తక్షణం నియామకాలు చేపట్టాలి

డిఎస్సీ 2008 ద్వారా అర్హత సాధించిన 30,571 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగార్హులు నియామకం కొరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఫలితాలు విడుదలై ఏడు నెలలు అయినప్పటికీి నియామకాలు చేపట్టకపోవడం ప్రభుత్వానికి ఉద్యోగ కల్పన మీద ఏపాటి శ్రద్ధ వుందో అవగతమవుతూనే వుంది. ప్రతి సంవత్సరం డియస్సీ ద్వారా నియామకాలు చేపడతామంటూ గత ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలు గుప్పించింది. 2008 డిఎస్సీని మెగా డిఎస్సీ అని అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. అవసరం ఉన్నంత వరకూ ఓడ మల్లయ్య అవసరం తీరాక బోడి మల్లయ్య అన్నట్లుంది ప్రభుత్వ తీరు. సుప్రీం కోర్టు కేసు నెపంతో నియామకాలు జరపకుండా ఆలస్యం చేయాలని తప్పించూకోజూస్తుంది.

ఇంతకాలం నియామకాలు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. సుప్రీం తీర్పు ఆలస్యమైన ఎడల నియామకానికి అనేక మార్గాలున్నాయి. సబార్డినేట్‌ రూల్స్‌ 10(ఎ) ప్రకారం తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టవచ్చు. సుప్రీంలో ప్రభుత్వమే కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయవచ్చు. అవసరమైతే అడ్వకేట్‌ జనరల్‌ సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇటువంటి పరిష్కారాలను వెదకకుండా కావాలని కాలయాపన చేస్తోంది. గతంలో ఇదే సమస్యలున్నా 2003, 2006 డిఎస్సీలో తాత్కాలిక నియామకాలు చేపట్టారు.

ఇపుడు కూడా అదే పద్ధతిలో ఇవ్వవచ్చు. ప్రాథమిక పాఠశాలల్లో 70 శాతం పోస్టులను భర్తీ చేయడానికి కోర్టుల నుండి ఎటువంటి ఆటంకమూ లేదు. అయినప్పటికీ కోర్టు తీర్పు రావాలని ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోంది. ప్రభుత్వానికి ఇష్టమైతే పగలు కోర్టుకెళ్లి రాత్రికి రాత్రే తీర్పు తెప్పించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మద్యం దుకాణాల వేలం పాటలో ఎవరైనా కోర్టుకు వెళితే ప్రభుత్వం ఆ సమయంలో కోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తుందా? కచ్చితంగా చూడదు. ప్రభుత్వానికి అనుకూలమైతే ఒక విధానాన్ని, ప్రతికూలమైతే మరో విధానాన్ని పాటిస్తుంది. గతంలో సర్వీస్‌ రూల్స్‌ లేకుండా నియామకాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ (ప్రస్తుత?) నియామకాలు నిలిపివేయడం వల్ల ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 1,500కోట్లు మిగుల్చుకుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ది కొరవడడమే అసలు సమస్య. నిరుద్యోగం ఒక సామాజిక సమస్య. ఉద్యోగానికి అర్హత పొందినా కూడా నియామక పత్రాలు పొందలేకపోవడం వేలాది మందిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోంది. ఇప్పటికే నలుగురు ఉద్యోగార్హులు ఆత్మహత్యలు(ఒకరు ఈ రోజే మహబూబ్‌నగర్‌లో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు) చేసుకోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వాలు అవలంభిస్తున్న నయా ఉదారవాద విధానాల వల్ల సంఘటిత రంగం కుంచించుకుపోయింది. నిరుద్యోగం పెనుభూతమై పట్టి పీడిస్తోంది. ఇటువంటి పరిస్ధితుల్లో ఉపాధ్యాయ పోస్టులపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మెగా డిఎస్సీ 2008కు రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్‌జ్‌టి పోస్టులకు ఆరు లక్షల మంది పరీక్షలు రాశారు. వారి ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను అమలు చేయలేకపోవడంతో నియామకాల కొరకు వారంతా చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు.

ఈ నియామకాలు చేపట్టకపోవడమంటే ప్రాథమిక విద్యను విస్మరించడమే అవుతుంది. దీని వల్ల సామాజికంగా నష్టపోతాము. అభివృద్థిలో వెనుకబడతాము. విద్యను అభివృద్థి పర్చడం ద్వారానే కేరళ సామాజిక సూచికల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. దేశభవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అని డాక్టర్‌ కొఠారి అన్నారు. ప్రాథమిక విద్యను అబివృద్ది పరచడంలో ఉపాధ్యాయులే కీలక పాత్ర వహిస్తారు. నిరక్ష్యరాస్యత, పేదరికం గణనీయంగా ఉన్న భారత్‌ లాంటి దేశాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అటువంటి ప్రాథమిక విద్యారంగాన్ని క్రమేణా నాశనం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. ప్రయివేటు పాఠశాలలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. ఒక పథకం ప్రకారం ప్రాథమిక పాఠశాలలను మూసివేసేందుకు జోరుగా పావులు కదుపుతోంది. నియామకాలు చేపట్టాలని కోరుతూ యువజన సంఘాల ఆధ్వర్యాన అనేక పోరాటాలు జరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలి. తక్షణం నియామకాలను చేపట్టాలి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్