కాంగ్రెస్‌పార్టీ ఓటు బ్యాంక్‌పై కనబరిచిన శ్రద్ధ ఆచరణపై చూపని ఫలితంగానే ముస్లింల రిజర్వేషన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి విషయంలో ముస్లిం మైనార్టీలు వెనుకబడి ఉన్నట్టు పలు సర్వేలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నా వారికి రిజర్వేషన్ల దగ్గరకొచ్చేసరికి ఎన్నో అడ్డంకులు ఎదురుకావడం, మరెన్నో చిక్కుముళ్లు పడటం బాధాకరం. ఈ రిజర్వేషన్ మతపరమైనదిగా హైకోర్టు భావించింది. ఈ పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముస్లింలను ఉద్ధరిస్తామని స్వాతంత్య్రం వచ్చిననాటి నుండి ఎన్నికలొచ్చిన ప్రతిసారి పాలక పార్టీలు హామీలివ్వడం, తిలోదకాలివ్వడం షరామామూలైంది. ముస్లింలకు అన్యాయం చేసిన నేరస్థుల్లో సుదీర్ఘ చరిత్ర కలిగి అంతే సుదీర్ఘంగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌కు నెంబర్ వన్ స్థానం దక్కుతుంది. ఓట్ల కోసమే రాజకీయాలు నడపడంలో ఆ పార్టీది అందె వేసిన చెయ్యి. ఆ మాటకొస్తే అధికారం చెలాయించిన పాలకవర్గ పార్టీలన్నీ ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తహతహలాడాయి తప్ప వారి అభివృద్ధికి పని చేయలేదు. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పుట్టుస్వామి కమిషన్ మధ్యంతర నివేదిక ఇచ్చిన సమయంలో 2004లో ఎన్నికలొచ్చాయి. అప్పటి సిఎల్‌పి నేత వైఎస్, పిసిసి అధ్యక్షుడు డిఎస్ కలిసి రూపొందించిన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరైన దశ, దిశ లేకుండా రిజర్వేషన్లు కల్పించిన కారణంగా కోర్టుల చుట్టూ తిరగడానికే సమయమంతా సరిపోయింది. చివరికి హైకోర్టు ధర్మాసనం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో ప్రభుత్వం తెచ్చిన చట్టం చెల్లదని సోమవారం తీర్పు వెలువరించింది. బిసి కమిషన్ ముస్లింల వెనుకబాటుపై సమగ్రమైన అధ్యయనం చేయలేదని, సరైన ఆధారాలు చూపలేదని కోర్టు ప్రముఖంగా పేర్కొనడంతో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం మరోసారి బహిర్గతమైంది. వీటన్నింటివల్ల న్యాయస్థానం ఈ రిజర్వేషన్లుమతప్రాతిపదికగా మారతాయని భావించినట్టు కనిపిస్తుంది.
