దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి అధికాభివృద్ధి బాటను పడుతుందని, అయితే అధిక ద్రవ్యోల్బణం, భారీ రుణాల సవాళ్ళు ఎదురవుతున్నాయని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సాధారణ బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చకు ముగింపు పలుకుతూ ప్రణబ్ 'మెరుగైన పరిస్థితులవైపు మనం పయనించాల్సి ఉంది, అభివృద్ధి దిశలో 9 శాతం నుండి 10 శాతం వృద్ధిని సాధించొచ్చు. ఇది పగటి కల కాదు' అని అన్నారు. ప్రభుత్వం 2010-11కి ఆర్థిక వృద్ధిని స్థూల జాతీయ ఉత్పాదకత (జిడిపి)లో 8.5 శాతం సాధించింది, సమీప భవిష్యత్తులో 10 శాతం వృద్ధి కూడా సాధ్యమే. అయితే అధికంగా ఉన్న ద్రవ్యోల్బణం అభివృద్ధి ప్రయోజనాలను తినేయగలదని ప్రణబ్ హెచ్చరించారు. ధరలను తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకున్నప్పటికీ, ద్రవ్యోల్బణం కనిష్ట ఆధారం (లో బేస్) కారణంగా వచ్చే నెలలో 10 శాతానికి చేరుకుంటుందని ఆయన అన్నారు. 'మార్చి నెలలో అది (ద్రవ్యోల్బణం) రెండంకెలకు చేరుకున్నా, నేను ఆశ్చర్యపడను' అని ప్రణబ్ వ్యాఖ్యానించారు. లో బేస్ ప్రభావం మరికొద్ది నెలల పాటు ఈ సంవత్సరం మే లేదా జూన్ వరకు ఉంటుందని ఆయన అన్నారు. టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఇప్పటికే (ఫిబ్రవరిలో) 9.89 శాతానికి చేరింది. మార్చికి సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలను ఏప్రిల్ మధ్యకాలంలో ప్రకటి స్తారు. సమాజం లోని బలహీన వర్గాలకు సహాయ పడటానికి కేంద్రం పలు చర్యలు తీసుకుందని ప్రణబ్ తెలిపారు. ధరల పరిస్థితిపై ఒక అవగాహనకు రావడం కోసం ముఖ్యమంత్రులతో త్వరలో ప్రధాన మంత్రి సమావేశమవుతారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, తన వ్యయంతో పాటు రుణ సమీకరణ లక్ష్యాలను కూడా ప్రభుత్వం నియంత్రించుకోవలసిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 'మనం ఆర్థిక దుబారాకు పాల్పడినట్లయితే, మన ద్రవ్య పరపతి తీవ్ర సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. ఇది జరిగే పని కాదు...ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనం రూ.4 లక్షల కోట్ల రుణాన్ని తీసుకోవలసి ఉంటుంది. అపరిమిత రుణాలపై జీవించడం సాధ్యపడదు' అని ప్రణబ్ ముఖర్జి అన్నారు.