మాఫీలోనూ చేతివాటం

వ్యవసాయ రుణ మాఫీ పథకం అమలులో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని కాగ్‌ తాజాగా వెల్లడించడం యుపిఎ సర్కారుకు మరో మరక. 2జి, సిడబ్ల్యుజి, బొగ్గు గనులు ... ఇలా ఎడతెగని కుంభకోణాల జాబితాలో మరొకటి కొత్తగా చేరింది. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగానికిచ్చిన రాయితీలోనూ ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం పాలకుల పరిస్థితి ఎంతలా దిగజారిందో విదితం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రకటించిన వ్యవసాయ రుణ మాఫీ మొత్తం రూ.71,680 కోట్లు కాగా ఇప్పటి వరకూ బ్యాంకులకు అందజేసింది రూ.52,516 కోట్లు. మొత్తం 4.29 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. వాటిలో 90,576 కేసులను కాగ్‌ ఆడిట్‌ చేయగా 20,216లో అక్రమాలు, లోటుపాట్లు జరిగాయని నిర్ధారించింది. మొత్తం కేసుల్లో ఇవి 22 శాతం. అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక మెతుకు చూస్తే చాలు కదా! అవినీతి ఎంత తీవ్రంగా ఉందో ఈ అంకెలే వెల్లడిస్తున్నాయి. మన రాష్ట్రంలో రూ.11,353 కోట్లు మాఫీ అయింది. ఇందులో రూ.1,900 కోట్ల మేర అనుచిత లబ్ధి చేకూరిందని విపక్షాలు, నిపుణులు చెబుతున్నారు. దారి మళ్లిన సొమ్ములో అధికార పార్టీ అనుయాయులకే దక్కడం సర్వ సాధారణం. కాంగ్రెస్‌ది అందులో అందె వేసిన చెయ్యి. రైతుల పేరిట చేసిన రుణ మాఫీని మైక్రోఫైనాన్స్‌ సంస్థలు కాజేయడం గమనార్హం. ఒక ప్రైవేటు బ్యాంకు రూ.164.6 కోట్లు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు కట్టబెట్టినట్లు కాగ్‌ నిగ్గుదేల్చింది. ఆ సొమ్మును వారి నుంచి రాబట్టాలనీ నిర్దేశించింది. ప్రభుత్వం ప్రైవేటు బ్యాంకుల కోసం తహతహ లాడుతూ ఇటీవలనే లైసెన్సుల మంజూరుకు తెర లేపింది. అంటే రానున్న రోజుల్లో ఇలాంటి అనేక అక్ర మాలకు కొదవుండదన్న మాట. మన రాష్ట్రంలో వడ్డీ వ్యాపార సంస్థలు సైతం చేతివాటం చూపాయి. ఐదు సంస్థలకు రూ.66.16 లక్షలు జమయిందని కాగ్‌ స్పష్టం చేసింది. ఇవి కేవలం కొన్ని నమూనా కేసులు మాత్రమే! అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక రెట్లు అక్రమాలు వెలుగుచూడొచ్చు.

అక్రమార్కులకు అయాచిత లబ్ధి చేకూర్చిన బ్యాంకర్లు అనేకమంది అర్హులకు మొండిచెయ్యి చూపారు. దరఖాస్తులలో మాఫీని తిరస్కరించిన వాటిలో 9,334 పరిశీలించగా 1,257 దరఖాస్తులు అర్హత కలిగినవేనని కాగ్‌ తేల్చింది. అంటే బ్యాంకర్లు 13.46 శాతం మంది అర్హులైన రైతుల దరఖాస్తులను మాఫీ వర్తించదని తిరస్కరించారన్నమాట. ఇబ్బందుల్లో, ఆత్మహత్యల అంచున ఉన్న రైతుల పట్ల కొందరు బ్యాంకర్ల దుర్మార్గ దృక్పథానికిదో మచ్చుతునక. రుణ మాఫీ ఐదెకరాల లోపు రైతులకు మాత్రమే వర్తిస్తుందని కేవలం 5.19 ఎకరాలున్న రైతులకు మాఫీ తిరస్కరించిన ఉదంతం అనంతపురం జిల్లాలో ఇటీవల వెల్లడైంది. అమాయకుడైన ఆ రైతుకు జప్తు నోటీసును సైతం బ్యాంకర్లు ఇటీవల పంపారు. అన్ని సందర్భాల్లోనూ ఇంత కరాఖండిగా ఉంటే అక్రమాలకు అవకాశమే ఉండదు. రుణ మాఫీ అమలు తీరును పర్యవేక్షించాల్సిన రిజర్వుబ్యాంకు, నాబార్డు ఆ పని చేయకుండా బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంతోనే సరిపెట్టేశాయని కాగ్‌ అక్షింతలు వేసింది. బ్యాంకింగ్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న ఇలాంటి సంస్థలు అలా వ్యవహరించడం సబబు కాదు. నోటీసులు పంపడానికి, కోర్టు ఖర్చులు వంటి వాటినీ రుణ మాఫీ మొత్తంలోనే బ్యాంకర్లు కలిపేయడం మరో చిత్రం. ఇలాంటి ఖర్చులను బ్యాంకులే భరించాలి తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి గుంజడం సరికాదని కాగ్‌ మార్గనిర్దేశం చేసింది.

ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు ఆదేశించిన విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించడం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. సన్న, చిన్నకారు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్న డిమాండు అత్యంత న్యాయసమ్మతమైనది. రుణ మాఫీలో అవినీతి జరిగింది కనుక ఆ పేరుతో ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. నయా ఉదారవాద విధానాల్లో భాగంగానే అవినీతి పెరుగుతోంది. అందులోనూ రాజకీయ నాయకులు, ఉన్నతాధికార యంత్రాంగం, కార్పొరేట్ల అపవిత్ర కూటమి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతోంది. పేదలకు, కష్టాల్లో ఉన్న రైతాంగానికి అనేక రాయితీలివ్వడం, సంక్షేమ చర్యలను చేపట్టడం ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. రుణ మాఫీలివ్వడమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం కాదు. రైతుకు బాధల నుంచి విముక్తి కలగదు. ఎరువులు, విత్తనం, పురుగు మందులు, పరపతి వంటి ఇన్‌పుట్స్‌ను చౌకగా అందించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి చర్యలతో పరిష్కారం లభిస్తుంది.

రుణాల మాఫీ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధి పొందింది. అనేకమంది రైతులకు మేలు జరిగిన మాట నిజమే. అయితే రైతుల పేరిట మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు, వడ్డీ వ్యాపారులకు లబ్ధి చేకూర్చటం కాంగ్రెస్‌ మార్క్‌ పాలనకు తార్కాణం. యుపిఎ హయాంలో సాగిన అనేక కుంభకోణాల్లో ఇదొకటి. కాగ్‌ చెప్పిన విధంగా రిజర్వు బ్యాంకు, నాబార్డు వెంటనే దర్యాప్తు చేసి అనుచితంగా మళ్లిన సొమ్మును తిరిగి రాబట్టాలి. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఆర్థిక నేరాల విషయం ఉపేక్షిస్తే మరింత పెద్ద నష్టాలు కలుగుతాయి.