మరో మూడు వారాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2012-13) ముగియనుండటంతో ప్రభుత్వ రంగ కంపెనీల (పిఎస్‌యు) వాటాల అమ్మకాలను యుపిఎ-2 సర్కార్ వేగవంతం చేస్తోంది. తన పంతాన్ని నెగ్గించుకోవడానికి మార్చి 31లోగా నాలుగు పిఎస్‌యుల్లోని సుమారు రూ.5,500 కోట్ల విలువ చేసే వాటాలను ఉపసంహరించు కోవడానికి షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది. సెయిల్, నాల్కో, ఎమ్‌ఎమ్‌టిసి, ఆర్‌సిఎఫ్ వాటాలను విక్రయించనుంది.
రాష్ట్రీయా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్‌సిఎఫ్) వాటాను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా 12.5 శాతం వాటాను డిజిన్వెస్ట్‌మెంట్ చేయనుంది. రూ.45 చొప్పున 6.89 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.310 కోట్లు సర్కార్ తన ఖజానాలో వేసుకోనుంది. ప్రస్తుతం ఆర్‌సిఎఫ్‌లో ప్రభుత్వానికి 92.5 శాతం వాటా ఉంది. ఈ కంపెనీలోని వాటా విక్రయానికి గత డిసెంబర్‌లోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
నాల్కోలో 12.15 శాతం వాటాను వచ్చే వారంలో విక్రయించడానికి ప్రభుత్వం సిద్దం అయ్యింది. అదే విధంగా సెయిల్‌లో 10.82 శాతం వాటాను మార్చి 20న డిజిన్వెస్ట్‌మెంట్ చేయడానికి కేంద్రం ప్రతిపాదనలు చేసింది. మార్చి 14న ఎమ్‌ఎమ్‌టిపి వాటా విక్రయం జరుగనుందని తెలుస్తోంది. ఈ నాలుగు కంపెనీల వాటాలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా డిజిన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా రూ.5,000-5,500 కోట్లను ఆర్జించాలని కేంద్ర నిర్ణయించుకుంది. ఒక్క సెయిల్ వాటా విక్రయం ద్వారా రూ.3,000 వరకు సమకూరవచ్చని ప్రభుత్వం అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ కంపెనీల్లోని రూ.21,500 కోట్ల విలువ చేసే వాటాలను ఉపసంహ రించుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2013-14లో ఏకంగా రూ.55 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ కంపెనీల వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయిం చుకుంది.