కృష్ణాగోదావరి బేసిన్ (కెజి బేసిన్)లో రిలయన్స్ అక్రమాల పుట్ట పగులుతోంది. ప్రజల ఉమ్మడి సొత్తును సొంతం చేసుకోవడమే లక్ష్యంగా రిలయన్స్ భారీ అక్రమాలకు పాల్పడుతోంది. కార్పొరేట్ సంస్థలకు గులాంగిరీ చేసే పాలకవర్గాల వ్యూహాత్మక మౌనంతో రిలయన్స్ దోపిడీకి పట్టపగ్గాలు లేకుండా పోయింది. కెజిగ్యాస్‌లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని కాగ్ ఇప్పటికే విస్పష్టంగా తేల్చింది. తాజాగా పార్లమెంటరీ సలహాసంఘం సైతం ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కెజి-డి6 చమురుబావిలో ఉత్పత్తిని రిలయన్స్ సంస్థ ఉద్దేశపూర్వకంగానే తక్కువ చేసి చూపుతోందన్న నిర్ధారణను పార్లమెంటరీ సలహాసంఘం చేసింది. ఇక్కడి ఉత్పత్తుల క్రమాన్ని నిశితంగా పరిశీలించాలని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖతో పాటు డైరక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ (డిజిహెచ్)కు సూచించింది. 2009లో ఉత్పత్తి, మార్కెటింగ్ ప్రారంభించిన రిలయన్స్ సంస్థ రెండేళ్ల కాలంలో ఏనాడూ నిర్ణీత లక్ష్యానికి చేరుకోలేదు. బావుల నుండి ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన మొత్తంలో నాలగవవంతు మొత్తం కూడా ఇప్పటివరకు రిలయన్స్ సాధించలేదు. ఏప్రిల్ నెలాఖరులో రిలయన్స్ సంస్థ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారమే కెజి-డి6లో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. మార్చి నెల ప్రారంభంలో 34.09 ఎంఎంఎస్‌సిఎండ ి(మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ ఎ డే) ఉన్న ఉత్పత్తి ఏప్రిల్ మొదటివారానికి 33.89 ఎంఎంఎస్‌సిఎండికి పడిపోయింది. ఈ తాజా లెక్కలతో సంబంధం లేకుండానే కెజి డి-6లో రిలయన్స్ చేస్తున్న సాధారణ ఉత్పత్తినే పార్లమెంటరీ సలహాసంఘం తప్పుపట్టింది. అప్రమత్తం కావాలని సర్కారును హెచ్చరించింది. అత్యున్నత సాంకేతిక విలువలు తమ సొంతం అని చెప్పుకునే రిలయన్స్ సంస్థ ఉత్పత్తి తగ్గడానికి సరైన కారణాలను కూడా చూపడంలేదని వ్యాఖ్యానించింది. ఉత్పత్తిని తగ్గించి చూపడం ద్వారా దేశ ఖజానాకు భారీ మొత్తంలో గండిపెట్టడంతో పాటు, తన ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ పెంచుకోవడం, తద్వారా లాభాల పంట పండించుకోవడం రిలయన్స్ వ్యూహం. దేశవ్యాప్తంగా తీవ్ర విద్యుత్ కొరత నెలకొని ఉన్నా, కెజి గ్యాస్ ఉత్పత్తి క్షేత్రస్థానమైన ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌నివ్వడంలేదు. ఆ కారణంగా ఉత్పత్తి తగ్గడం, గ్యాస్ ధర పెరిగిందన్న సాకుతో ఇంధన సర్దుబాటు సర్‌ఛార్జి పేరిట వేల కోట్ల రూపాయల భారాన్ని సామాన్యప్రజలపై మోపడానికి సర్కారు సిద్ధమైంది. అయినా రిలయన్స్ అధినేతలు సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నారు. దేశ అత్యున్నత ఆడిట్ వ్యవస్థ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) రిలయన్స్ అక్రమాలను కడిగేసినా కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్టే