పెట్టుబడిదారీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక సంక్షోభం 2010 సాధారణ ఎన్నికల్లో బ్రిటన్ లేబర్ పార్టీని గద్దె దించితే, శుక్రవారం నాడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడ అధికారంలో ఉన్న టోరీ, లిబరల్ డెమోక్రటిక్ పార్టీలను మట్టి కరిపించాయి. ఇంగ్లండ్, స్కాట్లండ్, వేల్స్ ప్రాంతాలలోని 181 కౌన్సిళ్ల ఎన్నికలలో ప్రతిపక్ష లేబర్ పార్టీ గతంలో ఉన్న వాటి కంటే 32 అదనంగా తెచ్చుకొని 75 కౌన్సిళ్లతో ప్రథమ స్థానంలో నిలవగా, అధికార పార్టీ పన్నెండు పోగొట్టుకొని 42 స్థానాలతో రెండవ స్థానంలో ఉంది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఒక కౌన్సిల్ పోగొట్టుకొని ఆరింటితో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలకు అనుగుణంగానే కౌన్సిళ్లలో సీట్లు కూడా ఉన్నాయి. లండన్ నగర మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి ఊరట పొందిన టోరీ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో దెబ్బతిన్నది. ఇలా అనేక చోట్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఐరోపాలో ఆర్థిక సంక్షోభం, దానిని పరిష్కరించే పేరుతో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ పొదుపు చర్యల పేరుతో జనంపై దాడి చేస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఎక్కడా అధికారపక్షం గెలిచిన దాఖలా లేదు. బ్రిటన్ స్థానిక ఎన్నికలు కూడా అదే ధోరణిని ప్రతిబింబించాయి. గత ఆరు సంవత్సరాలలో నాలుగేళ్లు ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుంచి కోలుకున్నట్లు ప్రకటించినవారు మళ్లీ మాంద్యంలోకి జారిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పూర్వరంగంలో టోరీ సర్కార్ 2014-15 సంవత్సరం నాటికి 81బిలియన్ పౌండ్ల ప్రభుత్వ ఖర్చు తగ్గించాలని ప్రతిపాదించగా ఇప్పటివరకు కేవలం ఆరు శాతమే తగ్గించారు. అయితే బ్రిటన్ మాంద్యం మరింత తీవ్రమైనందున 2016-17 నాటికి ఖర్చు కోత 170 బిలియన్ పౌండ్లకు చేరవచ్చని ఎకనమిక్స్ అండ్ బిజినెస్ పరిశోధనా కేంద్రం హెచ్చరించింది. కేవలం ఆరుశాతం కోతకే జనం టోరీలకు చుక్కలు చూపించారు. జనవరి నెలలో లేబర్ పార్టీ నాయకుడు తాము మరింత కఠినతరమైన ఆర్థిక నిబంధనలు అమలు జరుపుతామని సెలవిచ్చాడు. అయితే ఈ ఎన్నికల్లో అవేమిటో చెప్పేందుకు ధైర్యం చేయలేకపోయాడు. అందుకే పళ్లూడగొట్టుకొనేందుకు లేబర్ అయినా టోరీ అయినా పెద్ద తేడా లేదని భావించిన 70శాతం ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్పుకొనే చోట ఆ వ్యవస్థపై జనానికి విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం వెల్లడిస్తోంది. కొన్ని వార్డులలో ఎనిమిది, పదిశాతం ఓట్లు కూడా పోల్ కాలేదు. ఓటేసిన ఆ స్వల్ప శాతం ఓటర్లు కూడా పాలకపార్టీ, ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాల తీరు తెలియచేస్తోంది. ఒకవైపు పొదుపు పేరుతో ప్రజల నుంచి దూరమౌతున్న టోరీలు, మరోవైపు ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని ఎనిమిది నగరాలలో ప్రజాభిప్రాయసేకరణ జరపగా ఏడుచోట్ల జనం తిరస్కరించారు. అత్యధికంగా 128 కౌన్సిళ్లు ఉన్న ఇంగ్లండ్‌లో టోరీలు అనేక ప్రధాన పట్టణాలలో చావుదెబ్బ తిన్నారు. చివరకు ప్రధాని డేవిడ్ కామెరాన్ సొంత నియోజకవర్గమైన విట్నేలో కూడా ఆయన పార్టీ మట్టి కరిచింది.
