సమాలోచన (30.01.2013)

తెలుగులో 'మార్క్సిజం' ఓ సిలబస్‌గా బుక్‌ సిరీస్‌ ఉందా? ఉదాహరణకు మార్క్స్‌ కేపిటల్‌ పరిచయం పేరుతో రంగనాయకమ్మ చేసిన కృషి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేయలేదనే చెప్పాలి. చేసినా తేలికగా అర్థమయ్యేలా వచ్చిన పుస్తకాలు లేవనేది నా అభిప్రాయం. మార్క్సిస్టు అధ్యయనానికి సంబంధించి సాహిత్యం ఒక ఆర్డరులో అందరికీ లేక ఆసక్తి ఉన్నవారికి అర్థమయ్యేలా తగినంత కృషి జరగడం లేదనిపిస్తోంది.

పల్లా కొండలరావు, రాయనపేట, ఖమ్మం

మార్క్సిజం గురించి పాఠాలు చెప్పదలచుకున్న ఉపాధ్యాయుల కోసం వివిధ అంశాలపై ఒక క్రమపద్దతిలో ప్రచురించిన పుస్తకాలున్నాయి. సిపిఐ(యం) కేంద్ర, రాష్ట్ర కమిటీలు ప్రచురించిన సిలబస్‌ పుస్తకాలు మీకు ఆయా పార్టీ కార్యాలయాల్లో కానీ లేదా ప్రజాశక్తి బుక్‌షాపుల్లో కానీ లభిస్తాయి. ఇక తేలిగ్గా అర్థమయ్యే భాషలో మార్క్సిస్టు పరిచయమాలను తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. వీటిని కమ్యూనిస్టు పార్టీ సభ్యులే కాకుండా మార్క్సిస్టు మేధావులు కూడా రాశారు. అలాంటి వాటిని మీరు చదవొచ్చు. రాజకీయ అర్ధశాస్త్రం పేరుతో వచ్చిన అనేక పుస్తకాలు మార్క్స్‌ కేపిటల్‌కు అనుసరణే. అప్పటి నుంచి తాజా ప్రపంచీకరణ వరకూ రాజకీయ అర్ధశాస్త్రంపై చాలా పుస్తకాలే వచ్చాయి. మీకు ఏ అంశంపై ఏ పుస్తకం కావాలో ప్రజాశక్తి బుకహేౌస్‌ వారిని సంప్రదిస్తే తగిన సలహా ఇవ్వగలుగుతారు. మీరన్నట్లు ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉన్నది. అంతేకాదు ఆ అవసరం పెరిగింది కూడా. దానికి తగిన విధంగా రాబోయే కాలంలో కృషి జరగాలి.

వాల్‌మార్ట్‌ మన దేశంలో రిటైల్‌ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా లాబీయింగ్‌ నెరిపేందుకు 2008 నుంచి 25 మిలియన్‌ డాలర్లు (రూ.135 కోట్లు) వెచ్చించినట్లు వెల్లడించినా ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పైగా లాబీయింగ్‌కు చట్టబద్ధత కల్పించేందుకు ఒక చట్టం తీసుకొస్తామని కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖర్షీద్‌, కాంగ్రెస్‌ నాయకుడు మనీష్‌ తివారీ వంటి వారు చెబుతున్నారు. లాబీయింగ్‌ తప్పు కాదా? తప్పు అయినప్పుడు చట్టం ఎలా తెస్తారు? దయచేసి వివరించగలరు.

కె శరత్‌, హైదరాబాద్‌

వివిధ కార్పొరేట్‌ కంపెనీలు మార్కెట్‌లో ఆధిపత్యం సంపాదించడానికి ప్రభుత్వంతో లాబీయింగ్‌ చేస్తుంటాయి. అమెరికాలో ఇలాంటి లాబీయింగ్‌ను చట్టబద్ధం చేశారు. అలాగే మన దేశంలో కూడా చట్టబద్ధం చేయాలని కొందరు వాదిస్తున్నారు. ఇది శుద్ధ తప్పు. పెట్టుబడిదారులు డబ్బులు వెదజల్లి పనులు చేయించుకుంటారు. మరి ప్రజల పరిస్థితి ఏమిటి? వారి తరపున పోరాడి సాధించాల్సిన ప్రజా ప్రతినిధులు కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పనిముట్లుగా మారిపోతున్నారు. ఈ స్థితిలో లాబీయింగ్‌ను చట్టబద్ధం చేయడమంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించడమే. లాబీయింగ్‌కు, అవినీతికి అతి సన్నిహిత సంబంధం ఉంది. 2జి స్పెక్ట్రంలో నీరా రాడియా వ్యవహారం మనం చూశాం. దాని వల్ల దేశానికి ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చిందో కూడా గమనించాం. తాజాగా వెలుగులోకి వచ్చిన వాల్‌మార్ట్‌ కథ కూడా అలాంటిదే. అనుభవం నుంచి నేర్చుకోకుండా లాబీయింగ్‌ పేరుతో అవినీతిని చట్టబద్ధం చేయాలనడం బాధ్యతారాహిత్యం. ప్రజా ప్రతినిధులు ప్రజలకిచ్చిన వాగ్దానాల మీద కేంద్రీకరించాలే తప్ప ఇలాంటి లాబీయింగ్‌లకు లొంగిపోకూడదు. కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ము కాసే ఇలాంటి ప్రజా ప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించే చట్టం తేవాలి.

కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల జైపూర్‌లో మేధోమథనం సదస్సు జరుపుకుంది. అలాగే ప్లీనరీలు కూడా జరుగుతాయి. ప్లీనరీకి, మేధోమథన సదస్సుకి తేడా ఏమిటి? ఈ రెండు రకాల సమావేశాలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?

- వి రాజ్‌కుమార్‌, హైదరాబాద్‌

కాంగ్రెసు నిర్వహణకు ఒక విధివిధానమంటూ లేదని స్వయంగా రాహుల్‌ గాంధీయే ఇదే జైపూర్‌ సమావేశంలో చెప్పారు. అధినాయకత్వం ఏది చెపితే అదే విధానం, అదే సూత్రం, అదే నిర్మాణం. అవసరాన్ని బట్టి పేర్లు పెట్టుకోవడం కాంగ్రెస్‌కు ఆనవాయితీ. సాధారణంగా ప్లీనరీ అనే పదాన్ని ఒక కమిటీ విస్తృత రూపానికి వాడతారు. ఇక్కడ మేధోమథన సదస్సు అంటే ఒక వ్యూహాన్ని రూపొందించుకోవడానికి అవసరమైన వారిని ఆహ్వానించి చర్చించుకోవడం. ఎవరిని ఆహ్వానించాలో అధినాయకత్వమే నిర్ణయిస్తుంది. కమ్యూనిస్టుపార్టీల్లో లాగా ప్రతినిధుల్ని ఎన్నుకునే విధానం కాంగ్రెస్‌లో లేదు. కాంగ్రెస్‌లో ఇలాంటి మేధోమథన సదస్సులు గతంలో కూడా జరిగాయి. ఉదాహరణకు 1998లలో పాంచిమడిలో జరిగింది.

మన రాష్ట్ర రాజకీయాలలో జగన్‌ జైలు కేసు నేపథ్యంలో 'క్విడ్‌ ప్రొ కో' (ఇది నీకు అది నాకు) బాగా చర్చనీయాంశంగా మారింది. పై వాక్యం అర్థం ఏమిటి? అది దేన్ని ఉద్దేశించి వాడుకలోకి వచ్చింది?

- జి అశోక్‌, కరీంనగర్‌

క్విడ్‌ ప్రొ కో అనేది లాటిన్‌ పదం. అంటే తెలుగులో ఇచ్చిపుచ్చుకోవడం అని అర్థం. నువ్వు నాకు ఫలానా సహాయం చేస్తే దానికి బదులుగా నీకు అంతే విలువ కలిగిన మరో సహాయం చేస్తాను అనుకోవడం. దీన్ని మాటల్లో చెప్పుకోకపోయినా ఆచరణలో దాన్నే చేస్తారు. అధికారంలో ఉన్నవారు తమ వారికి అనుకూలంగా కొన్ని పనులు చేసి పెడితే దానికి బదులుగా వేరే రూపంలో ఆ నాయకులకు పనులు చేయించుకున్నవారు సహాయం చేస్తారు. ఆ అర్థంలోనే ప్రస్తుతం దీన్ని వాడుతున్నారు. వైయస్‌ హయాంలో జరిగిన తతంగంపై జగన్‌ కేసు సందర్భంలో ఈ పదజాలం వాడుకలోకి వచ్చింది.

నేను ఒక సందర్భంలో సిపిఎం హోల్‌టైమర్‌, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుని కలిశాను. నాకు సిపిఎం పట్ల ఎనలేని గౌరవం ఉంది. అందువల్ల కేవలం పార్టీ సభ్యులు చెల్లించే లెవీలు, ప్రజల నుంచి వసూలు చేసే చిన్న మొత్తాలతో హోల్‌టైమర్ల అలవెన్సులు, ఇతర ఖర్చులు భరించడం పార్టీకి కష్టం కదా! అందువల్ల పార్టీ సభ్యులు, సానుభూతిపరులుగా ఉన్న విద్యాధికుల సేవలు ఉపయోగించి పేదలకు తక్కువ ఫీజుతో కాంపిటీటివ్‌ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చి తద్వారా నిధులు సమకూర్చుకోవచ్చు, అదే సందర్భంలో పేదలకు సేవ చ Publiture