''ఎచట భయశంకలను బుద్ధి యెరుగకుండు, ఎచట జాతి విభేదమ్ములీ జగమ్ము జీల్చి ఖండఖండమ్ములు చేయకుండు ..ఎచట క్రియా దీక్ష పూర్ణత్వ మెరుగగోరు, ఎచట నభ్యాసపుటెడారి యిసుక జొచ్చి హేతుచింతాతరంగిణి యింకకుండు... అట్టి స్వేచ్ఛా మహత్స్వర్గమందు దండ్రి! నాదు దేశమ్ము మేలుకొనంగనిమ్ము'' అని విశ్వకవి రవీంద్రుడు ఆకాంక్షించాడు. మత, భాషా, ప్రాంతీయ సంకుచిత వాదాలను తలకెక్కించుకున్న మరాఠా మనువాదులకు ఆ మహా కవి పలుకులు చెవికెక్కుతాయా? సకల మతాలు, ప్రాంతాలు, భాషలు, దేశాల వారిని సమానంగా ఆదరించే నిండుతనమున్న కారణంగానే ముంబయి అలనాడు మహోన్నత శిఖరాలను అధిరోహించింది. కళలు, సాహిత్యం తదితర రంగాల్లో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు విరాజిల్లాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, కళాకారులు, మేధావులు ఎంతోమంది ఈ నగరాన్ని తమ నివాసంగా చేసుకోవడానికి ఇదే కారణం. ఈ విశ్వజనీనతే ముంబయిని మహత్తర నగరంగా నిలిపింది.
చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినట్లు అశేష త్యాగాలతో నిర్మించుకున్న ఈ సుందర సౌథంలో శివసేన వంటి ఫాసిస్టు శక్తులు పాగా వేసి ముంబయిని, అలాగే మహారాష్ట్ర రాజకీయాలను శాసించాలని చూస్తున్నాయి. దాని ఫాసిస్టు అజెండాతో విభేదించిన వారిపై భౌతికదాడులకు దిగుతూ అరాచకం సృష్టిస్తున్నాయి. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి ముంబయి గత వైభవాన్ని, ఔన్నత్యాన్ని మంటగలుపుతున్నాయి. మత, ప్రాంత, భాషా దురభిమానాన్ని రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే, నివసించే, స్థిరనివాసం ఏర్పరుచుకునే పౌరుల రాజ్యాంగ హక్కును కాలరాచేందుకు ధాకరేలు ప్రయత్నిస్తున్నారు. దీనికి పరాకాష్ట బాలీవుడ్ నటులు షారుక్‌ఖాన్, అమీర్‌ఖాన్‌లపై దాడులు చేస్తామంటూ హూంకరింపులు. ఈ విషయంలో శివసేన చీఫ్ బాల్‌ధాకరేకు వత్తాసుగా ఆయన కుమారుడు ఉద్దవ్ ధాకరే, మేనల్లుడు మహరాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు రాజ్‌ధాకరేలు శివాలెత్తుతున్నారు. ముంబయిలో విద్వేషాలను బాహాటంగా రెచ్చగొడుతున్నారు.
వీరి ఫాసిస్టు చర్యలకు చెక్ పెట్టాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం తద్భిóన్నంగా వ్యవహరించడం శోచనీయం. మరాఠా భాష వచ్చిన వారికే ట్యాక్సీ నడుపుకునే లైసెన్సు ఇస్తామని ప్రకటించడం ద్వారా తాను కూడా సంకుచిత రాజకీయాలకు అతీతం కాదని నిరూపించుకుంది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో తర్వాత కొంచెం వెనక్కి తగ్గింది. ఇంతకుముందు ప్రముఖ క్రికెటర్ సచిన్‌టెండూల్కర్‌పై కూడా ఈ మరాఠా మనువాదులు ఇదేవిధంగా చిందులు తొక్కారు. 'క్రికెట్ ఆడుకో రాజకీయాలు నీకెందుకు' అంటూ హూంకరించారు. 'తొలుత నేను భారతీయున్ని. తరువాతే మహారాష్ట్ర వాణ్ణి. ముంబయి ఏ ఒక్కరి సొత్తో కాదు అందరిదీ'.అని సచిన్ అన్నందుకే ఆయనపై శివసేన నాయకుడు విరుచుకుపడ్డాడు. 'ముంబయి నగరం ప్రజలందరిదీ' అని ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనపై కూడా అసహనంతో ఈ మనువాదులు ఊగిపోయారు. గతంలో తనకు వ్యతిరేక వార్తలు ప్రసారం చేశారని ముంబయి లోని ఒక ఛానెల్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఐపిఎల్ మ్యాచ్‌లకు చట్టబద్ధంగా పాక్ క్రికెటర్లు అందుబాటులో ఉంటే తన ఫ్రాంచైజ్‌లోకి తీసుకునేవాడినన్న షారుక్ మాటలపై శివసేన ఇంతగా వీరంగం వేయడంలోనే అది ఎంతగా నిరాశ నిస్పృహల్లో ఉందో అర్థమౌతోంది. మహారాష్ట్ర ప్రజలు వరుసగా మూడుసార్లు ఆ పార్టీని తిరస్కరించినా దానికి బుద్ధిరాలేదు. షారుక్ క్షమాపణ చెప్పే వరకూ అతని సినిమాలు ఆడనివ్వబోమని హూంకరించడం ఫాసిస్టు చర్యే అవుతుంది. ముంబయిలో ఏ సినిమా ఆడాలో, ఏ దేశాలతో ఆటలు ఆడాలో ఈ మనువాదులు శాసించాలని చూడడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం.
