ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
తూర్పు తీరంలో మరో పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. సముద్రంపై తేలియాడే ఈ పవర్ ప్లాంట్ (బార్జి మౌంటైన్ పవర్ ప్లాంట్) గోవానుంచి ఇక్కడికి తరలివస్తోంది. ఇప్పటివరకూ వినియోగంలో ఉన్న ఈ ప్లాంట్‌ను పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరానికి తరలించుకొస్తున్నారు. ప్లాంట్‌ను జెట్టీపై ఉంచి మరో నౌక ద్వారా దాన్ని లాక్కొస్తున్నట్లు సమాచారం. నౌక ఈనెల 15న బయల్దేరింది. ఇక్కడకు చేరటానికి 20 రోజులు పట్టొచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్‌లోనే విద్యుదుత్పత్తి ప్రారంభించనున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
గ్యాస్‌తో వినియోగంతో...
ఇప్పటివరకూ నాఫ్తాతో పనిచేసిన ఈ పవర్ ప్లాంట్ తూర్పు తీరంలో గ్యాస్‌తో పని చేస్తుంది. అవసరమైన గ్యాస్ సరఫరా చేసేందుకు ఒఎన్‌జిసి, గెయిల్ సంస్థలతో ఒప్పందం కుదిరింది. గ్యాస్ వినియోగంవల్ల విద్యుదుత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఇది నాఫ్తా కన్నా పదొంతులు తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జిఎంఆర్ ఆధ్వర్యంలో...
ఈ గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్‌ను జిఎంఆర్ సంస్థ నిర్వహించనుంది. దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం 220 మెగావాట్లు. ప్లాంటు కోసం సుమారు 140 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. సముద్రభాగంలోని 70 ఎకరాల్లో జలాలను పూడ్చారు. సముద్రానికి ఆనుకుని మరో 70 ఎకరాలను కూడా కేటాయించారు. ఈ ప్రాంతంలో ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ నిర్మిస్తారు. ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటులో భాగంగా ఈ పవర్ ప్లాంట్ నిర్మితమవుతోంది. దీని ఏర్పాటుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే చర్చలు జరిగాయి. అప్పట్లో కార్యరూపం దాల్చకపోవడంతో ప్లాంటు వేరే చోటికి తరలిపోతుందనే ప్రచారం జరిగింది. తాజాగా చర్చలు జరిగి, ఒప్పందం కుదిరింది.