సమాజంపైనా, సబ్జెక్టుపైనా, పరిసరాలపైనా, పరిస్థితులపైనా, వృత్తిపైనా, వృత్తినైపుణ్యం పైనా ఇలా ఏ విషయంలోనైనా చక్కటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆయా రంగాల్లో, వృత్తుల్లో ఉన్నవారు రాణించే అవకాశాలెక్కువ. అయితే చాలా మంది అన్ని విషయాలనూ ఎలా అధ్యయనం చేయగల్గుతామనే సందేహం వ్యక్త పరుస్తుంటారు. తాముచేస్తున్న ఉద్యోగంపట్ల, వృత్తిపట్ల అవగాహన కలిగి ఉండి, మిగతా విషయాలపట్ల కనీస పరిజ్ఞానం ఉంటే చాలు. ముందుకు దూసుకుపోవచ్చు.
నాయకత్వ లక్షణాలు: విస్తృత అధ్యయనం ద్వారా, పరిస్థితుల్లో, వ్యక్తుల్లో పాజిటివ్ అంశాల్ని పరిశీలించి అర్థం చేసుకోవడం ద్వారా నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. ఒక నాయకత్వ స్థాయిలో ఉన్నప్పుడో, లేకపోతే ఆ విధమైన పని స్వభావంగల వృత్తిలో ప్రవేశించినప్పుడో మాత్రమే ఇవి ఏర్పడతాయనుకోనక్కర్లేదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి ఏర్పడొచ్చు. వివిధ అంశాలను అధ్యయనం చేయడం ద్వారా ఏర్పడొచ్చు. సాధన ద్వారా ఎవ్వరైనా ఏదైనా నైపుణ్యం అలవర్చుకోవచ్చు.
టీమ్‌లీడర్: ఒక ఉద్యోగి వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించడంవల్ల, నాయకత్వ లక్షణాలు ఏర్పర్చుకోవడంవల్ల టీమ్‌లీడర్ స్థాయికి ఎదుగుతాడు. అంతటితో ఇక సాధించాల్సిందేమీ లేదనుకుంటే పొరపాటే. మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి టీమ్ లీడర్ స్థానం తొలిమెట్టు లాంటిది. నాయకత్వం వహిస్తుంటారు కాబట్టి, ఒక బృందానికో, ఐదారు బృందాలకో పర్యవేక్షకులుగా, సలహా దారులుగా పనిచేస్తుంటారు. ఈ అనుభవం ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు దోహద పడుతుంది.
సామర్థ్యమూ గుర్తింపు: ఎగ్జిక్యూటివ్, మేనేజర్, ఇలా హోదాలున్నంత మాత్రాన మంచి నాయకులు కాలేరు. కిందిస్థాయి సిబ్బందితో సానుకూలంగా వ్యవహరించడంతో, సంస్థ/కంపెనీ వ్యవహారాల్లో ప్రతిభ కనబర్చడంతో మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఇది ఎవరికి వారు మాత్రమే నిర్ణయించుకుంటే సరిపోదు. సిబ్బంది తమతో మాట్లాడడానికి ఉత్సాహం చూపినప్పుడే, తమను గౌరవ భావంతో చూసినప్పుడే, తమ పట్ల సానుకూలతతో ఉన్నప్పుడే నాయకునిగా విజయం సాధించినట్లు. అప్పుడే మీ శక్తి సామర్థ్యాలు నిరూపితమైనట్లు.
బలహీనతలు: ప్రతి వృత్తిలో సానుకూలాంశాలూ, ప్రతికూలాంశాలూ ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ బలాలూ, బలహీనతలూ కన్పిస్తాయి. అయితే అవి తమ వృత్తికి నష్టం కలిగించకుండా చూసుకోవడమే అసలైన వృత్తినైపుణ్యం. టీమ్ లీడర్లుగానీ, పైస్థాయి ఉద్యోగులుగానీ కిందిస్థాయి సిబ్బందిగానీ తమకుగానీ, సంస్థకుగానీ నష్టం కలిగించనంత వరకూ ఎవ్వరి వ్యక్తిగత విషయాలనూ, బలహీనతలనూ అనవసరంగా తప్పుపట్ట కూడదు. కారణం లేకుండా విమర్శించ కూడదు. అవసరమైన విషయాల్లో మాత్రమే కల్పించుకోవాలి. సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాలి. ప్రోత్సహిస్తూ, వెన్ను తడుతూ ఉంటే చక్కటి ఫలితం సాధించవచ్చు. అంతేగానీ కేవలం బలహీనతలను మాత్రమే విమర్శించడం మొదలు పెడితే బాసైనా, టీమ్ లీడరైనా వారితో మాట్లాడడానికి ఎవరూ ఆసక్తి చూపరు. పైగా వారు చేసే పని కూడా మొక్కుబడిగా ఉంటుంది. అందుకే నాయకత్వ స్థానంలో ఉన్నవారు సిబ్బందితో కలివిడిగా మెదులుతూ వారిలో సృజనాత్మకతను పెంపొందించాలి. తమతో ఆలోచనలు పంచుకునే వాతావరణం సృష్టించాలి.
