సమాలోచన (25-4-12)

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిపిఐ(ఎం), సిపిఐ మధ్య పొత్తు కుదరలేదు. వామపక్ష ఐక్యతను బలోపేతం చేస్తామని ఇటీవలే ఈ రెండు పార్టీల మహాసభలు ఉద్ఘాటించాయి. ఉప ఎన్నికల్లోనే సఖ్యత కుదరనప్పుడు 2014 సార్వత్రిక ఎన్నికల్లో వీటి మధ్య ఐక్యత సాధ్యమేనంటారా?

ఆర్‌ సురేష్‌బాబు , హైదరాబాద్‌.

రానున్న 18 శాసనసభ, ఒక లోకసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీల మధ్యా అవగాహన కోసం సిపియం తీవ్రంగా ప్రయత్నించింది. గత రాష్ట్రమహాసభల సందర్భంగా జరిగిన చర్చల్లో వామపక్ష ఐక్యతను పటిష్టపరచాలని సిపియం నిర్ణయించుకుంది. తెలుగుదేశం పార్టీతో దీర్ఘకాలం పొత్తుల కారణంగా కమ్యూనిస్టుల ప్రజా పునాది దెబ్బతిన్నదని అర్థమైంది. స్వతంత్ర ప్రజా బలాన్ని పెంపొందించుకోవాలని సిపియం అఖిలభారత మహాసభ కూడా పిలుపునిచ్చింది. వామపక్షాలు స్వతంత్రంగా కలసి వచ్చే ఇతర ప్రజాతంత్ర శక్తులతో కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మాత్రమే స్వతంత్ర పునాదిని కాపాడుకోగలుగుతామని సిపియం భావించింది. అదే విషయం సిపిఐతోనూ పలు సందర్భాల్లో చర్చించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి సిపియం స్వతంత్రంగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో సిపిఐ కోవూరులో సిపియంను, ఇతర చోట్ల టిఆర్‌యస్‌ను బలపరచింది. నాడు తెలంగాణాలో తెలుగుదేశంపార్టీని వ్యతిరేకించింది. రాజీనామాలు చేసినవారికి మద్దతుగా బలపరుస్తామన్నది. నేడు చెపుతున్నట్లు 2009లో ఎవరు పోటీ చేస్తే అదేపార్టీని బలపరుస్తామని చెప్పలేదు. 2009లో కోవూరులో సిపియం పోటీ చేయలేదు. నాడు రెండు పార్టీలు తెలుగుదేశాన్నే బలపరచాయి. అయినా ఈసారి సిపియం పోటీ చేసింది కాబట్టి మద్దతునిస్తామని సిపిఐ ప్రకటించింది. ప్రస్తుతం ఈ విధానాన్ని తిరగదోడి 2009లో ఏపార్టీ ఉంటే అదే పార్టీకి మద్దతునిస్తామని చెపుతోంది. ఈ రెండు సందర్భాల్లోనూ సిపియం ఒకే వైఖరి తీసుకోగా, సిపిఐ మాత్రం భిన్నవైఖరులను తీసుకుంది. అందువల్లనే వామపక్ష ఐక్యతకు విఘాతం కలిగింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో సిపిఐ ఎక్కడా పోటీ చేయడం లేదు. అయినా సిపియంను కాదని తెలుగుదేశాన్నే బలపర్చడానికి నిర్ణయించుకుంది. సిపియం పోటీ చేస్తున్నచోట బలపరచి మిగతా స్థానాల్లో తెలుగుదేశాన్ని బలపరచినా వారి రాజకీయ విధానానికి భంగం కలగదు. తద్విరుద్ధ్దంగా సిపియంకు రహస్య ఎజెండా ఉందంటూ ఎదురుదాడికి దిగుతోంది. ఎవరి రాజకీయ విధానం వారనుసరించినా ఫరవాలేదు. కాని వామపక్ష ఐత్యతా వాతావరణాన్ని కలుషితం చేస్తూ లేని విధానాన్ని ఆపాదిస్తూ విమర్శలకు దిగడం సహేతుకం కాదు. బహిరంగంగా సిపియంపై తీవ్రంగా దాడి చేయడం ద్వారా వారేం సాధించదలచుకున్నారో తెలియదు. తద్వారా ఏరకమైన సంకేతాలు పంపదలచుకున్నారో వారికే తెలియాలి.

