ప్రింట్ మీడియాకు సమాజంలో, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మెప్పించడంలో, వారిని ఆకట్టుకోవడంలో, నమ్మకాన్ని కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. మన దేశంలో ప్రతి ఏడాదీ సుమారు 4,000 వార్తా పత్రికలూ, వార పత్రికలూ కొత్తగా రిజస్టరవుతున్నాయి. అవి పురోగమిస్తున్న కొద్దీ వాటిలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఉద్యోగార్థులూ, యువతీ యుకులూ పత్రికారంగంపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దిన పత్రికలూ, వార పత్రికలూ, పక్ష పత్రికలూ, మాస పత్రికలూ అని వీటిలోనూ వివిధ రకాలుంటాయి. దిన పత్రికలకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిలో విలేకర్లుగా, ఫొటో గ్రాఫర్లుగా, సంపాదకులుగా, ఉపసంపాదకులుగా, ఫీచర్స్, బిజినెస్, క్రీడలు లాంటి ప్రత్యేక విభాగాల్లో సంపాదకులుగా, లైబ్రేరియన్లుగా, ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
శిక్షణద్వారా
పత్రికలు ఒక సామాజిక బాధ్యతతో, లక్ష్యంతో ముందుకు వస్తున్నాయి. ఆసక్తి కనబర్చిన వారిని ఆ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది జర్నలిస్టులుగా, ఇంకా అవసరమైన విభాగాల్లో ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. గుర్తింపు పొందిన అన్ని పత్రికా యాజమాన్యాలు ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలూ, జర్నలిజం కళాశాలలూ ఏర్పాటు చేసుకుంటున్నాయి.వాటిలో ప్రవేశించి అర్హత సంపాదించిన వారిని తమ పత్రికల్లో నియమించుకుంటున్నాయి. జర్నలిజం ఒక సృజనాత్మకరంగం. చక్కటి భాషా పరిజ్ఞానం, సామాజికసృహ ఉన్నవారికీ, మెజార్టీ ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఆలోచించగలిగే వారికీ, ఆ విధమైన రచనలు చేసేవారికీ, వార్తలు రాసేవారికీ మంచి గుర్తింపు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి శిక్షణా లేకుండా కూడా అవకాశం కల్పించి అనుభవం ద్వారానే జర్నలిజంలో అవకాశాన్ని కొన్ని పత్రికలు కల్పిస్తుంటాయి.
సంపాదక విభాగం
వార్తలుగానీ, ప్రత్యేక కథనాలుగానీ ప్రచురించే ముందు చాలా కసరత్తు జరుగుతుంది. ప్రణాళిక ప్రకారం సారాంశాన్ని ప్రచురణకు సిద్ధం చేయాలి. వచ్చిన ముడి సరుకును సంపూర్ణ వార్తగానో, కథనంగానో మల్చగలగాలి. అందులో నిర్ధిష్టతా, సమగ్రతా, పాఠకాసక్తీ, సామాజిక ప్రయోజనం ఉందోలేదో పరిశీలించాలి. ఒకటికి రెండుసార్లు అన్ని కోణాల్లోనూ పరిశీలించి సంపూర్ణ సమాచారం సేకరించాకే ప్రచురణకు పంపాలి. విలేకర్లే సమగ్ర సమాచార సేకరణ చేయాలి. సంపాదకుల సలహాలు తీసుకోవచ్చు. విలేకర్లు సేకరించిన దాంట్లో ఉన్నలోపాలను సరిచేయాల్సిన బాధ్యత, ఇంకా అవసరమైన సమాచారం తెప్పించుకోవాల్సిన బాధ్యత సబెడిటర్లపైన ఉంటుంది.
ఎవరెవరు ఉంటారు?/
ఏ పత్రికలోనైనా ఒకరు ప్రధాన సంపాదకులు, అనేక మంది ఉపసంపాదకులు, స్టాఫ్ రిపోర్టర్లు, బిజినెస్, గేమ్స్, ఫీచర్స్ లాంటి ప్రత్యేక విభాగాల సంపాదకులూ, విలేకర్లూ ఉంటారు. ఇంకా వ్యాసకర్తలూ, ఆయా రంగాలను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్న రిపోర్టర్లూ ఉంటారు. సంపాదకులకు పత్రికల ప్రచురణా నియమాలూ, చట్టాలూ తెలిసుండాలి. కొంగొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో, సమయస్ఫూర్తితో పత్రికను ఆసక్తి కరంగా తీర్చిదిద్దగలగాలి. వారికింద ఉపసంపాదకులు ఉంటారు. వీరిలో కొందరు ప్రత్యేక వార్తలకు బాధ్యత వహిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ వార్తలు, ప్రాంతీయ వార్తలు, ఆర్థిక వ్యవహారాలు లాంటి బాధ్యతలు చూస్తుంటారు. ఇతర రిపోర్టర్లతోనూ, ఫ్రీలాన్స్ రచయితలతోనూ సంబంధాలు కలిగివుంటారు. పత్రికారంగంలో ప్రధానపాత్ర వహించే సబెడిటర్లు... విలేకర్లు ఇచ్చే కథనాన్ని పరిశీలించి దానికి ఒక రూపాన్నివ్వాలి. వీళ్లెప్పుడూ పత్రికా నియమాలను గేట్ కీపర్స్ లాగా దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తుండాలి.
రిపోర్టింగ్
ఈ ఫీల్డులో విలేకర్లు ఉంటారు. లేకపోతే ప్రత్యేకంగా కేటాయించిన రిపోర్టర్లు కూడా ఉంటారు. రిపోర్టింగ్‌లో అనేక రకాలు. డైలీ న్యూస్, ఫాలోఅప్ న్యూస్, స్టోరీ న్యూస్ అని వివిధ రకాలు ఉంటాయి. పత్రికల్లోవచ్చే జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలను ఒక కథనం ప్రకారం చిత్రీకరించి వాటిని వివిధ కోణాల నుండి పరిశోధించి, పరిశీలించి చర్చలు జరిపి ప్రచురించాలి. పట్టణాలలో వుండే విలేకరులు అక్కడ జరిగే ప్రతి అంశాన్నీ సేకరించి రిపోర్టివ్వాలి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టులు
ఫ్రీలాన్స్ జర్నలిస్టు అంటే ఒక పత్రికు మాత్రమే ఉద్యోగి కాదు. అన్ని పత్రికలకూ, వార పత్రికలకూ, వ్యాసాలు రాస్తుంటారు. ప్రచురించిన వాటికి మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు తమ ఆసక్తినిబట్టీ, అభిరుచినిబట్టీ ఎన్ని పత్రికలకైనా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఏదో ఒక్క పత్రికకు మాత్రమే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
వ్యాస రచయితలు
పత్రికలు కొంతమంది వ్యాస రచయితలను ప్రత్యేకంగా నియమించుకుంటాయి. వర్తమాన ఆర్థిక, రాజకీయ పరిణామాలకు అద్దంపట్టే విధంగా తమ పత్రికల పాలసీకనుగుణంగా వీరు వ్యాసాలు రాస్తుంటారు.
వ్యాఖ్యాతలు
దిన పత్రికల్లోనూ, వార్త పత్రికల్లోనూ ప్రత్యేక వ్యాఖ్య రచయితలూ, విమర్శకులూ ఉంటారు. లేకపోతే ఆయా పత్రికలు ఇలాంటి కాంట్రిబ్యూటర్సును ఏర్పాటు చేసుకుంటాయి.
కార్టూనిస్టులు
ఆయా స్టోరీలకూ, వార్తలకూ అనుగుణంగా కార్టూన్లు వేయడం కొన్నిసార్లు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలూ, వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిస్థితులూ దృష్టిలో పెట్టుకుని సృజనాత్మకంగా కార్టూన్లు గీయడం వీరిపని. ఒక పెద్దకథనంలోనో, వార్తలోనో చెప్పే అన్ని విషయాలనూ ఒక కార్టూన్ ద్వారా అర్థమయ్యేలా వేయగలగడం వీరి ప్రత్యేకత.
చిత్రకారులు
దిన పత్రికల్లోనూ వారానికోసారి వచ్చే అనుబంధాలకు వీరి సేవలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆయా కథలూ, కథనాలూ దృష్టిలో పెట్టుకుని వీరు చిత్రాలు (బొమ్మలు) గీస్తారు.
ఫోటో జర్నలిజం
స్పాట్‌వార్తల కార్యక్రమాలనూ (ప్రెస్‌మీట్‌లు, ధర్నాలు, దీక్షలు, యాక్సిడెంట్‌లు) ఇతర దృశ్య సంఘనలనూ కెమెరాలో చిత్రీకరించడం వీరి పని. కొన్నిసార్లు స్టోరీలను బట్టి ప్రత్యేకంగా ఫొటోలు తీయాల్సి ఉంటుంది. వీరికి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో సృజనాత్మకత ముఖ్యమైంది. చెప్పదల్చుకున్న కథన సారాంశం కూడా ఫొటోలో ప్రతిభింబించాలి. అంటే ఫొటో చూడగానే ఆ కథనంగానీ, వార్తగానీ దేనికి సంబంధించిందో పాఠకులు అర్థం చేసుకొనేలా ఉండాలి.
ఇంటర్నెట్ జర్నలిజం
జర్నలిస్టులు పత్రికలకేగాక ఇంటర్నెట్‌కు కూడా వార్తలూ, కథనాలూ ఇవ్వవచ్చు tehelka.com, indiatimes.com, rediff.com లాంటి వాటికి ప్రత్యేకంగా జర్నలిస్టులు ఉన్నారు. ఏదేమైనా నేడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రంగంగా మీడియా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఇతరా మీడియాలకంటే ప్రింట్‌మీడియాపట్ల ప్రజల్లో విశ్వాసం, ఆదరణ ఎక్కువ. జర్నలిజం అంటేనే సృజనాత్మకకు మారు పేరు. అందులో ప్రవేశించి, అనుభవం ద్వారా మరింత నైపుణ్యం ప్రదర్శించవచ్చు. అంతేగాక సమాజానికీ, ప్రజలకూ తమవంతు సేవలందించవచ్చు. ఒక్కకలం ద్వారా ఎందరినో చైతన్యం చేయవచ్చు. ఆలోచనలనే ఆయుధాలుగా మలచి ప్రజల చేతికందించే చక్కని అవకాశం ఒక ప్రింట్ మీడియాలోనే ఉంది.
ఎవరు అర్హులు?
బాచిలర్స్ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, మాస్ డిప్లొమా ఇన్ జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ లాంటి అర్హతలు ఉన్నవారికి ఆంగ్ల పత్రికలు ప్రాధాన్యతనిస్తున్నాయి. తెలుగు పత్రిల్లో ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. శిక్షణ ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఇండియన్ యునివర్సిటీలు జర్నలిజంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు అందిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్‌లో ఏ గ్రూపుకు సంబంధించిన వారైనా పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇన్ జర్నలిజం చేయవచ్చు.
జర్నలిజం కోర్సులు అందిస్తున్న సంస్థలు
ఎజెకె-మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ (ఎంసిఆర్‌సి) ఆఫ్ జామియా మిల్లియా ఇస్లామియా, న్యూఢిల్లీ.
ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, చెన్నరు.
భారతీయ విద్యా భవన్, ముంబై, ఢిల్లీ, తిరువనంతపురం
మనిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, మనిపాల్
టైమ్స్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం, ముంబై
పయోనిర్ మిడియా స్కూల్, న్యూఢిల్లీ
ది మనోరమ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్, కొత్తయమ్
ఎస్‌టి. జెవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, ముంబై
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ,పూనే
వేతనాలు
ఆయా పత్రికల సామర్థ్యాన్నిబట్టి వేతనాలు ఉంటాయి. రిపోర్టర్లకూ, సీనియర్ రిపోర్టర్లకూ ప్రారంభంలో రూ. 5,500 నుండి రూ. 9000 వరకు ఇస్తారు. ఛీఫ్ రిపోర్లకూ, సబెడిటర్లకూ ప్రారంభంలో రూ.5,000 నుండి రూ.10,500 వరకు ఇస్తారు. సంపాదకులకు రూ. 7,500 నుండి
రూ. 12,000 వరుకు ఇస్తారు.వివిధ ప్రయివేటు, కార్పొరేట్ పత్రికలు, సంస్థలు నిర్వహిస్తున్న పత్రికల్లో వాటిస్థాయినీ, ఆర్థిక సామర్థ్యాన్నిబట్టీ ఎక్కువమొత్తంలో వేతనాలు ఉంటాయి. అదనపు సౌకర్యాలు కల్పిస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రధాన పత్రికలు రూ. 8,000 నుండి రూ. 18,000 వరకు ఇస్తున్నాయి. అనుభవజ్ఞులైన జర్నలిస్టులకు రూ. 20,000 నుండి 25,000 వరకు ఇస్తున్నాయి. సీనియర్ జర్నలిస్టులకు లక్ష రూపాయల వరకు ఇస్తున్నాయి.
కొత్తదనం ప్రదర్శించాలి
ఒక జర్నలిస్టుగా రాణించాలనుకే వారికీ సామాజిక స్పృహ, సృజనాత్మకత, సమయస్ఫూర్తి తప్పక ఉండాలి. సమాజాన్నీ, చరిత్రనూ అధ్యయనం చేయాలి. ఎప్పటికప్పుడు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను అధ్యయనం చేస్తూ, పరిశీలిస్తూ స్పష్టమైన వైఖరినీ, అవగాహననూ కలిగి ఉండాలి. తమకు సంబంధించిన వాటిపైనేగాక అన్ని విషయాలపట్ల, రంగాలపట్ల కనీస పరిజ్ఞానం కలిగివుండాలి. తాము సేకరించిన వార్తల్లో ప్రజాదృష్టీ, పాఠకాసక్తీ, సామాజిక ప్రయోజనం ఉండాలి. అందర్నీ చైతన్యం చేసేవిధంగా, ప్రభావితం చేసేవిధంగా, ఆసక్తిరేకెత్తించే విధంగా ఉండాలి. కొత్తదనం ఉట్టిపడాలి. కొత్త ఒరవడిని సృష్టించాలి. నేడు జర్నలిజంలోనూ పోటీతత్వం నెలకొంది. అందులో రాణించాలంటే ఎప్పుడూ కొత్తదనం ప్రదర్శించడమేగాక పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోవాలి.
శిరీష