వికృత వాదనలు

    'పెట్రోలు, డీజిలుపై ప్రభుత్వం ఇంకా సబ్సిడీలు భరించాలన్న వాదన సహేతుకమైనది. అసలు దానికి అర్థం లేదు.' అని చమురు ఇందన ఛార్జీలపై నివేదికను ప్రవేశపెట్టిన పారిఖ్‌ చెప్పారు. ఇంతకన్న వికృతమైన వాదన మరొకటి ఉండదు. సరుకు రవాణాకు లారీలు, ట్రక్కులు ఉపయోగించేది డీజిలు. ఎగుమతి, దిగుమతి ధరలు, సరుకుల ధరలు, నిత్యావసర, ఆహార ధరలన్నింటిపై డీజిలు ఛార్జీల ప్రభావం పడుతుంది. పెట్రోలు ధరలు పెంచితే వ్యక్తిగత ఖర్చు ప్రభావితం అయి తలసరి ఆదాయం, పొదుపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. గ్యాసు, కిరోసిన్‌పై పెంచితే యావత్‌కుటుంబ ఆర్థిక పరిస్థితే తలకిందులవుతుంది. సామాన్యుడి ఆదాయాలు కాపాడబడాలన్నా, ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ సజావుగా నడవాలన్నా పెట్రో, డీజిలు ధరలు అదుపులో ఉండాలి. అనియంత్రిత విధానాలు పై అంశాలన్నింటినీ అతలాకుతలం చేయడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. నివేదిక రూపొందిచిన సభ్యుల కంటికి అంబానీలు, వారి శ్రేయస్సు తప్ప, ఈ దేశంలో రోజుకు 20రూపాయలకంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్న 80శాతం ప్రజానీకం కనపడనట్లుంది. ఒక్కటంటే ఒక్క సిఫారసు కూడా సామాన్యుడికి పనికొచ్చేది లేదు. 'ప్రజలు భరించగలరు కాబట్టే పెంపునకు సిఫారసు చేశాం. బ్యారెల్‌ ధర తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడే పెంచితే మంచిది. 120డాలర్లకు చేరే దాకా ఆగొద్దు' అని ఓ ఉచిత సలహా కూడా వీరిచ్చారు.

    నెలసరి ఆదాయంలో ఆహారం ఖర్చే 60శాతంపైగా ఆక్రమించుకుంటున్న నేపథ్యంలో కోట్లాది కుటుంబాలు ఆహారం మీద ఖర్చును తగ్గించి పౌష్టికాహార లోపానికి గురవుతున్నాయి. మరింత భారం వేస్తే పస్తులుండడం మినహా వీరు చేసేదేమీ లేదు. దీనిని కూడా భరించడంలో భాగంగానే చూస్తే అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. చమురుశుద్ధి విషయంలో మన దేశం స్వయం సమృద్ధిని కలిగి ఉంది. ముడి చమురు ఉత్పత్తి సైతం మనకు సరిపడినంత ఉంది. ప్రభుత్వరంగ చమురు ఉత్పత్తి కంపెనీలు మనదేశ అవసరాల్లో 30 నుంచి 35శాతం మేర చమురును సరఫరా చేస్తున్నాయి. ప్రయివేటు కంపెనీలు మాత్రం అంతర్జాతీయ ధరలకే ఇస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపినా సగటు ధర అంతర్జాతీయ ధరకంటే తక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు అంతర్జాతీయ బ్యారెల్‌ ధరకు అనుగుణంగా పెట్రోఛార్జీల్లో మార్పులు రావాలనడంలో మర్మమేంటి? పారిఖ్‌ నివేదికలో దీనికి సమాధానమే లేదు. మరి ఈ దిగుమతి సమానీకరణ ధరల నిర్ణయం ఎవరి ప్రయోజనాల కోసం? ఈ నివేదికలోని ఇంకొన్ని సూచనలను పరిశీలిస్తే మరింత స్పష్టత వస్తుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు దేశీయంగా పెట్రో ధరలు కూడా పెరిగితే ఆదాయంలో వచ్చే వృద్ధిపై వేసే గాలివాటు పన్ను ప్రయివేటు కంపెనీలకు వేయనక్కర్లేదట. ఒఎన్‌జిసి, ఒఐఎల్‌ కంపెనీల నుంచి మాత్రం బ్యారెల్‌ ధర 60-70 డాలర్ల మధ్య ఉంటే 20శాతం, 71-80 మధ్య ఉంటే 40శాతం, 81-90శ మధ్య ఉంటే 60శాతం, 91డాలర్లపైన ఉంటే 80శాతం మేర ఈ తరహా పన్ను పిండుకోవచ్చట. సబ్సిడీగా ఆయిల్‌ కంపెనీలకు ఇచ్చే స్థానం నుంచి వైదొలగి, ఈ పెంపునూ ఓ ఆదాయ వనరుగా పిండుకునే స్థానంలోకి ప్రభుత్వం మారుతుంది. సరిగ్గా ఇదే సందర్భంలో పెట్రో ఉత్పత్తి, శుద్ధి రంగాల్లో ఉన్న అంబానీల కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు పోగేసుకునేందుకు ఆస్కారాన్ని కల్పిస్తోంది. కాకులను కొట్టి గద్దలకు వేయడమంటే ఇదే.

