ప్రత్యేక తెలంగాణా కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలని జెఎసి అల్టిమేటమ్ ఇవ్వడంతోబాటు డెడ్ లైన్ కూడా పెట్టింది. ఆ ప్రకారం రాజీనామాలు చేస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందా? ప్రత్యేక తెలంగాణా సమస్యకు సరైన పరిష్కారమేమిటి? ఎ సువర్ణ లక్ష్మి, కర్నూలు.
రాజీనామాలు, రాజకీయ సంక్షోభం వంటి చర్యల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు. అవి కేవలం రాజకీయ ఎత్తుగడలే కావచ్చు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయోగిస్తున్న అస్త్రాలు కూడా కావచ్చు. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వాలను కూల్చొచ్చు లేదా మార్చొచ్చు. దాంతో పరిష్కారమయ్యే సమస్య కాదిది. తెలంగాణా ప్రజలు కోరుకుంటున్నదీ అదికాదు. ఈ సమస్యను కాంగ్రెసే సృష్టించింది. అదే అందులో ఇరుక్కుపోయింది. ప్రజల మనోభావాలతో రాజకీయ చదరంగం ఆడుతున్నది. వారికి తెలంగాణా ప్రజల ప్రయోజనాల కన్నా తమ స్వంత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ఉంది. ఇలాంటి తీవ్రమైన, సున్నితమైన సమస్యతో చెలగాటమాడటం ప్రమాదకరం. ఈ సమస్యకు పరిష్కారం చర్చలు, సంప్రదింపులు తప్ప మరో మార్గం లేదు. అందుకు అన్ని రాజకీయపార్టీలు దారి సుగమం చేయాలి. చర్చల దారుల్ని మూసేస్తే మిగిలేది ప్రజలకు క్షోభే.
కమ్యూనిస్టు ఉద్యమం గర్వించదగ్గ నాయకుడు, అసలు సిసలైన ప్రజా నాయకుడు జ్యోతిబసు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో సైన్యం నిర్వహించింది. పార్టీనే ఆ కార్యక్రమం నిర్వహిస్తే బాగుండేది కదా? దీనిపై మీరేమంటారు? జి ప్రకాశరావు, హైదరాబాద్
జ్యోతిబసు అంత్యక్రియలు అధికారలాంఛనాలతో జరిగిన మాట యదార్ధం. అయితే అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. అక్కడున్నది వామపక్ష ప్రభుత్వం. దానికి సారథ్యం వహిస్తున్నది సిపిఐ(యం). ఆ పార్టీకి నాయకుడుగానే కాకుండా ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రముఖనాయకునికి అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించడం సబబు, ప్రజాసమ్మతం కూడా.
అధిక ధరలపై వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. గతంలోనూ చేశాయి. కానీ, ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అలాంటప్పుడు ఈ ఆందోళనల వల్ల ప్రయోజనముంటుందంటారా? డి సాయికిరణ్, నూజివీడు, కృష్ణాజిల్లా.
వామపక్షాల ఆందోళనలతో ధరలు తగ్గుతాయన్న భ్రమలు కమ్యూనిస్టులకు ఎన్నడూ లేదు. ప్రజలకు అలా ఉంటే అది సరికాదు. అలా జరిగితే ఇక ఈ సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది. అన్నీ ఈ వ్యవస్థలోనే పరిష్కరించుకోవచ్చు. ధరల పెరుగుదల అనేది పెట్టుబడిదారీ వ్యవస్థతో విడదీయరాని అంశం. దీన్ని సంపూర్ణంగా నిర్మూలించేంతవరకు ధరల అదుపు సాధ్యం కాదు. అయితే ఆందోళనలు ఎందుకు చేస్తున్నట్లన్న సందేహం రాకమానదు. ఆందోళనవల్ల ప్రభుత్వాలపై ప్రజల ఒత్తిడి పెరిగి పెంపుదలవేగాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు. అంతేకాదు పేదలకురేషను వంటి కొన్ని సౌకర్యాలనైనా సాధించుకోవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా పేదలకు కొంతవరకు ఉపశమనం కల్పించవచ్చు. ఉదాహరణకు మన రాష్ట్రంలో ఉన్న కిలో రెండు రూపాయల బియ్యం, ఉచిత విద్యుత్ వంటివి అలా సాధించుకున్నవే. అయితే అదే సమయంలో ఈప్రభుత్వాలు ప్రజలకిచ్చే సౌకర్యాల భారాన్ని మరో రూపంలో మరల వారిపైనే మోపుతున్నాయి. ప్రస్తుతం వ్యాట్‌రూపంలో పన్నుల పెంపుదల అలాంటిదే. మరల వీటిపైనా పోరాడాలి. ఈ వ్యవస్థ అంతిమంగా మారేదాకా ఈపోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయిలోని ఉత్తరాది ఉద్యోతగులకు వ్యతిరేకంగా దాడులు చేసిన పార్టీకి ఆస్ట్రేలియా జాత్యహంకారాన్ని గురించి మాట్లాడుతోంది. దీనిని మీరు ఏవిధంగా విశ్లేషిస్తారు? కె మల్లేష్ గౌడ్, పటాన్‌చెరు.
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదే. స్వదేశంలో మరాఠీయేతరులపై దాడులు చేస్తూ ఆస్ట్రేలియాలో భారతీయుల సంక్షేమం గురించి మాట్లాడటం నీచ నికృష్ట రాజకీయం. ఇలాంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలి.