భయోత్పాతం కలిగించిన దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు జరిగి రెండు వారాలైనా కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ పురోగతేమీ లేదు. పోలీసుల హడావిడి తప్ప ముష్కరుల ఆచూకీ కనిపెట్టలేక పోయారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించడం, పొరుగు రాష్ట్రాల పోలీసులు ఇచ్చిన సమాచారంతో పాత నేరస్థులను ప్రశ్నించారంతే. పేలుళ్లు జరిగిన తీరునుబట్టి ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పనేనని అనుమానించడం తప్ప అందుకు స్పష్టమైన ఆధారాలేమీ దొరకలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఉగ్రవాదులు దిల్‌సుఖ్‌నగర్‌లో మరణహోమం తలపెట్టగలిగారన్న వాస్తవం దాచినా దాగనిది. తప్పు మీదంటే మీదంటూ ఇరు ప్రభుత్వాల పరస్పర నిందా పర్వం దారుణం. పేలుళ్లు మొదలుకొని కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు బదలాయించేంత వరకూ సంవాదం నడుస్తూనే ఉంది. దుండగులను పట్టుకోవడంపై కంటే దర్యాప్తునకు పోటీ పడటంపైనే వివిధ విభాగాలు దృష్టి నిలిపాయి. ఎవరికి తోచినట్లు వారు సంఘటన చోటు నుంచి ఆధారాలు సేకరించుకు పోవడంతో దర్యాప్తునకు ఆటంకం ఏర్పడింది. ప్రధాని, కేంద్ర హోం మంత్రి షిండే పర్యటించినా దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం కుదరలేదు. పైగా షిండే, ఆయన శాఖ కార్యదర్శి తాము పేలుళ్లపై ముందస్తు హెచ్చరికలు చేశామని చెప్పగా, హైదరాబాద్ కమిషనర్ పత్రికాముఖంగా తాము ఎక్కడ ఎన్నిసార్లు తనిఖీలు చేశామో లెక్కలు చెప్పి తమ తప్పేం లేదని వాదించారు.
సిసి కెమెరాల పనితీరుపై ఆరోపణలు సరేసరి. ఇన్ని వివాదాల మధ్య మక్బూల్‌ది కొత్త వివాదం. పూణే పేలుళ్ల కేసులో నిరుడు అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసులు మక్బూల్, ఇమ్రాన్‌లను హైదరాబాద్‌లో అరెస్టు చేసి విచారించారు. ఐఎం ఆదేశాల మేరకు దిల్‌సుఖ్‌నగర్‌తో సహా పలు చోట్ల రెక్కీ నిర్వహించినట్లు మక్బూల్ వెల్లడించినప్పుడు కూడా మన రాష్ట్ర సర్కారు తేలికగా తీసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పేలి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిశాక ఇప్పుడు తీరిగ్గా మక్బూల్ జపం చేస్తోంది. తీహార్ జైలులో ఉన్న మక్బూల్, ఇమ్రాన్‌లను ఎన్‌ఐఎ అధికారులు హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారించగా నగరంలో పన్నెండు చోట్ల అవలీలగా రెక్కీ చేశామనడంతో మన నిఘా డొల్లతనం తేలింది. ఇప్పటి వరకూ మక్బూల్ క్షమాభిక్షపై స్పందించని ప్రభుత్వం విమర్శల నుంచి బయటపడేందుకు అతని క్షమాభిక్ష రద్దు చేసింది. శాంతిభద్రతల వైఫల్యంపై ముప్పేట దాడినెదుర్కొంటున్న సర్కారు పోలీసులు వారిస్తున్నా ఎందుకైనా మంచిదని పేలుళ్ల కేసును ఎన్‌ఐఎకు అప్పగించి చేతులు దులుపుకుంది. కాగా బాంబు పేలుళ్లలోనూ ప్రాంతీయ కోణాన్ని వెతికి పట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. వేర్పాటువాదులను నిరోధించే క్రమంలో పోలీసులు ఉగ్రవాదులను గుర్తించలేకపోయారని మంత్రి టిజి, లగడపాటి నోరుపారేసుకోగా, సమైక్యవాదులే పేలుళ్లకు కారణమంటూ టిఆర్‌ఎస్, కోదండరాం రెచ్చిపోయారు. ఐఎం చీఫ్ రియాజ్ భత్కల్, మరో తొమ్మిది మందిపై ఢిల్లీ కోర్టులో నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు దేశాంతరానికి ముడిపడినట్లయింది. పేలుళ్ల సమాచారాన్ని ఎన్‌ఎస్‌జి చీఫ్ ఐఎస్‌ఐ ఏజెంట్‌కు చెప్పినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇలాంటి సున్నితాంశంపై ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలి. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలి. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో కేసును ఛేదించి అసలైన నిందితులను పట్టుకొని శిక్షించినప్పుడే ప్రజల్లో భయం తొలుగుతుంది.