గత రెండు సంవత్సరాల కాలంలో పొదుపు చర్యల పేరుతో అన్ని తరగతులపై యుద్ధం ప్రకటించిన టోరీ సర్కార్ ఫలితాల తరువాత కూడా తన చర్యలపట్ల ఎలాంటి విచారం ప్రకటించటం లేదు. మాకు లేబర్ పార్టీ ఖాళీ ఖజానాను అప్పగించిన కష్ట కాలంలో సులభమైన సమాధానాలు దొరకవని మాత్రమే ప్రధాని డేవిడ్ కామెరాన్ తొలి వ్యాఖ్యలు చేశారు. అయితే మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా అంత సంతోషంగా లేదు. ఎందుకంటే మూడు సంవత్సరాల తరువాత జరిగే సాధారణ ఎన్నికల్లో గెలవాలంటే 40శాతంపైగా ఓట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో దానికి 38శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. యూదులపై నోరు పారవేసుకున్న లండన్ లేబర్ పార్టీ నాయకుడు కెన్‌లివింగ్‌స్టన్ వారి ఆగ్రహంతో కేవలం మూడుశాతం ఓట్ల తేడాతో ఓడిపోయాడు. లండన్‌లోని ఒక నియోజకవర్గంలో లేబర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి 21వేల ఓట్లతో గెలిస్తే అక్కడే టోరీ మేయర్ అభ్యర్థికి వచ్చిన మొత్తం మెజారిటీ 62వేలలో ఇక్కడ ఒక్కచోటే 24వేల ఓట్ల మెజారిటీ తెచ్చుకున్నాడు. అవే అతని విజయానికి కీలకంగా మారాయి.
ఐరోపా యూనియన్‌కు బ్రిటన్‌కు దూరంగా ఉండాలని కోరే యునైటెడ్ కింగ్‌డమ్ ఇండిపెండెంట్ పార్టీ 14శాతం ఓట్లు తెచ్చుకుంది. టోరీ, బ్రిటన్ నేషనల్ పార్టీ ఓటర్లు ఈ పార్టీవైపు మొగ్గు చూపటమే దీనికి కారణం. బ్రిటన్ నుంచి స్కాట్లండ్ వేరుపడిపోవాలని కోరే నేషనల్ పార్టీ ఆ ప్రాంతంలో గణనీయంగా ఓట్లు తెచ్చుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలి ఉన్న కారణంగా ఇలా చిన్నా చితకా పార్టీలు కూడా గణనీయంగా ఓట్లు తెచ్చుకొని టోరీ, లిబరల్ పార్టీలను దెబ్బతీశాయి. కౌన్సిల్ సీట్ల పరంగా పెద్ద పార్టీ టోరీ 405 సీట్లు కోల్పోగా చిన్న పార్టీ లిబరల్స్ 336 సీట్లు పోగొట్టుకుంది. దాని చరిత్రలో అతి తక్కువ కౌన్సిలర్ల స్థానాలకు పరిమితమైంది. బ్రిటన్ స్థానిక ఎన్నికలలో లేబర్ పార్టీ గెలిచినంత మాత్రాన ఓటర్లకు ఒరిగేదేమీ లేదు. అధికారంలో ఎవరున్నా పాలకవర్గంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని మాంద్యం ప్రారంభంలో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ నిరూపించింది. ఇప్పటికే పెన్షన్, ఉద్యోగాల కోతలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద యెత్తున ఆందోళన చేశారు. త్వరలో మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఐరోపా సంక్షోభం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో రానున్న రోజుల్లో బ్రిటన్ కార్మికవర్గం మరిన్ని ఆందోళనలు, పోరాటాలకు సిద్ధ్దం కావటం అనివార్యం.