సమాలోచన (09-05-12)

దేశంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోటీశ్వరులు ఆసక్తి చూపుతున్నారు. డబ్బుతో జనం ఓట్లను కొనుక్కొని గద్దెనెక్కుతున్నారు. ఓటు విలువ తెలియని జనానికి ఓటు ఇవ్వడం వల్లే వారు ఇలా అమ్ముకుంటున్నారు. కాబట్టి ధనరాజకీయాలను అరికట్టేందుకు ఓటు విలువ తెలియనివారి ఓటు హక్కును ఎందుకు రద్దుచేయకూడదు?

ఎస్‌ బాలకృష్ణ, కొత్తకోట, మ.నగర్‌ జిల్లా.

ఓటు విలువ తెలియక కాదు. ''విలువ'' తెలుసు కాబట్టే అమ్ముకుంటున్నారు. ఈ వ్యవస్థలో ప్రతిదీ సరుకే. ఓటును కూడా పెట్టుబడిదారులు సరుకుగా మార్చేశారు. రాజకీయాలను వ్యాపారం చేశారు. ఇలాంటి పార్టీలను ఇంటిమార్గం పట్టించే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడమే దీనికి పరిష్కారం. ఇది చాల కష్టసాధ్యమైన పనేననడంలో సందేహం లేదు. కాని ధనరాజకీయాల పీడ విరగ్గొట్టాల్సింది కూడా ఆ ప్రజలే తప్ప మీరో నేనో కాదు. వ్యక్తులుగా ఎవరూ దేన్నీ సాధించలేరు. ప్రజలపై విశ్వాసం పోగొట్టుకోకూడదు. తమిళనాడులో డియంకే డబ్బులు వెదజల్లినా ఇంటిముఖం పట్టించారు ఆ ప్రజలు. కోవూరు ఉప ఎన్నికల్లో అందరికన్నా ఎక్కువ డబ్బు పంచింది కాంగ్రెసే. అయినా వారికి మూడోస్థానమే దక్కింది.. 1977లో ఎమెర్జీన్సీని ఓడించింది, 1983లో రాష్ట్రంలో కాంగ్రెసును గద్దెదించిందీ, 2004లో ప్రపంచబ్యాంకు విధానాలపై తిరుగుబాటు చేసి తెలుగుదేశంపార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందీ ఈ ఓటేనన్న విషయం మరచిపోరాదు. ప్రజలకు ఇంకా కమ్యూనిస్టుల బలంపై నమ్మకం కుదరలేదు. అందుకే బూర్జువాపార్టీల చుట్టూ తిరుగుతున్నారు. వారు పోటీలు పడి జనాన్ని డబ్బులతో కొనుక్కుంటున్నారు. మీరన్నట్లుగా ఓటు అమ్ముకుంటున్నారు కాబట్టి ఆ హక్కే తీసేస్తే మిగిలేది ధనవంతులే. ప్రస్తుతం ఓట్ల కోసమైనా ప్రజలకు కొన్నయినా పనులు చేయాల్సి వస్తోంది. ఆ అవసరం కూడా లేకపోతే అసలు ప్రజల్నే పట్టించుకోరు. ధనవంతుల సంక్షేమాన్నే చూసుకుంటారు. పెట్టుబడిదారులు కోరుకుంటున్నది కూడా ప్రజలకు ఇలాంటి హక్కులు లేకుండా చేయడమే. దీనికే ఓటుబ్యాంకు రాజకీయమని వారు ముద్దుపేరు పెట్టారు. ప్రజల్ని ఓట్లకోసం జోకొట్టడానికే సబ్సిడీలు పెంచుకుంటూ పోతున్నారని, రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, కనుక వాటిని ఎత్తేయాలని పెట్టుబడిదారీవర్గం డిమాండు చేస్తోంది. పోరాడే హక్కు (సమ్మె, బంద్‌ వగైరా) కూడా వద్దంటున్నారు. కోర్టులు కూడా వారికి తందానా అంటున్నాయి. మీరు కూడా తెలియకుండానే వారి కోరికనే వినిపిస్తున్నారు. గతంలో మెరిట్‌ పేరుతో రిజర్వేషన్లను వ్యతిరేకించిన వర్గమే నేడు అదే మెరిట్‌ను డబ్బులకు అమ్ముకుంటోంది. అదీ ఈ వర్గనైజం. ఓట్లు అమ్ముకునే ప్రజల్ని నిందించడం కన్నా ఓటును సరుకుగా మార్చి రాజకీయంతో వ్యాపారం చేసే వర్గం నడుం విరగ్గొడితేగానీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు.

