నా, సరిహద్దు వివాదం ఉన్నా, దాయాదుల తగాదాలు ఉన్నా రిజిస్ట్రేషన్‌ అధికారికి రాతపూర్వకంగా ఇవ్వాలి. ఈ లిటిగేషన్లన్నీ రిజిస్టర్‌లో నమోదు చేసి అప్పిలేట్‌ అధికారికి తెలియజేస్తారు. రైతుకు పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చినా రిజిస్ట్రేషన్‌ అధికారి దగ్గర డిజిటలైజ్‌ చేసినదే అధికారయుతంగా ఉంటుంది. ఇది మార్పు చేసే అవకాశం ఉంటుంది. ఇది రైతుకు ఏ మాత్రం క్షేమకరం కాదు. రైతుకు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకం అధికార పత్రంగా ఉండాలి. రికార్డు అయిన రెండు సంవత్సరాల లోపల ఎవరైనా అప్పీలు అధికారికి అభ్యంతరం దాఖలు చేయవచ్చు. నిరూపణ అయ్యేవరకు పెండింగ్‌లో ఉంటుంది. చట్టంలోని 64వ క్లాజు ప్రకారం నిరూపించుకోలేకపోతే ఆ రైతుకు లేదా స్థల యజమానికి ఆరు మాసాల జైలు, రూ.50 వేలు జరిమానా విధించవచ్చు.

  • అప్పిలేటు అధికారి

జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ హోదాకు తగ్గని అధికారిని అప్పిలేటు అధికారిగా నియమిస్తారు. రిజిస్ట్రేషన్‌ అధికారుల నుండి వచ్చిన, నేరుగా రైతులు లేదా ఇతరుల నుండి వచ్చిన ఫిర్యాదులను ఈ అధికారి విచారించి తీర్పు వెలువరుస్తారు. రెండు సంవత్సరాల వ్యవధిలో తీర్పులు ఇవ్వాలి. అప్పిలేట్‌ అధికారి ఇచ్చిన తీర్పు అంగీకారం కాకపోతే హైకోర్టుకు వెళ్ళాలి. జూనియర్‌, సీనియర్‌ సివిల్‌ కోర్టులకు, జిల్లా కోర్టులకు వెళ్ళకూడదు. సివిల్‌ కోర్టులు, జిల్లా కోర్టులు కలుగజేసుకోకూడదు. సన్న చిన్నకారు రైతాంగం హైకోర్టు దాకా వెళ్లలేరు. వెళ్లినా భూ మాఫియా ముందు నిలువలేరు. రైతాంగానికి న్యాయం అందని ద్రాక్షపండే అవుతుంది. భారత రాజ్యాంగంలోని నాలుగు మూల స్తంభాలలో న్యాయస్థానం ఒకటి తమకు అన్యాయం జరిగినప్పుడు కోర్టును ఆశ్రయించడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు సామాన్య ప్రజానీకానికిి అందుబాటులో ఉండే డివిజినల్‌, జిల్లా న్యాయస్థానాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధం.

 

  • భూ ప్రాధికార సంస్థ

రాష్ట్ర స్థాయిలో ఐదుగురు సభ్యులతో భూప్రాధికార సంస్థ ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 630 జీవో ద్వారా భూ ప్రాధికార సంస్థను నియమించింది. సిసిఎల్‌ఎ ఛైర్మన్‌గాను, సర్వీస్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ను ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ గాను, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌్‌ కమిషనర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సభ్యులుగా భూ ప్రాధికార సంస్థను ఏర్పరిచింది. ఈ సంస్థకు చట్టం రెండు కర్తవ్యాలను నిర్దేశించింది.

1. స్థిర చరాస్తులను సంపాదించడానికి కలిగి ఉండడానికి, ఆస్తికి మార్కెట్‌ను సృష్టించి వ్యయం చేయడానికి దావా వేయడానికి అవకాశం ఇచ్చింది. 2. దస్తావేజులకు, లైసెన్సులకు సంబంధించిన సమాచారం కోసం ఫీజులు నిర్ణయించి వసూలు చేయడం, ప్రభుత్వం నుండి లేదా సంస్థల నుండి సహాయం, గ్రాంట్లు, దానాలు, చందాలను, బహుమతులను, ధర్మాదాయములను స్వీకరించవచ్చు…అని 5వ అధ్యాయం 30, 31 క్లాజులలో స్పష్టంగా పేర్కొంది.

ఈ చట్టం ప్రకారం భ్రూక్రయ విక్రయాలపైన, కట్టడాల పైన, లైసెన్సులపైన ఫీజులు పెంచడం, వసూలు చేయడం, ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు వాటాలు పంచడం చేస్తుంది. ఇప్పటికే ఆస్తులు విలువలు పెంచడం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచడం వల్ల సన్న, చిన్నకారు రైతాంగం పేద మధ్యతరగతి గృహ, స్థల యజమానులు భరించలేనంతగా ఉన్నాయి.

ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను సమీకరించడం వాటిని కార్పొరేట్‌ కంపెనీలకు, రియల్టర్లకు అమ్మే అధికారం పొందింది. అందుకు అనుగుణంగానే ఈ చట్టం ఆమోదించిన వెంటనే రాష్ట్రంలో 15 లక్షల 56 వేల మంది దగ్గరున్న 26 లక్షల ఎకరాల బంజరు భూములపై ఉన్న నిషేధాన్ని 35వ నెంబర్‌ జీవో ద్వారా ఎత్తివేసింది. ఇటీవల కాలంలో షరతులతో దళితులకు, గిరిజనులకు ఇచ్చిన బీ ఫారం భూములను సైతం భూ ప్రాధికార సంస్థ స్వాధీనం చేసుకునే అవకాశం కలిగింది. సహాయం, దానములు, చందాలు, బహుమతులు ఇవ్వగలిగిన కార్పొరేట్‌ కంపెనీలకు పేదల భూములు గుంజుకోవడానికి రాజమార్గం ఏర్పడింది.

గతంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులకు, రైల్వే లైన్‌లకు 500 మీటర్ల వరకు గల భూములలో నిర్మాణాలకు నిషేధం విధించింది. కోస్టల్‌ రెగ్యులేటెడ్‌ జోన్‌ పరిధిని మరొక 500 మీటర్లకు పెంచింది. అనంతపురం అమరావతి జాతీయ రహదారి ప్లానులో అవసరమైన దానికన్నా వెడల్పును రహదారుల జంక్షన్లో అదనపు భూములను తీసుకోవడానికి నోటిఫికేషన్‌ కూడా ఇచ్చిన విషయం విదితమే.

అదానీ, అంబానీల వంటి కార్పొరేట్‌ కంపెనీలకు గిడ్డంగుల నిర్మాణానికి, వ్యాపార కారిడార్లు ఏర్పరచుకోవడానికి ఈ చట్టం బాగా ఉపకరిస్తుంది. భూ ప్రాధికార సంస్థకు అధికారాన్ని కట్టబెట్టడం కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసమేననడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈ భూ హక్కుల చట్టం రద్దుకు పోరాడవలసి ఉంది.

వ్యాసకర్త : వై. కేశవరావు, సీనియర్‌ రైతు నాయకులు

➡️