సమాలోచన 16-01-2013

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్రంలో మాతృభాషాభివృద్ధికి, బోధనాపరంగా, పాలనాపరంగా తెలుగు అమలుకు పటిష్ట చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి హామీలు గుప్పించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని అత్యధిక ప్రయివేటు పాఠశాలలు, కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను బోధిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమంలోనే తమ పిల్లలను చదివించేందుకు తహతహలాడుతున్నారు. ఆయా పాఠశాలల్లో శిశు నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థుల్లో అత్యధిక మందికి కనీసం 'అ, ఆ'లు కూడా తెలియదన్నది జగమెరిగిన సత్యం. వారికి 'పాఠశాల' అనే పదం కన్నా 'స్కూల్‌' అంటేనే సులభంగా అర్థమవుతున్న దుస్థితి నెలకొంది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మరోవైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలంటే ఆంగ్ల భాష నామమాత్రంగానైనా తెలుసుకోక తప్పని పరిస్థితి. ఈ రెండు విషయాల మధ్య వైరుధ్యాన్ని నివారించాలంటే ప్రభుత్వం పాఠశాలల్లో బోధనాపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? తద్వారా చిన్నారులు, విద్యార్థులు తెలుగును విస్మరించకుండా, ఆంగ్లంలో వెనుకబడకుండా ఉండేందుకు ఎలా సహకరించాలి?

-బివియన్‌ పద్మరాజు, హైదరాబాద్‌

భాష, సంస్కృతులు విడదీయరాని పరస్పరాధారితాలు. ఒక జాతికి భాష కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. భాష అభివృద్ధి ఆ జాతి సాధించిన ఆర్థికాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీషుకు అంత ప్రాధాన్యత రావడానికి కారణం ఆ దేశాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగమించడమే. గతంలో బ్రిటన్‌ అగ్రభాగాన ఉన్నప్పుడు బ్రిటీషు ఇంగ్లీషు ఆధిపత్యంలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. అందుకే ఇంగ్లీషు రూపం కూడా మారింది. 'యస్‌' స్థానంలో 'యా' వచ్చింది. పదాలు, యాస కూడా మారిపోయింది. చైనా అభివృద్దితో పాటు చైనా భాష కూడా ప్రాచుర్యం పొందుతోంది. మన దేశం కూడా పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి అయితే మన భాషల్ని ఇతరులు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అది లేనందునే మన భాషను మనం కాపాడుకోవడానికి రక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అయినా మాతృభాష ప్రాధాన్యత తగ్గదు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే తెలుగు వెనుకబాటుకు ప్రధాన కారణం. ఐదో తరగతి వరకూ మాతృభాషలోనే విద్యాబోధన శాస్త్రీయం. ఆ తర్వాత కూడా తెలుగు ఒక భాషగా ఉండాలి. కానీ అది కూడా ఇప్పుడు కనుమరుగవుతోంది. స్కోరింగ్‌ కోసమని రెండో భాషగా సంస్కృతాన్ని తీసుకుంటున్నారు. అది కూడా ఇంగ్లీషులోనే రాస్తారు. ఇక భాష వికసించాలంటే ఛాందసత్వం దానికి మార్గం కాదు. ఏ పదం వాడాలి అన్నది కాదు అది ఎలా అర్థమవుతుందన్నమే ముఖ్యం. ఒకప్పుడు తండ్రిని అయ్య అని, బాపు అని రకరకాలుగా సంబోధించేవారు. ఇప్పుడెవరైనా అయ్య అంటే మొరటువాళ్ల కింద చూస్తారు. తెలుగులోనే ఎంత వివక్షతో చూడండి. గోదావరి జిల్లాల్లో నాన్నకు గౌరవాన్ని జోడించి నాన్నగారు అంటారు. అమ్మమ్మ, నాయనమ్మలను కొన్ని చోట్ల అవ్వ అంటారు. అవ్వ అంటే మరికొందరు నవ్వుతారు. మన భాష అనుకునే దానిలోనే ఎన్ని తేడాలున్నాయో చూడండి. ఇక తెలుగులో అనేక ఉర్దూ, హిందీ, సంస్కృత పదాలున్నాయి. సంస్కృతం పండిత భాషే తప్ప పామరులది కాదు. శ్రీకాకుళం, నెల్లూరు, వరంగల్‌, కడప, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రాజమండ్రి ... ఇలా ప్రాంతానికో యాస ఉంది. ఒక చోట గౌరవంగా ఉండే పదం మరో చోట బూతుగా మారుతుంది. దీన్ని అర్థం చేసుకునే తీరులోనే అంతా ఉంది. కనీసం తెలుగు నిఘంటువు కూడా అందరికీ అందుబాటులో లేదు. ఒకప్పుడు వరంగల్‌ తెలుగు భాషా వికాసానికి కేంద్రంగా ఉండేది. తర్వాత అది రాజమండ్రికి మారింది. ఆ తర్వాత విజయవాడ కేంద్రమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు మారింది. అభివృద్దిలో వచ్చిన మార్పులే దీనికి కారణం. రాష్ట్రంలో అభివృద్ది అయిన కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లోని తెలుగే అప్రకటిత అధికార తెలుగుగా చాలా కాలం సాగింది. ఇప్పుడు అభివృద్ది హైదరాబాద్‌కు మారాక తెంగ్లీషు యుగం వచ్చింది. ఏమైనా ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీషు నేర్చుకోవడం అనివార్యం. కానీ తెలుగును నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మన జాతిని అభివృద్ధి చేయడం ద్వారా ఇంగ్లీషు వాళ్లు సైతం తెలుగు నేర్చుకునే విధంగా మార్చొచ్చు. అలాంటి రోజు రావాలని మనమంతా కోరుకుందాం. అందాకా మన మాతృభాషను కాపాడుకుందాం. టీవీ మాధ్యమం వచ్చాక తెలుగుకు మరింత అన్యాయం జరుగుతోంది. అన్ని ఛానళ్ల సంపాదకులూ దీనిపై తీవ్రంగా ఆలోచించాలి. ఉన్నత విద్య, పరిశోధనలను కూడా తెలుగులో ఆరంభించినప్పుడే తెలుగుకు ప్రాధాన్యత పెరుగుతుంది. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టం, ప్రాసెసింగ్‌లను కూడా తెలుగులో ఆరంభించాలి. దానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. నిధులు పెంచాలి. విద్య ప్రైవేటీకరణ విధానం మారకుండా ఇది సాధ్యం కాదు. తద్వారా తెలుగును కొంతవరకైనా కాపాడుకోవచ్చు.