హత్యా నేరాలుగా చూడాలి

    వారం రోజుల్లోనే రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగరంలో రెండు ఘోర ప్రమాదాలు. పదిహేను మంది దుర్మరణం. రెండు ఉదంతాలు కూడా ఎక్కడో మారుమూలనో, అధికార యంత్రాంగానికి కనిపించని ప్రాంతంలోనో కాదు. ఒకటి గవర్నర్‌ నివాసానికి కూతవేటు దూరంలో అయితే రెండవది సచివాలయానికి సమీపంలోని జనసమ్మర్థ ప్రాంతంలోది. రెండు సంఘటనల్లోనూ నేరపూరితమైన మానవతప్పిదాలే ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఒకటి సోమాజిగూడలోని కార్పొరేట్‌ ఆసుపత్రి పార్క్‌ కాగా, రెండవది నారాయణ గూడలో నిర్మాణంలో ఉన్న భవనం. ఏ భవనమైనా నిబంధనల ప్రకారం నిర్మిస్తేనే రక్షణ. అలాంటిది కార్యాలయాలు, ఆసుపత్రుల వంటివాటిని నిర్మించేటపుడు మరిన్ని జాగ్రత్తలు, రక్షణ చర్యలను విధిగా పాటించాలి.ఇలాంటి ఉదంతాలను హత్యానేరాలుగా పరిగణించాలి. పార్క్‌ ఆసుపత్రి విషయానికి వస్తే నిబంధనలను తుంగలో తొక్కటమే కాదు అనుమతి లేకుండా మరో అంతస్తును కూడా నిర్మించారు. ప్రాణాలమీదకు వచ్చినవారే ఆసుపత్రులకు వస్తారు. వాటి నిర్మాణంలోనే అడ్డగోలుగా వ్యవహరిస్తే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పార్క్‌ ఆసుపత్రి ఉదంతం కళ్లకు కట్టింది. ఈ ఆసుపత్రిని గతేడాది ఆగస్టు 31న అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ భవనానికి అగ్నిమాపకశాఖ అనుమతి లేదంటే నిబంధనలను ఎంత అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారో వెల్లడౌతోంది. ఇలాంటి చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు బలిగొనడాన్ని హత్యలతో సమంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి భవనాల విషయంలో కోర్టుల నిర్ణయాలను కూడా కొన్ని సందర్భాలలో విమర్శించకతప్పటం లేదు. పార్క్‌ ఆసుపత్రిలో అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్తును తప్ప మిగిలిన భవనాన్ని మామూలుగా వినియోగించుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ భవనానికి అగ్నిమాపకశాఖ అనుమతి లేదని, నిబంధనల మేరకు తగిన ఏర్పాట్లు లేవని అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ బహిరంగంగా ప్రకటించిన తరువాత కూడా ఇలాంటి అనుమతులు ఇస్తే రోగులకు ఇంక రక్షణ ఎక్కఎక్కడ ?