వొడాఫోన్‌ రు.11వేల కోట్ల పన్ను ఎగవేతకు వీలుకల్పిస్తున్న చట్టాన్ని సవరించి, వాటిని తిరిగి రాబడతామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నందుకు విదేశీ కంపెనీలు భారత్‌ను అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు ఈడ్చుతామని బెదిరిస్తున్నాయి. అటువంటి చట్ట సవరణ చేసే హక్కు భారత్‌కు లేదా?

సిద్దాంతం ప్రసాద్‌, విజయవాడ.

భారతదేశం సర్వసత్తాక సార్వభౌమత్వ దేశం. ఏ చట్టమైనా చేయొచ్చు. ఆ చట్టాలను ఏ పౌరుడైనా కోర్టులో సవాలు చేయొచ్చు. అదే విదేశీయులైతే తమ దేశ ప్రభుత్వాల ద్వారా ఒత్తిళ్లు తెస్తుంటాయి. లేదా అంతర్జాతీయ కోర్టునూ ఆశ్రయించవచ్చు. కాని మనదేశం నయా ఉదారవాద విధానాలు చేపట్టాక అంతర్జాతీయ సంస్థల ఒత్తిళ్లు పెరిగాయి. అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి మన దేశంపై తన పెత్తనాన్ని రుద్దడానికి తీవ్ర ప్రయత్నం సాగిస్తున్నది. మన ప్రభుత్వాలూ ఆ ఒత్తిళ్లకు లొంగిపోతున్నాయి. విదేశీ పెట్టుబడులు కావాలన్న పేరుతో వారి ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాలను కూడా మార్చుతున్నారు మన పాలకులు. ఒకవేళ వారి షరతులకు లొంగకపోతే పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని బెదిరిస్తుంటారు. అలా ఆఖరికి మన సార్వభౌమాధికారమే ప్రమాదంలో పడుతోంది. మన చట్టాలను సైతం మనం స్వేఛ్చగా చేసుకోలేని పరిస్థితి దాపురిస్తోంది. ఈ విధానాలను ప్రతిఘటించకపోతే స్వాతంత్య్రమే ప్రమాదంలో పడుతుందని ఇలాంటి సంఘటనలు హెచ్చరిస్తున్నాయి.

పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని పాటించే సిపిఐ(ఎం) జాతీయ ఉగ్రవాద నిరోధక సంస్థ (ఎన్‌సిటిసి) ఫెడరల్‌ స్వభావానికే విరుద్ధమన్నట్లుగా వాదిస్తున్నది. ఇది ద్వంద్వ ప్రమాణం కాదా?

పి సంతోష్‌ కుమార్‌, నంద్యాల, కర్నూలు.

కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటే అధికార కేంద్రీకరణ కాదు. ఇదొక ప్రజాస్వామిక నిర్మాణసూత్రం. ఈ సూత్రం ప్రభుత్వాల నిర్వహణకుగానీ, ప్రజాసంఘాల నిర్మాణాలకు గానీ యాంత్రికంగా వర్తించదని సిపియం స్పష్టంగానే చెపుతోంది. దానితో భారత రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్వభావంతో పోల్చడం సరికాదు. మన రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను స్పష్టంగా విభజించింది. పైగా మనది ఫెడరల్‌ స్వభావం కలిగిన యూనిటరీ రాజ్యం. మన రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా చట్టాలుండాలని, రాష్ట్రాల హక్కుల పరిధిలోకి కేంద్రం చొరబడరాదని సిపియం ఎప్పటి నుండో పోరాడుతోంది. సంకీర్ణయుగంలో అనేకపార్టీలు దీనికి మద్దతునిస్తున్నాయి. కాబట్టి రాజ్యాంగ స్పూర్తితోనే సిపియం ఈ వైఖరి తీసుకున్నది. దీన్ని ద్వంద్వ ప్రమాణంగా భావించడం సరికాదు.

ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైనప్పటికీ కేంద్రంలోని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని, పెండింగ్‌లో వున్న పింఛను, బ్యాంకింగ్‌, బీమా బిల్లులను ఈ సంవత్సరమే ఆమోదిస్తామని చెబుతున్నది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కాంగ్రెస్‌ సంస్కరణల వైపే పరుగుతీస్తున్నది ఎందుకని?

