సమాలోచన

అఫ్జల్‌ గురు ఉరితీతకు, హైదరాబాద్‌లో పేలుళ్లకు మధ్య సంబంధం ఉందని నిరూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే నగరంలో కొద్ది నెలల క్రితమే ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉండవచ్చునని ఎలా చెబుతున్నారు?

ఎం జానకీలక్ష్మి, హైదరాబాద్‌

హైదరాబాద్‌ బాంబు పేలుళ్లకు పాల్పడ్డ శక్తులేమిటి? ఎందుకు పాల్పడ్డారన్న దానిపై ప్రభుత్వం ఇంత వరకూ ఇతమిద్ధంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇంత వరకూ ఏ సంస్థా ఈ ఘటనకు తామే కారకులమని ముందుకు రాలేదు. విచారణ జరుగుతోంది. మీ ప్రశ్నకు దర్యాప్తు సంస్థలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ దుర్మార్గానికి ఎవరు ఏ కారణం చేత పాల్పడ్డా అది అతి కిరాతకం, అనాగరికం. ఏ కారణంతో చేసినా దాన్ని సమర్థించుకోలేరు. అఫ్జల్‌ గురు ఉరికి ప్రతీకారంగా చేసినా అది సమర్థనీయం కాదు. ఈ ఉరితో ఏ సంబంధం లేని అమాయకుల ప్రాణాలు తీశారు. చనిపోయిన వారిలో హిందూ, ముస్లిం, తదితర అన్ని మతాలవారూ ఉన్నారు. ప్రభుత్వ అసమర్థత, యంత్రాంగం నిర్లిప్తత ఇలాంటి ఘటనలకు కారణం. సమాజంపై అసంతృప్తితో కొందరు యువకులు ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సామాజిక సమస్యలు పరిష్కరించకుండా సామాజిక అశాంతిని తొలగించలేం. అలాగే ప్రజలు కూడా ఇలాంటి ఉగ్రవాద శక్తుల పట్ల జాగరూకతతో ఉంటూ సమాజంలో వారికి స్థానం లేకుండా చేయాలి.

ఇటీవల నిర్వహించిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిస్పందన లభించింది. పదకొండు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెతోనైనా ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటుందని భావించడం అత్యాశే అవుతుందని అది చేస్తున్న ప్రకటనలతో స్పష్టమవుతోంది. మరి ప్రభుత్వ మెడలు వంచి కార్మికులకు ప్రయోజనం చేకూర్చేది ఎలా? ప్రభుత్వం నుంచి సరైన ప్రతిస్పందన లభించకపోతే సమ్మె విజయవంతమైనట్లు ఎలా చెబుతారు?

ఎ శ్రీదేవి, నర్సాపురం

కార్మిక రాజ్యంలోనే కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు సంపూర్ణ గ్యారంటీ లభిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం, దాని విధానాలు బడా కార్పొరేట్‌, విదేశీ పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నాయి. దాన్ని ప్రతిఘటించడంలో భాగంగానే ఈ రెండు రోజుల సాధారణ సమ్మె జరిగింది. ప్రతిఘటనోద్యమం బలపడేకొద్దీ పాలకుల దుష్ట విధానాల వేగానికి తెర పడుతోంది. ప్రజలపై దాడి వేగాన్ని తగ్గించుకోవడమో, కొన్ని సమస్యలనైనా పరిష్కరించడమో, కొన్ని తప్పుడు విధానాల నుంచైనా వెనక్కి తగ్గడమో చేయక తప్పదు. కాదని మూర్ఖంగా ముందుకు పోరని కూడా చెప్పలేం. అప్పుడు ప్రజలు, కార్మికులు కూడా రాజకీయ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించుకోవాలి. సమ్మెతోనే ఈ వ్యవస్థలో అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని భావించడం భ్రమే అవుతుందన్న కార్మిక నాయకుల వాదన నిజమే. అందుకే కార్మికులు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలి. రాజకీయంగా సంఘటితం కావాలి. తమ స్వంత పార్టీలను బలపరుచుకోవాలి. సమ్మె వంటి తీవ్ర ప్రతిఘటనకు సిద్ధపడకపోతే మరిన్ని ఎక్కువ భారాలు మోయక తప్పదు. ఆ రీత్యా సమ్మె విఫలం కాదు. దాని ఫలాలు భవిష్యత్తులో చూస్తాం.

మధ్య యుగాల నాటి మరణ దండనను అభివృద్ధి చెందిన దేశాలు చాలా వరకు ఇప్పటికే నిషేధించాయి. ఆధునిక దేశంగా చెప్పుకునే మన భారత్‌లో మాత్రం ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇది సరైనదేనా? అలాగే ఇంకొక చిన్న విషయం. ఈనెల 9న ఉరితీయబడ్డ అఫ్జల్‌ గురు ముస్లిం కాకుంటే ఆ శిక్ష అమలు జరిగేదా? దయచేసి వివరించగలరు.

కె శరత్‌, హైదరాబాద్‌

ఈ ఆధునిక యుగంలో కూడా ఉరిశిక్షను కొనసాగించడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. భారత శిక్షా స్మృతి(ఐపిసి)లోని ఈ క్లాజును సమీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన దేశంలో అరుదులో అరుదైన ఘటనలో మాత్రమే ఉరిశిక్ష వేస్తున్నారు. దాన్ని అమలు చేయడంలో కూడా తొందరపాటు జరక్కుండా కొన్ని చట్టబద్ధ రక్షణలు కల్పించారు. కానీ అఫ్జల్‌గురుకు వేసిన ఉరిశిక్షను అమలు చేయడంలో ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శించింది. రాజకీయ కారణాలే దీనికి మూలమని అర్థమవుతోంది. దీన్ని 'మతం' దృష్టితో చూడటం తప్పు. బిజెపి దానికి మతం రంగు పులిమి రాజకీయంగా లాభపడాలని చూస్తోంది. హిందూ, ముస్లిం మతోన్మాదాలు రెండూ ప్రజలను చీల్చి విద్వేషాలను సృష్టిస్తున్నాయి. దానివల్ల మత సామరస్యం దెబ్బతిని ప్రజల మధ్య శాశ్వతంగా అఘాతం ఏర్పడుతోంది. గతంలో శ్వేతజాతి వాడు పాటించిన 'విభజించు- పాలించు' అన్న రాజనీతినే నేటి మన పాలకులు కూడా అనుసరిస్తున్నారు. దీనికి ప్రజలు గురి కాకుండా లౌకిక, ప్రజాస్వామ్య దృక్పథాలతో వ్యవహరించాలి. అభ్యుదయవాదులు ప్రజల్ని ఏకం చేయడానికి ఇలాంటి మతోన్మాద, ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలి.