మనదేశంలో భూగర్భజలాలు ఎలా వినియోగించుకోవాలో ప్రపంచబ్యాంకు శాసించజూస్తోంది. జల వనరులను పొదుపుగా వాడుకోవాలన్న సలహాల మాటున నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని యూజర్ చార్జీలను వసూలు చేయాలని దుర్మార్గమైన షరతులను రుద్దుతోంది. ప్రపంచబ్యాంకు 'డీప్ వెల్స్ అండ్ ప్రూడెన్స్' పేరుతో విడుదల చేసిన నివేదిక మన దేశంలో భూగర్భజలాల లభ్యత, వినియోగం, భవిష్యత్ పరిణామాలను విశ్లేషించింది. చివరలో కొన్ని నిర్ధారణలు, సిఫారసులు చేసింది. ఏదైనా కుక్కను చంపాలంటే దానిని పిచ్చికుక్కగా ముద్రవేస్తే తేలికగా చంపొచ్చన్నది ప్రపంచబ్యాంకు సిద్ధాంతం. కొన్ని అంశాలను తీసుకుని వాటినే భూతద్దంలో చూపి ఆ విశ్లేషణ ఆధారంగా తీవ్రమైన చర్యలను సూచిస్తుంటుంది. అలా పెత్తనం చేస్తుంటుంది.
భూగర్భజలాల వినియోగంలో మనదేశం ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచ భూగర్భజలాల్లో మనవాటా కూడా పాతికశాతం పై మాటే. ఆ నివేదిక ప్రకారం 60శాతం వ్యవసాయం, 85శాతం తాగునీటి అవసరాలు భూగర్భజలాలతోనే తీరుతున్నాయి. భారతీయ ప్రజా జీవనంలో భూగర్భజలాలకు ప్రాధాన్యత పెరిగింది. ఆ రీత్యానే ప్రపంచబ్యాంకు ఈ రంగంపై కన్నేసింది. అందుకే ఈ విశ్లేషణలు, సిఫారసులు. భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగం ఇంకా పెరిగితే మరో 20 సంవత్సరాలలో దేశంలోని 60 శాతం నీటి వనరులు ప్రమాదకర పరిస్థితికి చేరుకుంటాయని నివేదిక మనల్ని భయపెడుతోంది. ఆ స్థితిని నివారించడానికి నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు ఏర్పడ్డాయి. ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని నేరుగా ప్రభుత్వం కాకుండా వాటి ద్వారా వేయిస్తున్నాయి. టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రారు) ఎల్లవేళలా ప్రైవేట్ టెలికం ఆపరేటర్ల ఆదాయాలను పెంచడానికి లాభాలను గ్యారెంటీ చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం జగద్విదితం. ఇంకొన్ని రంగాల్లో ఉన్న నియంత్రణ వ్యవస్థలు కూడా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా పనిచేస్తున్నాయి. రెగ్యులేటరీ వ్యవస్థ ఏర్పాటు చేయమన్న నోటితోనే దేశంలో దాదాపు రెండుకోట్ల బావులున్నందున వాటన్నింటినీ నియంత్రణ వ్యవస్థలోకి తీసుకురావడం కష్టమవుతుంది కనక నీటికి ధరను నిర్ణయించాలని ప్రపంచ బ్యాంకే చెప్పింది. భూగర్భజలాల వ్యాపారానికి అవసరమైన పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తోంది. భూగర్భజలాల వినియోగం ఇంత ఎక్కువగా ఉండటానికి కొన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇవ్వడం కారణమని దుమ్మెత్తి పోసింది.
కనుక వ్యవసాయానికి ప్రత్యేకమైన విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అంటే వ్యవసాయ విద్యుత్ సరఫరాను పరిమితం చేయడం, సబ్సిడీలను కట్టడి చేయడం దాని లక్ష్యంగా ఉంది. సన్న చిన్నకారు రైతాంగానికి విద్యుత్‌ను ఉచితంగానో, రాయితీ పైనో ఇవ్వకపోతే వ్యవసాయరంగంలో నిలదొక్కుకోవడం కష్టం. అందుకే వారి రాజకీయ కారణాలైనప్పటికీ ఆయా ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. వాటిని అడ్డుకోవడం కోసం ప్రపంచబ్యాంకు ఇలా రంకెలు వేస్తోంది. మన వ్యవసాయరంగంలో ఉన్న సన్న, చిన్నకారు రైతులను బయటకి పంపించాలని భూమిని కార్పొరేట్‌పరం గావించాలని ప్రపంచబ్యాంకు, డబ్ల్యుటిఓ ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అనేక రూపాల్లో వివిధ సందర్భాల్లో ఇలాంటి నివేదికలు వెలువరించడం మొదలు విదేశీ వ్యవసాయోత్పత్తులను దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా డంప్ చేయడం వరకు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. భూగర్భజలాలకు, విద్యుత్‌కు విడదీయరాని సంబంధం. విద్యుత్ రంగంలో ప్రపంచబ్యాంకు సంస్కరణలు ఇప్పటికే మనదేశంలో అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయి.
మన రాష్ట్రంతో సహా ఇతర ప్రభుత్వాలను కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని, రాయితీలను కత్తిరించమని చెబుతోంది. ప్రతి సందర్భంలో ఇలాంటి జోక్యం వుంటోంది. 2000 ఆగస్టు 28న బషీర్‌బాగ్‌లో విద్యుత్ అమరవీరుల బలిదానం అనంతరం ఆనాటి ప్రపంచబ్యాకు అధ్యక్షుడు పోలీస్ కాల్పులను సమర్థిస్తూ వాషింగ్టన్ నుండి ప్రకటన చేశారు. మనదేశంలో విద్యుత్ సంస్కరణల అమలు కోసం వారి యావ అలాంటిది. జన జీవనంలో జలానికి ప్రాధాన్యత మొదటి నుంచీ వుంది. మానవాళి ప్రాథమిక హక్కుల్లో ఒకటైన మంచినీటిని అంగడి సరుకుగా మార్చాలని, కార్పొరేట్లకు లాభాలను కట్టబెట్టాలని ప్రపంచబ్యాంకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ పాలకులు కూడా దాని ఒత్తిడికి తలొగ్గుతున్నారు. మన రాష్ట్రంలో ఈ ఒత్తిడి మరీ ఎక్కువగా వుంటోంది. 1997లో ప్రారంభమైన ప్రపంచబ్యాంకుతో బ్రహ్మముడి 2004 తర్వాత మరింత బలపడింది.2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి గెలిచాక నీటి రెగ్యులేటరీ కమిషన్ బిల్లు, కార్డుల ఏరివేత లాంటి అనేక చర్యలు ప్రపంచబ్యాంకు ఆదేశితమైనవే అమలు జరుగుతున్నాయి.ఇలాంటి నివేదికలు, సిఫార్సులతో మరిన్ని ప్రమాదాలు ముంచుకొస్తాయి. ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ముఖ్యంగా సామాన్యులు, సన్న చిన్నకారు రైతాంగం మనుగడకు ముప్పుగా తయారైన బ్యాంకు సంస్కరణలను, ఇలాంటి దుర్మార్గమైన సిఫారుసులను ఐక్యంగా తిప్పికొట్టాలి.