వ్యవహరించింది! పెట్టుబడి వ్యయాలను విపరీతంగా పెంచి చూపడం, గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి వ్యయాలను ఇష్టంవచ్చినట్లుగా పెంచి వేయడం వంటి అక్రమాలకు ఆ సంస్థ పాల్పడిందని కాగ్ నిగ్గు తేల్చినా సర్కారులో స్పందన అంతంతమాత్రమే! కాగ్ నిర్ధారణ ప్రకారం అంచనాల కన్నా 117శాతం ఎక్కువగా పెట్టుబడి వ్యయాన్ని రిలయన్స్ పెంచేసింది. అలా పెంచడానికి దారి తీసిన పరిస్థితులను మాత్రం ఆ సంస్థ వివరించలేకపోయింది. ప్రభుత్వం నుండి నిధుల రికవరీకి వీలైన పనులను ఇతర సంస్థలకు భారీ మొత్తాల్లో కాంట్రాక్టుకు అప్పగించడం ద్వారా పెద్దమొత్తంలో రిలయన్స్ లబ్ధిపొందింది. గ్యాస్ అన్వేషణకోసం కేటాయించిన 7,645 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్నీ ఆ సంస్థ కాంట్రాక్టుకు విరుద్ధంగా తన ఆధీనంలోనే ఉంచుకుంది. నిబంధనల ప్రకారం గ్యాస్ లభించిన ప్రాంతం మినహా మిగిలిన దానిని ఆ మొదటి దశలో 25శాతాన్ని, రెండవ దశలో 50 శాతాన్ని సర్కారుకు అప్పగించాల్సిఉంది. ఈ నిబంధననూ ఆ సంస్థ ఆమలు చేయలేదు. ప్రజల సొత్తుకు పహరా కాయాల్సిన కేంద్ర సర్కారు పట్టించుకోలేదు. నూతన వెలికితీత, లైసెన్సింగ్ పాలసీ (ఎన్‌ఇఎల్‌పి)కి ఇది విరుద్ధమని కాగ్ పేర్కొన్నా సర్కారులో చలనం లేదు. సాధారణ సూత్రం ప్రకారం రాయల్టీలు భారీ మొత్తంలో పొందడం ఉత్పత్తి పెరిగిందనడానికి సూచన! రిలయన్స్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. రాయల్టీలు భారీ మొత్తంలో పొందుతున్న ఆ సంస్థ లాభాల వాటాను మాత్రం అంతే భారీగా తగ్గించి చూపుతోంది. ఈ తరహా వికృత విన్యాసాలే ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపుతున్నారన్న పార్లమెంటరీ సలహాసంఘం తాజా నిర్ధారణకు దారి తీశాయి. వాస్తవానికి కెజి బేసిన్‌లో రిలయన్స్ చేస్తున్న అక్రమాలను సిపిఎం 2006లోనే ఎత్తిచూపింది. సిపిఎం ఎంపీలు చిత్తవ్రత మజుందార్, తపన్‌సేన్‌లు ఆ ఏడాది డిసెంబర్13న రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ తరువాత 2007లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో తపన్‌సేన్ పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రితో పాటు, ప్రధానమంత్రికి ఆరు లేఖలు రాశారు. సహజవాయువు ధరను రిలయన్స్ గోల్డ్‌ప్లేటింగ్ (కృతిమంగా పెంచిచూపడం) చేస్తున్న విధానాన్ని ఆ లేఖల్లో వివరించారు. అయినా, ప్రభుత్వంలో చలనం శూన్యం. సహజవాయువు అడ్డగోలు దోపిడీ వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిద్ధ్దపడాలి. పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించినట్లు ఉత్పత్తుల క్రమాన్ని పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలి. రిలయన్స్ ఆక్రమించి ఉన్న 95శాతం అన్వేషణ ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అక్రమాలకు బాధ్యులైన ప్రతిఒక్కరిపౖెె చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో కేంద్ర పెట్రోలియం శాఖ ప్రమేయంపై విచారణ నిర్వహించాలి.