కార్యకర్తల విజ్ఞానం పట్ల ప్రత్యేక శ్రద్ధ

  • రాజకీయంగా కమ్యూనిజాన్ని ఆమోదిం చడం చాలదు. అన్ని విషయాలను ఆవగాహన చేసుకుని, వాటిని ఉద్యమానికి ఉపయోగించే శక్తిపరులుగా కమ్యూనిస్టు కార్యకర్తలు తయారుకావాలి అనేవారు ఆయన ఎల్లప్పుడూ. అందుకే రోజువారీ కార్యకలపాలలో మునిగి తేలే కామ్రేడ్స్‌ గూడా తమ విజ్ఞానాన్ని బహుముఖంగా పెంచుకోవాలని అనే వారు సుందరయ్య గారు.

కామ్రేడ్‌ సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్యకర్తలపట్ల ఆమన శ్రద్ధ అపారం. వారి ఆర్థిక, ఆరోగ్య కుటుంబ పరిస్థితులను గమనించడంలో దయాపూర్వకమైన ఆయన వైఖరి అపూర్వమైనది.

అయితే ఆ కర్యకర్తలను విద్యావంతులను చేసి అభివృద్ధిజేయడంలో ఆయనకు ఒక తపస్వికి వుండే ఏకాగ్రత ఉండేది. అది రాజకీయ పాఠశాలలు నడిపేందుకు రూపొందించే కార్యక్రమాలలో అందరికీ స్పష్టంగా కనబడుతుంది.

కాని ఒక్కొక్క వ్యక్తి పట్ల ఆయన ఎంత శ్రద్ధ చూపి అభివృద్ధి చేస్తారో నాస్వంత అనుభవంలోనే తెలుసుకోగలిగాను.

అవి విద్యార్థులకు రాష్ట్రస్థాయి రాజకీయ పాఠశాలలు నడుపుతున్న రోజులు: కామ్రేడ్‌ సుందరయ్యగారు జాతీయోద్యమం పాఠం రెండురోజులు చెప్పారు. తన క్లాసులకు నన్నూ రమ్మన్నారు.

క్లాసులు అయినాయి. ఆయన చెప్పిన విషయాల గురించి ఆషామాషీిగా అన్నట్లు ఆయన నన్ను ప్రశ్నించడం ప్రారంభించారు. ఒక గంటపైగా చర్చ సాగింది. చివరకు ఇక మీదట క్లాసుల్లో ఆ పాఠం నన్ను చెప్పమన్నారు. అది ఎంత పెద్ద బాధ్యతో నాకు తెలుసు. అందుకే ఇంకా కొన్ని క్లాసులు విని తర్వాత ప్రయత్నిస్తానన్నాను. ''అయితే రేపటి నుంచి రోజూ రెండు గంటలు చెబుతాను. పదిహేనురోజుల్లో రెండుసార్లు పూర్తి అవుతుంది. ఆ తరువాత చెప్పగలవుగదా? అన్నాడు. ఒకసారి ఆయన దృఢంగా ఒక మాటంటే ఇక తిరుగులేదు. ఆయన పట్టుదల అలాంటిది.

ఆ కామ్రేడ్‌కు అంత శ్రమ ఇవ్వడమా? నా మనస్సులో ఏర్పడిన మదన ఆయన గ్రహించారు. ''నాకు ఇబ్బంది అవుతుందనుకుంటున్నావు కదా, కాని ఒక టీచర్‌ను నేను తయారుచేస్తే ఎన్ని క్లాసులకు హాజరయ్యే బాధ్యత నాకు తప్పుతుంది. నేనే పోవాల్సి వస్తే ఎక్కువ క్లాసులే జరుపుతాం. మరికొందరు టీచర్లు తయారైతే తాలూకా, వీలైతే గ్రామ స్థాయి వరకు క్లాసులు పెట్టి త్వరత్వరగా మన కార్యకర్తలను విజ్ఞానవంతులను చేసుకోవచ్చు అన్నారు.

