'మహా' మొండి

నిబంధనలను అతిక్రమించి సుప్రీంకోర్టు, జలసంఘం ఆదేశాలను పెడచివినపెట్టి గోదావరిపై అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ ప్రాజెక్టులను సందర్శించడానికి సైతం మన రాష్ట్ర ప్రజా ప్రతినిధులను అనుమతించకుండా మొండివైఖరి అవలంబిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టిడిపికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు 76 మంది అక్రమ ప్రాజెక్టులను చూడటానికి ఈ నెల 16న యత్నించగా వారిని మహా పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. ప్రాజెక్టులు చూపిస్తామని నమ్మించి పోలీస్‌ వ్యానులెక్కించారు. జేబు దొంగల కంటే హీనంగా ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. కనీస వసతుల్లేని ఐటిఐలో రోజుల తరబడి నిర్బంధించారు. మహిళలున్నప్పటికీ అందరినీ కలిపి ఒకే గదిలో కుక్కారు. బ్రిటిష్‌ పాలనలోని కాలాపాని శిక్షను తలపిస్తోందని నేతలు చెబుతున్నారు. టిడిపి నేతల అరెస్ట్‌లోనే వివాదం దాగుంది. ఆంధ్రప్రదేశ్‌ బోర్డర్‌లో రోడ్డుపై బైఠాయించిన వారిని మహా పోలీసులు అరెస్ట్‌ చేశారంటున్నారు. అదే జరిగితే 'మహా' దాష్టీకానికి హద్దులు చెరిగిపోయినట్టే లెక్క. ఆంధ్ర-మహా సరిహద్దు పాక్‌ సరిహద్దు మాదిరి తయారైంది. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ధర్మాబాద్‌ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

అంతకంటే రెట్టింపు సంఖ్యలో పోలీసులు ఐటిఐ వద్ద కాపలా కాస్తున్నారు. ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు కూడా ఇంతటి బందోబస్తు ఉండదేమో! పొరుగు రాష్ట్రంలోకి పోవాలంటే పాస్‌పోర్టు, వీసా కావాల్సి వచ్చేటట్టుంది. నేతల కుటుంబ సభ్యులను దరిదాపుల్లోకి రానీయట్లేదు. మీడియా ప్రతినిధులు, టిడిపి కార్యకర్తల సంగతి చెప్పనవసరం లేదు. నిరసన కారులపై బోర్డర్‌ దాటొచ్చి మహా పోలీసులు విరుచుకుపడ్డారు. తీవ్రంగా లాఠీఛార్జి చేసి తరిమికొట్టారు. మీడియా ప్రతినిధులను సైతం చితకబాదారు. ఈ చర్యను 'మహా' దౌర్జన్యంగా పరిగణించాల్సి ఉంటుంది.

వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ తీసుకోడానికి నిరాకరించడంతో టిడిపి నేతలకు మెజిస్ట్రేట్‌ తొలుత రెండు రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించారు. రిమాండ్‌ను ఈ నెల 26కు పొడిగించారు. రేపో మాపో ఔరంగాబాద్‌ లేదా నాసిక్‌ జైలుకు తరలిస్తారంటున్నారు. టిడిపి నేతల అరెస్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారంనాటి హర్తాళ్‌ విజయవంతమైంది. హర్తాళ్‌కు వామపక్షాలు సంఘీబావం తెలిపాయి. చంద్రబాబు అరెస్ట్‌ వార్తను తట్టుకోలేక టిడిపి కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్నేళ్ల క్రితమే మహా సర్కార్‌ బాబ్లీ నిర్మాణం చేపట్టింది. అప్పట్లో బాబ్లీపై అసెంబ్లీలో చర్చకొచ్చినప్పుడు తాగునీటి కోసం చిన్న నిర్మాణం జరుగుతుంటే ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని వైఎస్‌ కొట్టిపారేశారు.

తీరా ఎగువన 14 అక్రమ ప్రాజెక్టులను మహారాష్ట్ర చేపట్టాక మన ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాబ్లీని ఆపేయాలన్న సుప్రీం ఆదేశాన్ని మహా సర్కార్‌ అతిక్రమించడంతో కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసింది. ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌కు 1,480 టిఎంసీల గోదావరి జలాలను కేటాయించగా వాడుకుంటున్నది 680 టిఎంసీలు. వైఎస్‌ ఆర్భాటంగా జలయజ్ఞం నినాదం ఎత్తుకున్నా గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులేవీ పూర్తి కాకపోగా కాంట్రాక్టర్ల జేబులు ఫుల్లుగా నిండాయి. శ్రీరాంసాగర్‌ ద్వారా 200 టిఎంసీలను వాడుకునే అవకాశం ఉన్నా 85 టిఎంసీలకు మించి నీరు రావట్లేదు. నీరు రాక ఆయకట్టు బీడు పడింది. రిజర్వాయర్‌ గర్భంలో నిర్మాణమైన బాబ్లీ రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్ద నిల్వ సామర్ధ్యం 2.7 టిఎంసీలే అయినప్పటికీ లిఫ్టుల ద్వారా 20 టిఎంసీలు వాడుకునే వీలుంది. బాబ్లీ సహా 14 ప్రాజెక్టుల వద్ద నిల్వ చేసేది 20 టిఎంసీలేనని మహా సర్కార్‌ వాదిస్తున్నా అంతకంటే మూడు రెట్ల నీరు వాడుకొనే వీలుంది. అదే జరిగితే శ్రీరాంసాగర్‌ ఎండిపోవడం ఖాయం. ఉత్తర తెలంగాణ ఎడారి కాక తప్పదు.

అక్రమ ప్రాజెక్టులపై పలుమార్లు అసెంబ్లీలో చర్చకొచ్చినప్పటికీ దోషులు మీరంటే మీరంటూ టిడిపి, కాంగ్రెస్‌ కీచులాడుకోడానికి పరిమితమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చింది మినహా ప్రజా ప్రయోజనాలు దానికి ఇసుమంతైనా పట్టలేదు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ సోనియా నోరు మెదపట్లేదు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని రాజకీయ పరిష్కారం కనుగొనాల్సి ఉండగా ఆ పని చేయకపోగా సరిహద్దును యుద్ధభూమిగా మార్చింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఒక రాష్ట్ర ప్రజలపై మరో రాష్ట్ర ప్రజల్లో విద్వేషం రెచ్చగొడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రులు, కాంగ్రెస్‌ పెద్దలు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికే చంద్రబాబు బాబ్లీ నాటకం ఆడుతున్నారని చేస్తున్న ఆరోపణలు రోత పుట్టిస్తున్నాయి. చంద్రబాబుది డ్రామా అనుకుంటే కాంగ్రెస్‌ చేస్తున్నదేమిటి? ఢిల్లీ, సోనియా చుట్టూ ప్రదక్షణాలు చేసి తామేదో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నట్టు ఫోజు పెట్టడం లేదా? అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళతామని ఢిల్లీలో సిఎం ఎందుకు ప్రకటన చేశారు?

టిడిపి నేతలను బాబ్లీ వద్దకు అనుమతించాలని రోశయ్య చేసిన విన్నపాన్ని మహా సిఎం తోసిపుచ్చడం దేనికి? సోనియా, ప్రధాని నోరు మెదపకపోవడం వెనుక రాజకీయాలు లేవా? టిడిపిది రాజకీయ డ్రామాగా అభివర్ణిస్తున్న మహా సిఎం తన రాష్ట్రంలో హీరో కావాలనే సరిహద్దులో రణరంగం సృష్టించారంటే ఏం జవాబు చెబుతారు? రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే క్షుద్ర రాజకీయాలు కట్టిపెట్టి కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యం చేసుకొని అక్రమ ప్రాజెక్టులను నిలిపి వేయాలి. అందుకు పరిష్కారం కనుగొనాలి. ప్రాజెక్టుల సందర్శనకు టిడిపి నేతలను అనుమతించాలి. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. రాష్ట్ర సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కేంద్రం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ ప్రదర్శించాలి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్