బాధ్యతలు:కొన్నిసార్లు టీమ్ లీడర్లో, పైస్థాయి ఉద్యోగులో సిబ్బందితో అన్ని పనులూ స్వయంగా దగ్గరుండి చేయించాలనుకునే వాళ్లుంటారు. కానీ దీనివల్ల ఫలితం ఉండదు. పనిలో చక్కటి ఫలితాలు రావాలంటే ఎప్పుడూ సిబ్బందితో చేయిపట్టి చేయిస్తున్నట్లో, తాము లేకపోతే సిబ్బంది పనిచేయరన్నట్లో వ్యవహరించకూడదు. ప్రతి క్షణమూ సిబ్బందిని పరిశీలిస్తూ ఏం చేస్తున్నారనే దానికంటే వారిపనిలో మెరుగుదల ఎలా ఉందో పరిశీలించాలి. అంతేగానీ ఎప్పుడూ నిఘా పెడుతున్నారన్న భావం కల్గించకూడదు. సిబ్బందిని నమ్మాలి. విశ్వసించాలి. ఎవరి పనిని వాళ్లు బాధ్యతగా ఫీలయ్యే వాతావరణం కల్పించాలి.
ఆచితూచి: టీమ్‌లీడర్లు బృందంలో ఒకరికి అనుకూలంగానో, మరొకరికి ప్రతి కూలంగానో ఉండకూడదు. కేవలం ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగానే వ్యవహరించాలి. బాధ్యతలను అప్పగించాలి. నాయకునిగా తాము తీసుకునే నిర్ణయం సరైందేనన్న భావన బృందంలోని సభ్యుల్లో ఏర్పడేలా చూడాలి. సెలవుల విషయంలోనూ, ముఖ్యమైన పనులూ, ప్రాజెక్టులూ అప్పగించడంలోనూ సమభావం. సమన్యాయం కన్పించాలి.
ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. సిబ్బందికైనా, మేనేజ్‌మెంట్‌కైనా, టీమ్ లీడర్లకైనా ఇబ్బందులూ, సంతోషాలూ అన్నీ ఉంటాయి. బృంద నాయకులుగానీ, ఉన్నతాధికారులుగానీ సిబ్బంది చెప్పేదీ వినాలి. సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించాలి. ఎంతసేపూ తమవైపు నుంచే గాకుండా ఎదుటి వారి తరపు నుంచి కూడా ఆలోచించాలి. పరిష్కారాలను అడగాలి. నలుగురి అభిప్రాయాలు తెలుసుకున్నాక, నాలుగు విధాల పరిశీలించాక తప్పకుండా సరైన పరిష్కారమే లభిస్తుంది. అంతేగానీ సమస్యలు పరిష్కరించకనే ఫలితం రాబట్టాలనుకోవడం పొరపాటు. దీనివల్ల సిబ్బందిలో నిరాసక్తతా, నిరాశా ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.
ప్రత్యేకంగా: ఎవ్వరైనా తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. పై స్థాయి ఉద్యోగి కూడా సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగాలి. అయితే మరీ సన్నిహితమూ తగదు. అందరిలో కలిసిపోయి ముందుండి నడ్పించే సామర్థ్యాన్నిగానీ, నైపుణ్యాన్నిగానీ వదులుకో కూడదు. లక్ష్యమే ముఖ్యం: అన్నింటికంటే ముఖ్యమైంది లక్ష్యం. దాన్ని సాధించే దిశగానే ఆలోచనలూ, ఆచరణా ఉండాలి. అందుకోసం అనుసరించే పద్ధతులపైన అవగాహన పెంచుకోవాలి. స్పష్టమైన వైఖరితో ఉండాలి. ఇది లేకుండా చక్కటి పలితం రాబట్టాలనుకోవడం సరైంది కాదు. ఈ విధమైన ప్రతిభా, నైపుణ్యమూ కనబర్చినప్పుడే, అవగాహన ఏర్పర్చుకున్నప్పుడే ఏ కొలువులోనైనా కొత్త ఒరవడులు సృషించగలుగుతారు. వృత్తి నైపుణ్యాన్ని సృజనాత్మకంగా ప్రదర్శించగలుగుతారు.