నేనే కొన్ని పుస్తకాలు చదివి సందేహాలు వచ్చినవి తెలుసుకుంటానన్నాను అంగీకరించారు. చదవాల్సిన పుస్తకాలు ఆయనే చెప్పారు. కొన్నాళ్లపాటు ఆ పని మీద కేంద్రకరించమని సలహా ఇచ్చారు.

అలా అధ్యయనం ప్రారంభించిన తరువాత ఆయన ఆ అధ్యయాన్ని నడిపించిన తీరు అమోఘం. అది అనుభవించాల్సిందేగాని వివరించలేము.

ముప్పై గంటలు ఆయన శ్రమపడతారని నేను చదువుతానన్నాగాని ఈ చదువులో ఆ కామ్రేడ్‌ మార్గదర్శకత్వం వంద గంటలు పైగానే దాటింది. నేను తరువాత ఆ పాఠం మొదటి క్లాస్‌ తీసుకునే వరకూ ఎప్పటికప్పుడు నా చదువును ఆయన అజమాయిషీ చేస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో శాఖా కార్యదర్శులకు జరిగిన క్లాసులు నేను మొదట తీసుకున్న క్లాసులు రాష్ట్ర కార్యదర్శివర్గం రూపొందించిన పథకం ప్రకారం టీచర్లు ముందుగా చెప్పబోయే పాఠాలకు నోట్సు రాసి ఉపాధ్యాయులందరూ సమిష్టిగా చర్చించాలి. ఆ సమావేశానికి నేను రాసిన నోట్సులో బాగా వివరించలేకపోయాను. తిరిగి రాయమని కోరారు సుందరయ్యగారు. ఆ విధంగా అప్పుడు జరిగిన నాలుగు క్లాసులకు నాలుగు నోట్సులు రాయించారు. ప్రతినోట్స్‌, ప్రతి అక్షరం చదివి దిద్దేవారు. తాను దిద్దిన తప్పుతో నోట్స్‌ ఉంటే పాఠం చెప్పేటప్పుడు ఏమి ఇబ్బంది వస్తుందో చెప్పేవారు. ఆ విధంగా తయారు చేశారు. పాఠం చెప్పిరాగానే విశేషాలు అడిగేవారు. లోపం ఎక్కడ జరిగిందో చెప్పేవారు.

ఇదంతా ఒక యజ్ఞంలా తయారయింది. ఒకసారి కామ్రేడ్‌ సుందరయ్యగారిని అడిగాను ఆయనకు ఎక్కువ శ్రమ ఇచ్చావని. అప్పుడన్నాడు ఆయన, మరో ఏభై మందిని నీలాగా టీచర్లను తయారుచేస్తే వచ్చే పాతిక సంవత్సరాలకు నేను పార్టీకి రాజకీయ పెట్టుబడిని తయారుచేసినవాణ్ణి అవుతాను. ఎక్కి వస్తున్న యువకులను తయారుచెయ్యాలి అని. అది ఆయన దీక్ష దూరదృష్టి.

నా ఆరోగ్యం దెబ్బతిన్నది. శక్తిపుంజుకునేందుకు మాంసాహారం అవసరం. మా ఇంట్లో అంతా శాఖాహారపు వంటలే చేయగలరు. అది తెలిసిన సుందరయ్యగారు తన ఇంటి నుండి ఆ ఆహారం సరఫరా చేసేవారు. కాని హైద్రాబాద్‌కు మకాం మార్చిన తరువాత ఆ అవకాశం పోయి ంది. మాంసాహారం ఎట్లా చేస్తున్నావని అడిగారు ఒకసారి. తినడానికి వీలు కావడంలేదని చెప్పాను.

''రెడీమేడ్‌ ఫుడ్స్‌ తెచ్చుకుని తిన గూడదా? అన్నారు.

అవి నాకు తెలియవు. ''అలాంటివి ఉంటాయా'' అని అడిగాను.

