నిలిచిన చెన్నయ్

  • ధోనీ సేన చేతిలో కొల్‌కతా చిత్తు

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నరు సూపర్‌ కింగ్స్‌ ఫ్లే ఆఫ్‌ ఆశలు నిలుపుకుంది. ధోనీ సేన 17 పాయింట్లతో టాప్‌-4 నిలిచింది. ఈడెన్‌ గార్డెన్‌లో సోమవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ను 5 వికెట్ల తేడాతో చెన్నరు చిత్తు చేసింది. తొలుత కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బదులుగా చెన్నరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులతో విజయ ఢంకా మోగించింది. చివరి ఓవర్‌లో చెన్నరు విజయానికి 9 పరుగులు కావాలి. బాటియా బౌలింగ్‌లో రెండో బంతికి ధోనీ (28) క్లీన్‌ బౌల్డయ్యాడు. 3, 4 బంతులకు జడేజా 3 పరుగులు తీశాడు. 5 బంతికి బ్రావో షాట్‌ మిస్‌ మిస్సయింది. ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. మ్యాచ్‌పై నరాలు తెగే ఉత్కంఠ. బ్రావో లో ఫుల్‌ టాస్‌ బంతిని సిక్సర్‌గా మలిచాడు. అంతే చెన్నరు శిబిరంలో సంబరాలు అంబరానంటాయి. మైక్‌ హస్సీకి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

లక్ష్య ఛేదనలో చెన్నరు ఓపెనర్లు మైక్‌ హస్సీ (56), మురళీ విజరు (36) తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. కానీ మిడిలార్డర్‌లో రైనా (8), డూ ఫ్లెసిస్‌ (13) ఫ్లాప్‌ షో చేశారు. కానీ ధోనీ (28) జట్టును ఆదుకున్నాడు. బ్రావో, జడేజా లాంఛనాన్ని పూర్తి చేశారు.

మొదట టాస్‌ ఓడి కొల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌ గంభీర్‌, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ జట్టుకు శుభారంభం ఇచ్చారు. గంభీర్‌ చెన్నరు బౌలర్లపై ఫోర్లతో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కొల్‌కతా 6 ఓవర్లలో 50 పరుగులు చేసింది. గంభీర్‌ 31 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. కొల్‌కతా 11.5 ఓవర్లలో 100 పరుగులు చేసింది. కానీ గంభీర్‌ (62), మెక్‌కల్లమ్‌ (37) ఔటైన తర్వాత కొల్‌కతా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. శుభారంభాన్ని జట్టు సద్వినియోగం చేసుకోలేదు. కల్లీస్‌ (4), మనోజ్‌ తివారి (12), యూసుఫ్‌పఠాన్‌ (11) స్వల్ప స్లోర్కకే ఔటయ్యారు.