సోమవారం దేశ తూర్పు తీరం పోలీసు పదఘట్టనలతో అట్టుడికింది. తమిళనాడులోని కుడంకుళం వద్ద కాల్పుల్లో ఒక మత్స్యకారుడు మరణించగా విశాఖపట్నం జిల్లా ముత్యాలమ్మ పాలెం గ్రామస్తులందరినీ గృహ నిర్బంధం గావించారు. అక్కడా, ఇక్కడా సమిధలవుతున్నది మత్స్యకారులే! అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు మారణహోమం సాగిస్తున్నాయి.
కుడంకుళంలో అణు విద్యుత్ కేంద్రం వల్ల తాము ఉపాధి కోల్పోవడమే గాక ఆ ప్రాంతపు భద్రతే ప్రమాదంలో పడుతుందని మత్స్యకారులు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగాక ఇక్కడి ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజల అపోహలను తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అలా చేయకుండా ఆందోళన చెందుతున్న ప్రజలపై విరుచుకుపడటం అమానుషం. కుడంకుళం ప్రజల ఆందోళనకు సానుకూలంగా స్పందించి ప్రధానికి లేఖాస్త్రాలు సంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం మంత్రం పడిందోగానీ ఇప్పుడు వైఖరి మార్చుకున్నారు. అమాంతం జనంపై విరుచుకుపడుతున్నారు. సోమవారంనాటి ఆందోళన హఠాత్తుగా జరిగింది కాదు. ఆదివారంనాడే వెయ్యి మందికి పైగా ప్రజలు శాంతియుతంగా నిరసన ప్రారంభించారు. వారితో చర్చలు జరిపి సాధారణ స్థితిని నెలకొల్పడం ప్రభుత్వ కర్తవ్యం. అది చేయలేదు సరికదా ... నిర్బంధానికి పూనుకోవడం తగని పని. ఆందోళనకారులను రానివ్వకుండా పోలీసులు ముళ్లకంచెలు వేయడం ఆనవాయితీ. కానీ కుడంకుళం సమీపంలో నిరసనకారులు తమ వద్దకు పోలీసులు రాకుండా చేయడానికి ముళ్లకంచెలు వేశారు. ఓ రకంగా చెప్పాలంటే తమను తామే నిర్బంధించుకున్నారన్నమాట. ఇంత శాంతియుతంగా అక్కడి ఆందోళన సాగుతుండగా పోలీసులు జనంపై నిర్బంధానికి తెగబడుతున్నారన్న వార్తలు తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఆ క్రమంలోనే తూత్తుకుడి జిల్లా మనవేడు గ్రామంలో పోలీసులు ప్రజలపై కాల్పులకు పాల్పడ్డారు. ఆంథోనీ స్వామి అనే మత్స్యకారుడు అక్కడికక్కడే నేలకొరిగాడు. తమ జీవనోపాధికి, జీవనానికి ముప్పు వాటిల్లిందన్న భయంతో ఉన్న మత్స్యకారులపై ప్రభుత్వం నిర్బంధానికి పూనుకోవడం ఘోరమైన విషయం. అణు విద్యుత్ కేంద్రంలో ఇంధనం నింపడానికి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చిన మాట నిజమే. అయినంత మాత్రాన నిర్బంధం విధించాలని లేదు. స్థానిక ప్రజలతో నేరుగా గానీ, ఉభయులకూ అంగీకృతమైన మధ్యవర్తుల ద్వారాగానీ చర్చించి వారి భయాందోళనలను తొలగింపజేయాలి. ఇది రోజులు ... వారాల్లోనే పూర్తికాక పోవచ్చు. సర్కారు ఓపికతో చేయాలే తప్ప జనం ప్రాణాలు తీయరాదు.
విశాఖపట్నం జిల్లా ముత్యాలమ్మపాలెం గ్రామస్తుల ఆందోళన ఇప్పటికిప్పుడే సాగుతున్నది కాదు. సింహాద్రి థర్మల్ ప్లాంట్ కారణంగా తమకు ఉపాధి పోయిందని, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని స్థానికుల ఆందోళన. నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఉపాధి గురించి బాధితులకు అధికార యంత్రాంగం ఇచ్చిన హామీలు ఏళ్లు గడుస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. మరోవైపు కాలుష్యం పెరగడంతో చేపల వేట తరిగి ఉపాధికి తీవ్ర కటకట రావడంతో జనంలో సహనం నశించింది. కాలుష్యకారక వ్యర్థ జలాలు సముద్రంలోకి రాకుండా గ్రామస్తులే అడ్డుకట్ట వేశారు. ప్రభుత్వ యంత్రాంగం గతంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తే ప్రజలు సర్కారుకు ఎర్ర తివాచీ పరవకపోయినా వ్యతిరేకించకుండా ఉండేవారు. కానీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోవడమేగాక నిరసనగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై దాడికి పూనుకోవడం ఘోరం. ఊరు ఊరంతటినీ గృహ నిర్బంధంలో ఉంచడం దుర్మార్గం. మహిళలని కూడా చూడకుండా మగ ఖాకీలు వారిపై విరుచుకు పడడం అమానుషం. అభివృద్ధి పేరిట సముద్ర తీరాన్ని ప్రయివేటుకు అప్పగించడం ప్రభుత్వ విధానంగా ఉంది. దేశంలో అతి పొడవైన సముద్ర తీరం మన రాష్ట్రానికే ఉందని గర్వించేవాళ్లం. ఆ 974 కిలోమీటర్లలో రకరకాల పేర్లతో సర్కారు 296 కిలోమీటర్ల తీరం జనానికి లేకుండా చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ట్రైమెక్స్, విశాఖలో పిసిపిఐఆర్, కోస్తా కారిడార్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంపోర్టు ... ఇలా పేరేదైనా సముద్ర తీరం మత్స్యకారులకు కాకుండా పోతోంది. మరోవైపు తీర ప్రాంతమంతటా కాలుష్యకారక రసాయన పరిశ్రమల వల్ల సముద్రంలో చేపలు చచ్చిపోయి వేట కుదించుకుపోతోంది. ఒక్క విశాఖ జిల్లా సముద్రతీరంలో ఉన్నవి 80 గ్రామాలు కాగా వాటిలో ప్రతి గ్రామంలోనూ ఎంతో కొంత భూమి కంపెనీల పరమైపోయింది. తీరంలో 32 చేపలు పట్టే రేవులుండగా ఇప్పుడు కేవలం 18 మిగిలాయి. సముద్రం తప్ప వేరే ఆస్తి, చేపల వేట తప్ప మరో వృత్తి లేని మత్స్యకారులను గంగమ్మ నుంచి దూరం చేస్తుంటే సహించడం, భరించడం వారివల్ల కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బడా కంపెనీల కోసం జపిస్తున్న అభివృద్ధి మంత్రాన్ని ఆపి మత్స్యకారుల ఉపాధిని కాపాడేందుకు చర్యలు చేపట్టాలి. బాధితులకు న్యాయం చేయాలి.