విద్యుత్‌ భారం ధరలకు ఆజ్యం

ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరానికి విద్యుత్‌ ఛార్జీలను పెంచాలని నాలుగు విద్యుత్‌ పంపిణీ కంపెనీలు సమర్పించిన ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పర్యవసానంగా వచ్చిందే. పంపిణీ కంపెనీలు ప్రతిపాదించిన దానికన్నా దాదాపు 25 శాతం తక్కువగా కమిషన్‌ ఛార్జీల పెంపుదలకు అనుమతించింది. అయిన్పటికీి, ఈ భారాల ప్రభావం ఇప్పటికే విపరీతంగా ఉన్న ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తుంది. 2010-11లో ఎనిమిది మాసాల కాలానికే ఈ పెంపుదల ప్రభావం వేయి కోట్ల రూపాయల మేరకు ఉంటున్నా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని పూర్తి ప్రభావం కొనసాగుతుంది. ప్రధానంగా పరిశ్రమలకు, వాణిజ్య వినియోగదారులకు ఈ ఛార్జీలను పెంచినా, పరోక్షంగా ఈ భారాలన్నీ ధరల పెరుగుదల రూపంలో ప్రజలు భరించేవే.

నాలుగు విద్యుత్‌ పంపిణీ కంపెనీలు రూ.28,366.87 కోట్లుగా తమ వార్షిక ఆదాయ అవసరాలను చూపాయని కమిషన్‌ తుది అంచనా. ఈ రెవెన్యూ అవసరాలను కమిషన్‌ రూ.22,205.24 కోట్లకు తగ్గించింది. ఆ విధంగా పంపిణీ కంపెనీల రెవెన్యూ అవసరాలను, రెవెన్యూ లోటును తగ్గించి, సర్దుబాటు చేసేందుకు మూడు మార్గాలను అవలంబించారు. పంపిణీ కంపెనీలు చూపిన విద్యుత్‌, ఆర్థిక అవసరాల, నిర్వహణ లక్ష్యాల, ఛార్జీలయేతర ఆదాయ అంచనాలను కమిషన్‌ సవరించటం ఒకటి. ఛార్జీల పెంపుదలతో పాటు, కొన్ని మార్పులు చేయటం మరొకటి. ప్రభుత్వం సబ్సిడీ సమకూర్చటం మూడవది. పంపిణీ కంపెనీల ఆదాయ అవసరాలను రూ.6,162 కోట్ల మేరకు కమిషన్‌ తగ్గించాక కూడా, పెంచిన ఛార్జీల అదనపు భారం, ప్రభుత్వం సమకూర్చేందుకు అంగీకరించిన రూ.3644 కోట్ల సబ్సిడీ అదనపు భారాల తీవ్రతను సూచిస్తున్నాయి.

పంపిణీ కంపెనీలు విద్యుత్‌ కొనుగోలు, ప్రసార, పంపిణీతో సహా ఖర్చులను రూ.28,201.38 కోట్లుగా అంచనా చూపాయి.

కమిషన్‌ వాటిని రూ.22,007.85 కోట్లకు తగ్గించింది. 68,591.94 మి.యూ. విద్యుత్‌ విక్రయాలను పంపిణీ కంపెనీలు అంచనాలు చూపగా, కమిషన్‌ వాటిని 65,037 మి.యూ.కు తగ్గించింది. ఆ విధంగా విద్యుత్‌ అవసరాల అంచనాలను కమిషన్‌ తగ్గించింది. రాష్ట్రంలో విద్యుత్‌ అవసరం కమిషన్‌ అంచనా వేసిన దానికన్నా కొంచెం ఎక్కువగా ఉంటున్నదని గత కొన్నేళ్ళ అనుభవం నిర్ధారిస్తున్నది. ఎపిట్రాన్స్‌కో, పంపిణీ కంపెనీలు ప్రసార, పంపిణీ నష్టాలను వాస్తవిక స్థాయిలో తగ్గించలేకపోవటం కూడా ఇందుకు కొంత మేరకు కారణమవుతున్నది. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ప్రసార, పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి పెట్టుబడులపై కూడా విద్యుత్‌ సంస్థల, కమిషన్‌ అంచనాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. ఒక్క సంవత్సరంలోనే రూ.6,162 కోట్ల మేరకు ఈ అంచనాల మధ్య తేడా ఉండటం ఏది సరైనదనేది నిర్ధారణకు రావటానికి ఉన్న ఇబ్బందిని సూచిస్తున్నది. అవి సాధించలేకపోతున్న లక్ష్యాల దృష్ట్యా పంపిణీ కంపెనీల అంచనాలు అతిగా ఉండవవచ్చు. ఛార్జీల పెంపుదలకు ఉన్న పరిమితుల దృష్ట్యా ప్రభుత్వం భరించాల్సిన సబ్సిడీని పరిమితం చేసేందుకు లోపాయికారిగా కమిషన్‌ అంచనాలు అవసరాల కన్నా తక్కువగా ఉండవచ్చు.

ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు, కమిషన్‌ ఇలాంటి అవసరాలపై ఒక ఏకాభిప్రాయానికి రాలేక పోవటం కొన్ని మార్గదర్శక సూత్రాలను వాస్తవికంగా నిర్ణయించుకుని, పాటించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నది. పంపిణీ కంపెనీల అంచనాల, కమిషన్‌ సవరించిన అంచనాల వాస్తవికత ఏమిటనేది తేల్చుకొనేందుకు ఆర్థ్ధిక సంవత్సరాంతానికి తేలే ఫలితాలు ఒక మార్గం. ఏమైనా, ఈ అంచనాల అవాస్త్తవికతలను బట్టి, సంవత్సర కాలంలో వినియోగదారులపై ఇంధన సర్‌ఛార్జి సర్దుబాటు (ఎఫ్‌ఎస్‌ఎ) భారాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఛార్జీల పెంపుదలతో పాటు, పంపిణీ కంపెనీలకు అదనపు ఆదాయం లభించేందుకు కమిషన్‌ కొన్ని మార్పులను చేసింది. హెచ్‌టి-1 పరిశ్రమలకు లోడ్‌ ఫ్యాక్టర్‌ ప్రోత్సాహక పథకాన్ని ఎత్తివేసింది. అదేవిధంగా, హెచ్‌టి పరిశ్రమలకు ఓల్టేజి స్థాయితో నిమిత్తం లేకుండా డిమాండు ఛార్జీలను ఒకే విధంగా నిర్ణయించింది. ఈ రెండు చర్యల వల్ల పంపిణీ కంపెనీలకు రూ.350 కోట్ల మేరకు అదనంగా ఆదాయం లభిస్తుందని అంచనా. విద్యుత్‌ భారాలు ఛార్జీల పెంపుదలకే పరిమితం కావటం లేదు. 2008-09 సంవత్సరానికి రూ.1649 కోట్ల మేరకు ఎఫ్‌ఎస్‌ఎ కింద వ్యవసాయేతర వినియోగదారుల నుండి 12 నెలల కాలంలో వసూలు చేయటం వచ్చే నెల నుండి ప్రారంభం కానున్నది. 2009-10 సంవత్సర ఎఫ్‌ఎస్‌ఎ క్లెయిములపై కమిషన్‌ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

గత సంవత్సరాలకు సంబంధించి ఇంకా మరుగుపడి, పేరుకుపోయిన భారాలు ఉన్నాయని, అవి కమిషన్‌ అనుమతించిన మేరకు వినియోగదారులపై పడతాయని ఇదివరకే వివరించాము. అదనపు విద్యుత్‌ కొనుగోలుకైన వ్యయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల మేరకు పంపిణీ కంపెనీలకు ఇంకా చెల్లించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడిదారీ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఇకముందు కూడా ఈ భారాలు పెరిగే అవకాశాలున్నాయి. విద్యుత్‌ రంగంలో అనవసరంగా పెట్టుబడి వ్యయం, ఇంధనాల వ్యయం, విద్యుత్‌ విక్రయ ఛార్జీలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్న ప్రభుత్వాల తప్పుడు విధానాలను హేతుబద్ధంగా సరిదిద్దకపోతే ఈ భారాల పెరుగుదలను నివారించటం సాధ్యం కాదు. విద్యుత్‌ నియంత్రణా కమిషన్‌కు సంబంధించి తనకున్న అధికార పరిధిలో పాత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలలో జరిగిన తప్పులను సరిదిద్దటం, ఆమోదాలను తెలపటంలో చట్టబద్ధంగా, వివేకవంతంగా నిర్ణయాలను తీసుకోవటం ద్వారా ఈ భారాలను కొంతవరకు తగ్గించటానికి అవకాశముంది. ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు తమ పనితీరును మెరుగుపర్చుకోవటం ద్వారా, వివేకవంతంగా పథకాలను, వ్యయాన్ని నియంత్రించటం ద్వారా పొదుపు చేసేందుకు, ప్రజలపై భారాలు మోపకుండా అదనపు ఆదాయాలను పొందేందుకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్