ప్రాజెక్టుల పరిహాసం...

పోలవరం టెండర్లలో మరోసారి కిరణ్‌ సర్కారు అప్రతిష్టపాలైంది. ప్రతిపాదిత ప్లానుతో ప్రాజెక్టు నిర్మిస్తే లక్షలాది గిరిజనులు మునుగుతారని నిరసనలు వ్యక్తమవుతున్నా, పర్యావరణానికి ముప్పని నిపుణులు ఘోషిస్తున్నా ప్రభుత్వం లక్ష్య పెట్టట్లేదు. కాంగ్రెస్‌ జలయజ్ఞం సాగు కోసం కాదు, నిధులు లూటీకేనని ఇప్పటికే అర్థమైంది. అవినీతిమయమని కాంగ్రెస్‌ నేతలే రోడ్డునపడి తూలనాడుకుంటున్నారు. జలయజ్ఞం దోపిడీకి ప్రస్తుత పోలవరం టెండర్లు పరాకాష్ట. గతంలో స్యూ కన్సార్టియం కెసిఆర్‌ బినామీగా ఆరోపణలు రావడంతో ఆ కాంట్రాక్టును సర్కారు రద్దు చేసింది. మళ్లీ రూ.4,717 కోట్ల పనులకు టెండర్లు పిలవగా 14 శాతం తక్కువ కోట్‌ చేసిన ట్రాన్స్‌ట్రారు-యుఇఎస్‌ ప్రథమ స్థానం (ఎల్‌-1)లో నిలిచింది. కాగా రష్యాకు చెందిన యుఇఎస్‌ చూపెట్టిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులు రావడం, విషయం హైకోర్టుకు చేరడంతో పరిశీలనకై ప్రభుత్వం అధికారులను రష్యా పంపింది. రష్యా వెళ్లిన అధికారులు ట్రాన్స్‌ట్రారు ఏర్పాటు చేసిన విడిదిలో 'ఎంజారు' చేసొచ్చి, దానికి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. ఆ నివేదికతో ఇఎన్‌సి విభేదించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వద్ద 'పంచాయితీ'పెట్టి చివరికి ట్రాన్స్‌ట్రారుకే టెండరు దక్కేలా 'పెద్దలు' అర్థరాత్రి కథ నడిపించారు. దీనిపై మరో కాంట్రాక్టు సంస్థ సోమా కోర్టుకెక్కడం, రష్యా వెళ్లొచ్చి ఇచ్చిన నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది.

కోర్టులో కేసుండగానే కాంట్రాక్టర్‌ను ఎలా నిర్ణయిస్తారన్న కోర్టు ప్రశ్నతో సర్కారు పెద్దల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. 14 శాతం తక్కువకు టెండర్‌ వేసిన కంపెనీ నిర్మించే ప్రాజెక్టు నిలుస్తుందా అని నిపుణులు అనుమానిస్తున్నారు. అన్ని అనుమతులూ రాకుండా, కోర్టుల్లో కేసులు తేలకుండా టెండర్లపై ఆతృత దేనికి? లక్షలాది గిరిజనుల బతుకులను పణంగా పెట్టే పోలవరాన్ని పట్టుకొని వేలాడటం వెనుక ప్రాజెక్టును పూర్తి చేసే చిత్తశుద్ధి కంటే కమీషన్ల కక్కుర్తే ఎక్కువగా ఉంది.

మునపటి ఆర్టికల Publiture