రాష్ట్రంలోని చిన్న పట్టణాల్లో కూడా తమ ప్రత్యేక స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించు కున్నామని వుడ్‌లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్‌కిరట్ సింగ్ తెలిపారు. తమ సంస్థకు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 350 స్టోర్లున్నాయని చెప్పారు. ఈ ఏడాది ముగిసే కల్లా 400 శాఖలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విస్తరణలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ కల్లా రాష్ట్రంలో 10 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు, దీంతో రాష్ట్రంలో వుడ్‌లాండ్ స్టోర్లు 23కు చేరుకోనున్నాయని చెప్పారు. ప్రతి స్టోర్ ఏర్పాటుకు రూ.1.5 కోట్ల నుంచి 2.5 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్ల్లు తెలిపారు. స్టోర్ల ఏర్పాటులో హైదరాబాద్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వనన్నట్లు తెలిపారు. ఈ విస్తరణలో భాగంగా చిన్న పట్టణాల్లో కూడా తమ స్టోర్లను ఏర్పాటు చేయడానికి ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2011-12లో రూ.700 కోట్ల టర్నోవర్‌ను సాధించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి తట్టుకోవడానికి వుడ్‌లాండ్ ప్రత్యేకంగా వస్త్రాలను తయారు చేసిందని చెప్పారు. ఇవి తమ స్టోర్లలో రూ.1500 నుంచి లభ్యమవుతాయని చెప్పారు. ప్రతి ఏడాది 50 లక్షల గార్మెంట్స్, 40 లక్షల పాదరక్షలు తయారు చేయగల సామర్థ్యం తమ కంపెనీకి ఉందని చెప్పారు.