మహ్మద్‌ ఫిరోజుద్దీన్‌, నల్గొండ.

అది దాని వర్గస్వభావం. తాను ప్రాతినిధ్యం వహించే బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు సంస్కరణలతో ముడిపడి ఉన్నాయి. ఈ సంస్కరణలు ప్రజలకు నష్టదాయకం. అందుకే ఎన్నికల్లో సంస్కరణలు అమలు చేసిన పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అయినా ఒకపార్టీ పోయి మరో పార్టీ వచ్చినా ఈ సంస్కరణలను అమలు చేస్తూనే ఉన్నారు. ప్రజలు ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. ప్రజల ప్రయోజనాలకు, బడాపెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలకు మధ్యనున్న వైరుధ్యమే ఇది. ఈ వైరుధ్యంలో కాంగ్రెసు ప్రజల పక్షాన కాకుండా పెట్టుబడిదారుల పక్షాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ వర్గాన్ని కాదంటే దాని రాజకీయ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తుంది. లోకసభలో ఉన్న 540 మంది ప్రతినిధుల్లో దాదాపు 300 మందికి పైగా శతకోటీశ్వరులున్నారని లెక్కలు చెపుతున్నాయి. ఇలాంటి వారి పాలనలో ప్రభుత్వాలు ఎవరి పక్షాన నిర్ణయాలు చేస్తుందో చెప్పడానికి కష్టపడాలా?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన కల్యాణ్‌సింగ్‌, చరణ్‌సింగ్‌, అజిత్‌సింగ్‌ సిక్కుమతానికి చెందినవారు కానప్పుడు వారి పేర్లలో సింగ్‌ అన్న పదం ఎందుకున్నట్లు? దయచేసి వివరించగలరు.

వి రాజకుమార్‌, హైదరాబాద్‌.

సింగ్‌ అనే పదం సింహ నుండి ఉద్భవించింది. పూర్వ కాలంలో ఉత్తర హిందూ దేశంలో రాజపుత్రులు, జాట్‌లు వగైరా ప్రభువర్గాలకు చెందినవారు వీరత్వానికి చిహ్నంగా సింహ అని పేరుకు తర్వాత తగిలించుకునేవారు. అదే కాలక్రమంలో సింగ్‌గా మారింది. 17వ శతాబ్దంలో సిక్కుమతం ఆవిర్భవించిన తర్వాత గురుగోవింద్‌ సింగ్‌ తన మతాన్ని అనుసరించేవారంతా విధిగా సింగ్‌ అని పేరు చివర నామకరణం చేసుకోవాలని ఆదేశించాడు. ఆ విధంగా సింగ్‌ అనేది సిక్కుమతం చిహ్నంగా మారింది. కాని ఇతర హిందూ మతాన్ని అనుసరించే కులస్థుల్లోనూ ఈ పదం కొనసాగుతూనే వస్తోంది. మొదట ప్రభువర్గాలకే పరిమితమైన ఈ పదం క్రమేణా అన్ని కులాలవారూ ఉపయోగించసాగారు.

మమత బెనర్జీ ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది. గత ఎన్నికల్లో తృణమూల్‌కు గట్టి దన్నుగా నిలిచిన మధ్యతరగతి ఇప్పుడామెకు దూరమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు దూరం అవుతానని తెలిసి కూడా ఆమె ఎందుకిలా వ్యవహరిస్తున్నట్లు? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందంటారా?

శ్రీనివాస్‌ గౌడ్‌, ఆలంపూర్‌, మహబూబ్‌నగర్‌.

ఏ వ్యూహం ఉందో ఆమెకే తెలియాలి. ఆమె ఎవరి మాటా వినరని ప్రతీతి. వ్యక్తిగత అహంభావంతో కూడా నిరంకుశ నిర్ణయాలు చేయొచ్చు. ప్రస్తుతం మమతాబెనర్జీ పరిపాలన తీరు కోతికి కొబ్బరి కాయ చిక్కినట్లుగా ఉందని పలువులు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తులో పాఠాలు నేర్చుకుంటారా లేక ఇదే నిరంకుశ వైఖరితో కొనసాగుతారా చూద్దాం.