ప్రజాశక్తి - రాజోలు
రాజోలు ఎస్‌ఐగా పనిచేస్తున్న ఆర్.గోవిందరాజును సస్పెండ్ చేస్తూ ఎస్‌పి వద్ద నుంచి గురువారం ఉత్తర్వులందాయి. వివరాల్లోకి వెళితే... 2007 మేలో విజయవాడ మాచవరం పోలీసుస్టేషన్‌లో పార్వతీ అనే వివాహితురాలు తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు అక్కడ ఎస్‌ఐగా పనిచేస్తున్న గోవింద్‌రాజు కేసు నమోదు చేశారు. కేసు విచారణ అంటూ ఎస్‌ఐ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ విషయం ఎస్‌ఐ భార్యకు తెలిసింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో ఎస్‌ఐ పార్వతితో తనకు వివాహమైందని చెప్పాడు. ఆవేదనకు గురైన పార్వతి విజయవాడలోని ఒక దినపత్రికలో ఈ కథనాన్ని ప్రచురింపజేసింది. ఈ కథనాన్ని గురువారం కొన్ని టివి ఛానళ్ల వారూ ప్రచారం చేశారు. ఈ కథనంతో రాజోలులో సంచలనం రేపింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌పి ఎస్‌ఐను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.