విస్తరణకు దీక్ష బూనాలి

  • వామపక్ష ప్రజాతంత్ర ఐక్యతకు కృషి
  • క్షేత్రస్థాయి కృషి, నిర్మాణం : రాఘవులు
  • ఏకగ్రీవంగా రాజకీయ నిర్మాణ నివేదిక ఆమోదం

వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతను పటిష్టం చేస్తూనే స్వతంత్ర కార్యాచరణతో పార్టీ విస్తరణ, సంఘటితం కావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బివి రాఘవులు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కృషి తద్వారా పార్టీని నిర్మించేందుకు పార్టీ శ్రేణులు దీక్ష బూనాలని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై విశాల వేదిక నిర్మించి కలిసొచ్చే పార్టీలను, ఇతర శక్తులను కలుపుకొని పోరాటాలు చేయాలన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రానున్న కాలం పోరాటాల కాలమని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై కేంద్రీకరించి పని చేయాలన్నారు. పార్టీ విస్తరణకు, సంఘటిత కావడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని, పార్టీకి పదును పెట్టాలని చెప్పారు. మూడు రోజుల చర్చల అనంతరం రాఘవులు ప్రవేశపెట్టిన పార్టీ రాజకీయ నిర్మాణ నివేదికను శనివారం రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నివేదికపై జిల్లాలు, రంగాల వారీగా చర్చలు జరిగాయి. మొత్తం 77 మంది ప్రతినిధులు తమ చర్చల వివరాలను మహాసభ ముందుంచారు. మరో పదహారు మంది ప్రతినిధులు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చర్చల అనంతరం రాఘవులు సమాధానమిచ్చారు. వామపక్ష ప్రజాతంత్ర ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాల వల్ల పలు ప్రాంతాల్లో అప్పటికప్పుడే (స్పాంటేనియస్‌) ఉద్యమాలు ముందుకొస్తున్నాయని, ఆయా జనాలతో మమేకం అవ్వాలని సూచించారు. వివిధ వర్గాలు, తరగతుల ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు విశాల ఐక్య వేదికను నిర్మించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల కోసం పోరాడే క్రమంలో కలిసొచ్చే వారితో ఉద్యమాలు చేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల ఇతర సంఘాలు, వ్యక్తుల్లో పార్టీ ప్రతిష్ట పెరిగిందని చెప్పారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మనపై కక్షగట్టి దాడి చేసిందన్నారు. అప్పుడు కాంగ్రెస్‌ నుండి దాడులు ఎదుర్కొంటే ఆ తర్వాత ప్రాంతీయ ఉద్యమాలతో అననుకూల పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినప్పటికీ అటువంటి దాడులను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకోవడంలో పార్టీ కమిటీలు కృషి చేశాయని అభినందించారు. ఈ కాలంలో అనుసరించిన ఎత్తుగడలు పార్టీని చెక్కుచెదరకుండా నిలబెట్టుకోడానికి ఉపయోగపడ్డాయని ప్రతినిధులందరూ అంగీకరించారన్నారు. పార్టీ విస్తరణ, సంఘటిత పడటమే మన లక్ష్యమని తెలిపారు. ఎన్నికలు పదవులు, అధికారం కోసం కాదన్నారు. ఎన్నికల సర్దుబాట్లను పార్టీ విస్తరణకు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నామా లేదా అన్నదానిపై సమీక్ష చేయాల్సి ఉందన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేయట్లేదని, ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ కేంద్రీకరించి పని చేస్తున్నామని తెలిపారు. ప్రజాసంఘాలను బలోపేతం చేయాలన్నారు. అసంఖ్యాక సంఘాలను ఏర్పాటు చేసి ప్రజలను సమీకరించాలని చెప్పారు. పార్టీ విస్తరించడం, సంఘటితం చేయడంతో పాటు శ్రేణులకు రాజకీయ విద్య అందించి పార్టీకి పదును పెట్టాలన్నారు. ఈ విషయాలపై ప్రతి ఒక్కరూ ఉడుం పట్టు పట్టాలని, మహాసభ వేదికపై దీక్ష బూనాలని రాఘవులు పిలుపునిచ్చారు.