    పాత భవనాలను కూలగొట్టకుండా వాటిపై అదనపు అంతస్తులను నిర్మించటం, అవి ప్రమాదాలకు లోనుకావటం శుక్రవారం నాటి నారాయణగూడ ఉదంతంతోనే ప్రారంభం కాలేదు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో 2008 డిసెంబరులో ఒక భవనం ఇలాగే కుప్పకూలింది. అంతకు ముందు కూడా నిర్మాణంలో ఉండగా, లేదా అప్పుడే పూర్తయిన భవనాలు కూలిపోయిన ఉదంతాలు చాలా ఉన్నాయి. అయినా అధికార యంత్రాంగం గాని, దానిపై అజమాయిషీ చేసే రాజకీయ నాయకత్వంగాని ఏమాత్రం పట్టించుకున్నా ఇలాంటి దుర్ఘటనలు పునరావృతమయ్యేవి కావు. అనేక సందర్భాలలో రాజకీయ నాయకత్వమే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నది. అలాంటి వాటిని అవకాశంగా తీసుకొని అవినీతి అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారు లేదా వాటిని చూసీ చూడనట్లు వ్యవహరించిన వారిలో ఒక్కరంటే ఒక్కరికి అయినా కఠిన శిక్ష పడిన ఉదంతం లేదు. అందుకే నానాటికీ ఇలాంటి దుర్ఘటనలు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది జనం వచ్చిపోయే లేదా పనిచేసే దాదాపు రెండున్నరవేల భవనాలలో అగ్నిమాపక ఏర్పాట్లు లేవంటే, వాటిలో కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయంటే ఎవరిని నిందించాలి? మూడువేల కోట్లకు పైగా బడ్జెట్‌ ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ వద్ద ఒక భవనం కూలిపోయినపుడు శిధిలాలను తొలగించే సామాగ్రి కూడా లేదన్న విభ్రాంతికర వాస్తవం శుక్రవారం నాటి ఉదంతంతో బయటపడటం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అంశం. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చుట్టుపక్కల వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తే జరిగే నష్టం ఏమిటో కూడా నారాయణ గూడ ఉదంతం వెల్లడించింది. కూలిన భవనం పక్కనే ఉన్న స్కూలుపై పడి ఉంటే... తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. హైదరాబాద్‌ వంటి పురాతన నగరాలలో ఎప్పుడో నిర్మించిన భవనాలు ఇంకా అనేకం ఉన్నాయి. అలాంటివాటిలో ఏక్షణంలో అయినా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయని రాజధానిలో గుర్తించిన భవనాలు 737 ఉన్నాయి. వాటిలో కూల్చివేసినవి 289 మాత్రమే. కొన్నింటి విషయంలో కోర్టులు స్టే మంజూరు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కిరాయికి ఉన్నవారు తమకు న్యాయం చేయాలని కోరినా, లేక వారసుల పంపిణీ సమస్య తలెత్తినా వాటి పరిష్కారం తరువాతైనా కూల్చివేయాల్సినవే. అలాంటి వాటిని స్టే ఇచ్చి కొనసాగనిస్తే జరిగే నష్టానికి బాధ్యత ఎవరిది? అక్రమ నిర్మాణాల పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరిస్తే అలాంటి అక్రమ నిర్మాణాలు ఇంతగా పెరిగేవి కావు. ముందుగా అక్రమంగా నిర్మించుకోవటం తరువాత కోర్టు రక్షణతోనో, ప్రభుత్వ మినహాయింపు అవకాశంతోనో వాటిని క్రమబద్దీకరించుకోవడం నానాటికీ పెరుగుతోంది. అందువలన ఉన్న చట్టాలను సక్రమంగా అమలు జరపాలి. లోపాలను గుర్తించి అందుకనుగుణంగా చట్ట సవరణ చేయాలి. నారాయణగూడ దుర్ఘటనలో చనిపోయినవారంతా వలసకూలీలే. కాబట్టి ఈ కష్టజీవుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలి.

    భవన నిర్మాణ సమయంలో జరిగే ప్రమాదాలు, అక్రమాల కారణంగా కూలిపోతున్నపుడు బలి అవుతున్నది దిక్కూమొక్కులేని కార్మికులే. మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, గాయపడినవారికి చికిత్స చేయించి ప్రభుత్వాలు తమ చేతులు దులుపుకుంటున్నాయి. భవననిర్మాణ కార్మికుల రక్షణకు తగిన పకడ్బందీ చట్టం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఒక సమగ్ర శాసనం చేయాలని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆయా భవనాల నిర్మాణంలో ఎందరు పనిచేస్తున్నారో, ఎవరు పనిచేస్తున్నారో గాయపడినవారో, శవాలో బయటపడిన తరువాతే తెలుస్తున్నది. ఇప్పటికైనా ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కార్మికులకు తగురక్షణ కల్పించాలి. సమగ్ర చట్టం చేయాలి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్