మరాఠీ భాషను గౌరవించాలి అనడంలో తప్పు లేదు. కాని ఆ పేరుతో ఇతర భాషలు మాట్లాడే ప్రజలపై దాడులకు దిగడం అనేది అమానుషం, అప్రజాస్వామికం. 50వ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోనున్న మహారాష్ట్ర ఇటువంటి ఫాసిస్టు శక్తుల దుశ్చర్యల మూలంగా అప్రతిష్ట పాలవుతోంది. ఇప్పటికే రైతాంగ ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఒకప్పుడు మత సామరస్యంతో పరిఢవిల్లిన ఈ నగరం నేడు మత విద్వేషాలకు, మాఫియాలకు నిలయంగా మారింది. పేదరికం విలయ తాండవం చేస్తోంది. ఇవేవీ మరాఠా మనువాదులకు పట్టవు. స్వాతంత్య్రానికి పూర్వం కార్మికోద్యమాలకు, ప్రజాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ముంబయిలో కార్మికోద్యమాన్ని దెబ్బతీయడానికి పాలకవర్గాలు శివసేన వంటి ఫాసిస్టు శక్తులను తెరపైకి తెచ్చాయి. కాబట్టి ఈ పాపంలో పాలకవర్గాలకూ బాధ్యత ఉంది. బిటి రణదివే, ఎస్‌ఎ డాంగే వంటి నేతలు ముంబయిలో కార్మికోద్యమానికి పునాదులు వేశారు. అవి బలంగా ఉన్నప్పుడు అక్కడ అరాచక శక్తులకు ఆస్కారమే ఉండేది కాదు. ఎప్పుడైతే కార్మికోద్యమాలను దెబ్బతీసే కుట్రలు జరిగాయో అప్పటి నుండి ముంబయి అరాచక శక్తులకు అడ్డాగా మారింది.
ఆరు పదుల భారత గణతంత్రంలో ఇటువంటి ఫాసిస్టు ధోరణులు చెలరేగటం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి ఈ మనువాదులకు వ్యతిరేకంగా కళాకారులు, రచయితలు, అభ్యుదయవాదులు ఐక్యంగా గళం విప్పాలి. షారుక్‌ఖాన్ విషయంలో అటువంటి విశాల సంఘీభావం వ్యక్తం కావడం ఒక మంచి పరిణామం. దీన్ని మరింత విస్తృతపర్చాలి. మనువాదులను ఏకాకుల్ని చేయాలి. మరాఠా మనువాదుల తాజా దుశ్చర్యతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి మరో మనువాద పార్టీ బిజెపి యత్నిస్తున్నప్పటికీ దాని చిత్తశుద్ధి ప్రశ్నార్థకమే.
బీహారులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఉత్తరాది వాళ్లలో వ్యతిరేకత వస్తే బీహారులో తన ఉనికికే ముప్పు వస్తుందన్న భయంతోనే శివసేన నాయకుల ప్రకటనను అది ఖండించిందన్నది జనవాక్యం. ఒకవైపు శివసేనతో పొత్తు కొనసాగిస్తూనే దాని చర్యలతో తనకు సంబంధం లేదని చెప్పడం బిజెపి దివాళాకోరుతనాన్నే తెలియజేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సంకుచిత రాజకీయాల నుంచి బయటపడి శివసేన వికృత పోకడలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ముంబయి మరాఠాయేతరులతో నిండిపోతోందన్న శివసేన అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. ఏదో ఒకపని దొరుకుతుందనే ఆశతో దేశ వాణిజ్య రాజధాని ముంబయికి వచ్చి అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. తద్వారా ముంబయి అభ్యున్నతికి పాటుపడుతున్నారు. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి భాషా, ప్రాంతీయ దురభిమానాలను రెచ్చగొడుతున్న థాకరేలకు ప్రభుత్వం వెంటనే ముకుతాడు వేయాలి. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలి.