సినీ ఫక్కీలో దొంగతనం

  • రూ.20 వేల అపహరణ

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి

ఇద్దరు వ్యక్తులు సినీ ఫక్కీలో ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడిన సంఘటన కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడిలో శనివారం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వ్యాపారి ఇంటికి వెళ్లారు. 'మేము మీ వారి వద్ద అప్పు తీసుకున్నాము. ఇచ్చి వెళ్ధామని వచ్చాం' అని అతడి భార్య భవానీతో చెప్పారు. ఈనేపథ్యంలో భవానీ ఆయన ఇంట్లో లేరని చెప్పి లోనికి వెళ్లిపోతుండగా దాహంగా ఉందని చెప్పి మంచినీళ్లడిగారు. దీంతో ఆమె లోనికి వెళ్తుండగా ఆ వ్యక్తులిద్దరూ వెనకే ఇంట్లోకి ప్రవేశించి నోటికి ప్లాస్టర్‌ వేసి, కుర్చీకి కట్టేశారు. బీరువా తాళాలు లాక్కుని రూ.20 వేల నగదు, కొన్ని కీలక పత్రాలను దొంగిలించారు. వెంటనే వారిద్దరిలో ఒకరు డబ్బులతో పరారయ్యారు. కానీ రెండో వ్యక్తి ఇంట్లో ఇంకా ఏమి దొరుకుతాయని వెతుకుతున్న నేపథ్యంలో భవానీ భర్త ఇంటికొచ్చారు. దీంతో ఆ వ్యక్తి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అతడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు మాత్రం ఫైనాన్షియర్‌ పేరు చెప్పలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్