గుజరాత్‌లో మోడీని కమ్యూనిస్టులు ఫాసిస్టు హిట్లర్‌తో పోల్చుతున్నారు. దీనివల్ల కమ్యూనిస్టులు హిందువులకు వ్యతిరేకులని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎదగకపోవడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు. దీనిపై మీరేమంటారు?

ఎం పుష్పకుమార్‌, సత్యనారాయణ పురం, విజయవాడ.

మోడీ హిందూయిజానికి ప్రతినిధి కాడు. అతను మతోన్మాది. అందుకే రక్తం రుచిమరిగిన రాక్షసుడుగా ముస్లింలను ఊచకోత కోయించాడు. ఏ హిందువూ ఈ ఊచకోతను సమర్థించడు. మహాత్మాగాంధీనే పొట్టనపెట్టుకున్న ఆర్‌యస్‌యస్‌ ప్రతినిధులు హిందువులెలా అవుతారు. పరమత సహనం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. లౌకికవాదులుగా చరిత్రలో ప్రసిద్ధిగాంచిన రాజులనేక మంది వారు హిందువులైనా, ముస్లింలైనా దీన్ని పాటించారు. ఆర్‌యస్‌యస్‌ ఈ సత్సంప్రదాయానికి భిన్నంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతోంది కాబట్టే వారిని ఫాసిస్టులని కమ్యూనిస్టులంటున్నారు. స్వాతంత్రోద్యమాన్ని బలహీనపరచేందుకు బ్రిటీషుపాలకులు మతకల్లోలాలను సృష్టించారు. వారి చేతిలో పావుగా మారింది ఆర్‌యస్‌యస్‌. దాని రాజకీయ ప్రతినిధి బిజేపీ.అలాంటి బిజేపీకి నాయకుడు మోడీ. దీనికీ కమ్యూనిస్టులు ఎదగక పోవడానికీ సంబంధమే లేదు. కమ్యూనిస్టుపార్టీలో హిందువులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దైవభక్తులనేక మంది కమ్యూనిస్టు సానుభూతిపరులుగా ఉన్నారు. కమ్యూనిస్టులపై సాగేది నిందా ప్రచారం మాత్రమే.

గ్రీస్‌ తరహాలో బెంగాల్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి దీనిని గట్టిగా వ్యతిరేకించారు. మమత డిమాండ్‌ సబబేనంటారా?

కె లక్ష్మణ్‌ కుమార్‌, తిరుపతి.

మమత చేతకాని తనాన్ని ఇది ఎత్తిచూపుతుంది. ప్రత్యేక ప్యాకేజీలివ్వడానికి ఆ రాష్ట్రమేమీ వెనుకబడి లేదు. వామపక్ష పాలనలో అది ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం కాంట్రాక్టర్లు, బ్రోకర్లు నంజుకు తినడానికి డబ్బులు కావాలి. వారిని సంతృప్తిపర్చడానికే మమత ఇలాంటి డిమాండు చేస్తోంది. అంతేకాదు తన వైఫల్యాన్ని కనిపించకుండా దారి తప్పిం చడానికి కూడా ఆమె నానా తంటాలు పడుతోంది.

చట్ట ప్రకారం పాకీ పనిని ప్రభుత్వాలు నిషేధించాయి. అయినా ఈ అమానుష విధానం ఇప్పటికీ కొనసాగుతోంది ఎందుకని?

బి యేసుబాబు, కడప.

రాజ్యాంగరీత్యా, చట్టపరంగా నిషేధించబడిన అనేక దురాచాలు-పాకీ పనితో సహా- నేటికీ కొనసాగుతున్నాయి. ప్రజా ఉద్యమాల ఒత్తిడితో చట్టాలు చేసినా వాటిని ఆచరించే చిత్తశుద్ధి పాలకులకు లేదని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి. చట్టాల కోసం పోరాడటమే కాదు వాటి అమలుకోసమూ పోరాడాలని మన అనుభవం చెబుతోంది. దుష్టాచారాలు కొనసాగించే పాలకుల పీకపై కూర్చుంటే తప్ప నిషేధాలు కూడా అమల్లోకి రావు.

ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించడం పెద్ద వివాదానికి దారితీసింది. మెజార్టీ విద్యార్థులు ఎద్దు మాంసం తినడానికి ఇష్టపడనప్పుడు దానిని మెనులో బలవంతంగా రుద్దాలని చూడడం ఎంతవరకు సబబు?

పి నాగి రెడ్ది, అనంతపురం.

ఇలాంటి డిమాండు ఎవరూ చేయలేదు. ఇది ఏబివిపీ చేస్తున్న దుష్చ్రచారం. బీఫ్‌ తినాలనుకున్న వారిని అడ్డుకున్నది ఎబీవిపీ. మీరు తినకూడదు అని వారు శాసిస్తున్నారు. అలాంటి హక్కు వారికి లేదు. కొందరు విడిగా కొందరు విద్యార్థులు బీఫ్‌ ఫెస్టివల్‌ పెట్టుకున్నారు. వారికి ఎబివీపీ మినహా మిగతా విద్యార్ధి సంఘాలు మద్దతునిచ్చాయి. దానిపై దాడి చేసి ఒక విద్యార్థిని అన్యాయంగా కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించింది ఎబీవీపీ. ఇప్పుడు విద్యార్థులు చేయని డిమాండును చేసినట్లుగా దుష్ప్రచారానికి పూనుకుంది. బీఫ్‌ను తినము అనే వారి హక్కును గౌరవించాలనడం ఎంత అవసరమో తింటాము అనే వారి హక్కునూ గౌరవించాలి. ఆహారపు అలవాట్లు ఆధారంగా అలాంటి వారికి అవసరమైతే వేర్వేరుగా మెస్‌లు ఏర్పాటు చేయొచ్చు. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను అందరూ గౌరవించాలి.

సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి ఇటీవల ఒక పత్రికాగోష్టిలో మాట్లాడుతూ మా పొత్తు పార్టీలతో కాదు, ప్రజలతోనే అని చెప్పారు. మరో నాయకులు ఎన్నికలు వచ్చేటప్పుడు ఏ పార్టీతో కలిస్తే తమకు ఉపయోగమో వాటితో సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఒకే అంశంపై రెండు రకాలుగా మాట్లాడడం సరైనదా?

కె జానకి, హైదరాబాద్‌.

ప్రజల ప్రయోజనాల కోసమే పార్టీలతో పొత్తులనే అర్థంలోనే ఇద్దరూ మాట్లాడి ఉంటారు. వారేం మాట్లాడారో, మీడియాలో ఏం వచ్చిందోనన్నదాన్ని బట్టి పార్టీ విధానాలుండవు.తాజాగా కోజికోడ్‌లో జరిగిన పార్టీ 20వ మహాసభ రాజకీయతీర్మానమే పార్టీ రాజకీయ విధానానికి ప్రాతిపదిక. దాని ప్రకారం పార్టీ స్వతంత్రంగా ఎదగడానికి ప్రాధాన్యతనిస్తుంది. వామపక్ష, ప్రజాతంత్ర ఐక్యత ప్రధాన రాజకీయ నినాదం. అయితే అదే సమయంలో ప్రజా సమస్యలపై కాంగ్రేసేతర లౌకిక బూర్జువాపార్టీలతో కూడా సహకరించి పనిచేస్తుంది. ఎన్నికల పొత్తుల గురించి తీర్మానం ఇలా చెప్పింది. ''ఎప్పుడైనా అవసరమైతే ఇలాంటి కొన్ని పార్టీలతో ఎన్నికల అవగాహన పెట్టుకోవచ్చు.'' అంటే పొత్తులు పెట్టుకోవాలనీ కాదు. ఒద్దనీ కాదు. ఆయా పరిస్థితిని బట్టి కేంద్ర, రాష్ట్ర కమిటీలు దానికి సంబంధించిన నిర్ణయాలు చేస్తాయి. గతంలో లాగా జాతీయస్థాయిలో అలాంటి అనివార్యత (మూడో ఫ్రంటు కోసం) మాత్రం ప్రస్తుతం లేదు.

Publiture