    ప్రస్తుతం లీటరు పెట్రోలు వసూలు చేస్తున్న ధరలో 48శాతం మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులున్న మాట తెలిసిందే. ఎంతైతే ధరలు పెంచాలనుకుంటున్నారో అంతే మేర తాము పిండుకుంటున్న పన్నుల్లో వాటాలను తగ్గించుకుంటే సాధారణ ప్రజానీకం మీద పెట్రో భారం పడే అవకాశమే లేదు. కానీ ప్రభుత్వం దీనికి సిద్ధంగా లేదు. తాజా నివేదిక ఎక్సయిజ్‌ పన్నును తగ్గించుకోవాలని కనీస సూచన కూడా చేయకుండా, అంతటా సమానంగా వర్తించే విధంగా సవరణలు చేసుకునే 'అవకాశాన్ని' కల్పించింది. దిగుమతి ధరల సమానీకరణ విధానంలో పన్నుల బాదుడుకు ఇదో వెసులుబాటు. ఏతావాతా ఎన్ని వాతలైనా పెట్టి ప్రభుత్వం తనపై ఉన్న సబ్సిడీ భారాన్ని దించేయాలనుకుంటోంది. ఆర్థికమాంద్యం లేనప్పుడు ప్రభుత్వం పారిశ్రామికవర్గాలకు అందించిన ఆరులక్షల కోట్ల రూపాయల రాయితీల్లో ఇది ఆరోవంతు కూడా లేదు. ఈ రాయితీలు తగ్గించుకొని సామాన్యుడిపై భారాన్ని తగ్గించవచ్చు. ఆ పని చేయకపోగా మరో రెండు లక్షలకోట్ల విలువ చేసే ఉద్దీపన రాయితీలు కూడా బడాబాబులకు అందించింది. ఇంత హడావుడిగా, కొద్ది రోజుల్లో బడ్జెట్‌ వస్తుందనగా పెట్రోభారాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ద్రవ్యలోటు భారాన్ని తగ్గించుకోవాలంటే పెట్రోఛార్జీల పెంపును ఒక సాధనంగా సర్కారు భావిస్తున్నది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తిపరిచేందుకు సామాన్యుణ్ని బలిపీఠం ఎక్కించేందుక్కూడా మన ఆమ్‌ఆద్మీ సర్కార్‌ వెనుకంజ వేయట్లేదు. ఏ రూపంలో చూసినా పెట్రోధరల పెంపు సిఫారసులు దేశంలోని 90శాతం ప్రజానీకంపై పిడుగుపాటులాంటివే. విశాల ప్రజా ప్రయోజనాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని ఈ తలలేని సిఫారసులను వెనక్కి తిప్పికొట్టాల్సిందే.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్