కళ్యాణ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు లొంగుబాటు

  • రాజమండ్రి పోలీసుల హైడ్రామా

ప్రజాశక్తి - రాజమండ్రి

న్యాయవాది కళ్యాణ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బొక్కా శివకుమార్‌ గురువారం మధ్యాహ్నం రాజమండ్రి ప్రకాష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లో లొంగిపోయాడు. ఫిబ్రవరి 22న రాజమండ్రికి చెందిన న్యాయవాది కళ్యాణ్‌ను మెదక్‌ జిల్లా సిద్ధిపేటకు చెందిన బొక్కా శివకుమార్‌, అతని అనుచరులు కళ్యాణ్‌ను కిడ్నాప్‌ చేసి, అదే రోజు హత్య చేశారు. మారేడుమిల్లి టైగర్‌పార్క్‌ సమీపంలో కళ్యాణ్‌ మృతదేహాన్ని పడేయడం పాఠకులకు విదితమే. కిడ్నాప్‌, హత్యోదంతం కేసులో పోలీసులు ఏడు బృందాలుగా హైదరాబాద్‌, మెదక్‌, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్‌కు అనుచరులుగా వ్యవహరించిన ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు పట్టుకోగలిగారు. వారు ఇచ్చిన సమాచారంతో కళ్యాణ్‌ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్‌ అప్పటి నుంచీ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూనే ఉన్నాడు. అయితే బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన శివకుమార్‌కు బెయిల్‌ మంజూరు కాలేదు. దీంతో గురువారం మధ్యాహ్నం శివకుమార్‌ ఒక్కడే ప్రకాష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కళ్యాణ్‌ హత్య కేసులో నిందితునిగా చెప్పుకుని లొంగిపోయాడు. శివకుమార్‌ పోలీసులకు లొంగిపోతున్నట్లు ముందుగానే నగరంలో ప్రచారం కావడంతో మీడియా ప్రతినిధులు ప్రకాష్‌నగర్‌, త్రీటౌన్‌ స్టేషన్ల పరిధిలో కాపుగాశారు. అయితే శివకుమార్‌ న్యాయవాదుల ప్రమేయం లేకుండా ఒక్కడే వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు మీడియా కంట పడకుండా శివకుమార్‌ను తప్పించేందుకు హైడ్రామా నడిపారు. ప్రకాష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు శివకుమార్‌ లొంగిపోయాడన్న వచ్చిన వార్తలతో మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు మీడియా కంట పడకుండా స్టేషన్‌ వెనుక భాగం నుంచి శివకుమార్‌ను తప్పించి ఆటోలో బయటకు తీసుకెళ్లిపోయారు. ఈవిషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆటో వెంట పడటంతో నగరంలోని పలు మార్గాల ద్వారా తిప్పి తిప్పి ఆఖరికి శివకుమార్‌ను క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్