రాష్ట్ర జనాభాలో 9.2 శాతం మంది ముస్లింలున్నారని 2001 జనాభా లెక్కలు చెబుతున్నాయి. విద్య, ఉద్యోగాల్లో ఇతర ప్రజల కంటే వారు బాగా వెనుకబడి ఉన్నారని పలు అధ్యయనాలు కుండ బద్దలు కొడుతున్నాయి. 1979లో ఏర్పాటైన అనంతరామన్ కమిషన్ రాష్ట్రంలో ముస్లింలు ఆర్థికంగా, విద్య పరంగా వెనుకబడి ఉన్నారని గుర్తించింది. ఆ రంగాల్లో ముస్లింలకు సముచిత ప్రాధాన్యం కల్పించి వారి స్థితిగతులను మెరుగుపర్చడానికి వివిధ ముస్లిం సామాజిక తరగతులను బీసీలుగా గుర్తించాలని సిఫారసు చేసింది. 1982లో ఏర్పాటైన మురళీధరరావు కమిషన్ మెహెతర్, లదాఫ్ తదితర ముస్లిం తరగతులను బీసీల్లో చేర్చాలని సూచించింది. దానివల్ల కొద్దిమందికే ఊరట కలిగింది. ఆ తర్వాత 1995 ప్రాంతంలో ఏర్పాటైన పుట్టుస్వామి కమిషన్ ఎనిమిదిన్నర సంవత్సరాలు అధ్యయనం చేసి పూర్తి నివేదిక ఇవ్వకుండానే రద్దయింది. అయితే ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని పుట్టుస్వామి తన మధ్యంతర నివేదికలో పేర్కొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ సర్కారు మైనార్టీ కమిషన్ లెక్కల ఆధారంగా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయని రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరంచెప్పి ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని, ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. బీసీ సంక్షేమశాఖ సలహాదారు పిఎస్ కృష్ణన్ చేత ప్రభుత్వం హడావిడిగా అధ్యయనం చేయించి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో చట్టం తీసుకురాగా సంఘపరివార్ కార్యకర్తలు కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పటికే విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి అయ్యాయని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన స్టే రద్దయింది. చివరికి సోమవారం హైకోర్టు ధర్మాసనం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లదని తీర్పు చెప్పింది.
ముస్లిం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించగా ఇచ్చిన హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పిసిసి చీఫ్ డిఎస్ పేర్కొన్నారు. గతంలో వైఎస్‌కాని, ఇప్పుడు రోశయ్య, డిఎస్‌లు కాని ప్రకటనలైతే చేస్తున్నారుతప్ప తీసుకోవాల్సిన జాగ్రత్తలో వైఎస్ ప్రభుత్వంగాని, రోశయ్య ప్రభుత్వంగాని వైఫల్యం చెందిందని కోర్టు తీర్పు తేటతెల్లం చేసింది. హైకోర్టులో రెండుసార్లు సర్కారుకు చుక్కెదురు కావడానికి వెనుక ప్రభుత్వ తప్పిదాలు చాలా ఉన్నాయి. తొలుత మైనార్టీ కమిషన్ లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించింది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించుతున్నాయని కోర్టు చెప్పే వరకూ ప్రభుత్వానికి స్పృహ లేకపోయింది. బీసీ కమిషన్ ఆరు జిల్లాల్లోనే అదీ స్వల్ప వ్యవధిలో అధ్యయనాన్ని మమ అనిపించి ఇచ్చిన నివేదిక ఆధారంగా చట్టం తీసుకురావడాన్ని కోర్టు నేడు తప్పుబట్టింది. ముస్లింల వెనుకబాటుకు కమిషన్ సరైన ఆధారాలు చూపలేదని కోర్టు పేర్కొంది. అధికారపార్టీ కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే రంధిలో మునిగినందువల్లనే ఇలాంటి తీర్పులు వెలువడుతున్నాయి. నిన్నటి సచార్‌కాని, నేటి రంగనాథమిశ్రాకాని మైనార్టీలు, అందులోనూ ముస్లింల స్థితిగతులను కళ్లకుకట్టారు. ఆ కమిటీల సిఫారసులను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. రంగనాథమిశ్రా సిఫారసులకు అనుగుణంగా పశ్చిమబెంగాల్ వామపక్ష ప్రభుత్వం తమ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను బీసీలుగా గుర్తించి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఆహ్వానించదగిన నిర్ణయం ప్రకటించింది.
ఎన్నికలొచ్చినప్పుడే కాకుండా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఇచ్చిన హామీపై కాంగ్రెస్ చిత్తశుద్ధి చూపాలి. రెండేళ్లుగా విద్యార్థులు బిసి (ఇ) కేటగిరీలో సీట్లు సంపాదించి చదువు కొనసాగిస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన సకల చర్యలూ చేపట్టాలి. రిజర్వేషన్ల కల్పనపై తగిన వివరాలతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమర్ధవంతంగా వాదనలు వినిపించాలి.