''మన ప్రజల ఆహారపు అలవాట్లు ఎలా మారుతున్నాయి. కొత్త ఉత్పత్తులు ఏమి వస్తున్నాయి. దేశంలో ఏమేమీ మార్పు లొస్తున్నాయో కూడా తెలీకుండా ఏం కమ్యూనిస్టువయ్యా నువ్వు '' అన్నారు. బాధవేసింది. అది గమనించారు ఆయన ఆ సాయంత్రం వారింట్లో ఎలక్ట్రిసిటీ ఫ్యూజు పోయింది. నేను వేశాను. లైట్లు రాగానే ''ఎలక్ట్రిసిటీ ఫ్యూజ్‌ వేసుకోవడం నాకు తెలీదు. ఆ మేరకు నేనూ కమ్యూనిస్టును కాదు'' అన్నారు. నేనేమీ మాట్టాడలేదు. ఆయనే అన్నారు. ''పొద్దున అన్నమాటకు బాధపడ్డట్టున్నావ్‌. అందరు కమ్యూనిస్టులకు అన్నీ తెలిసి వుండాలనుకోవడం పొరపాటే. కాకుంటే మనవాళ్లకు చాలా విషయాలు తెలిసి వుండాలని నా అభిప్రాయం. అందుకు కృషి చెయ్యాలి'' అన్నారు. వెంటనే ఆధునిక ఫుడ్‌ ఇండిస్టీని గురించి, పోషకాహారల వివరాలు వుండే రెండు పుస్తకాలు ఇచ్చి'' వీలైనప్పుడు చదువు'' అన్నాడు.

ఒకసారి కులాలు, మతాలు, భూమి సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. కులరీత్యానే హరిజనులకు భూమి దక్కకుండా చేసి, కులతత్వం చాటున బానిసత్వాన్ని దాచిపెట్టారని వివరించారు సుందరయ్య గారు. ఒకప్పుడు హరిజనులకు కూడా భూములు వుండినట్లుంది అని ఆయన అన్నారు.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో గ్రోమోర్‌ఫుడ్‌ క్యాంపెయిన్‌ కింద కొందరికి వచ్చాయి. అందుకూ ఈ రాష్ట్రంలో మనపార్టీ కృషే కారణం అని వివరించారు ఆయన.

నెల్లూరుజిల్లాలో భూపోరాట సందర్భంగా మనపార్టీ జిల్లా కమిటి కొన్ని డైగ్లాక్లు పరిశీలించింది. వాటిలో పూర్తిపేరు లేకుండా సుబ్బడు, ఎంకడు, ఎంకిగాడు వంటి పేర్లతో పాత డైగ్లాక్లులో కొందరు పట్టాదార్ల పేర్లు నమోదై వున్నాయి.

అలాగే పల్లెల్లో తిరిగేటప్పుడు కూడా 'బొంగోడి కయ్యా'' ''పొట్టాడి కయ్య'' అని మనుషుల పేర్లతోగాక, శరీర చిహ్నాలతో కొన్ని చేలకు పేర్లు వినపడుతుంటాయి. హరిజనులకు, గిరిజనులకు పేర్లతోగాక వాళ్ల శరీరాలలో వుండే ప్రత్యేకతల దృష్ట్యా పిలవడం నీచమైన భూస్వామ్య సంస్కృతిలో భాగం. అలాగే హరిజనులకు మాత్రమే వుండే కొన్ని ఇండ్ల పేర్లతో వుండే సెల ఏర్లు కూడా మనకు వినపడుతుంటాయి.

ఈ భూములన్నీ ఈనాడు భూస్వాముల అనుభవంలో వున్నా, రీసర్వే జరగని కారణంగా వాడుక కొనసాగుతున్న కారణంగా అవే రికార్డుల్లో, వాడుకులో కొనసాగుతుండడం గమనిస్తాం.

ఈ వివరాలు సుందరయ్యగారికి చెప్పి రెండో ప్రపంచ యు ద్ధానికి పూర్వం కూడా హరి జనులకు భూము లు ఉండేవి ఆ పేందుకు ఇవి ఆధారాలు కూదా అని ప్రశ్నించాను.ఆడైగ్లాటీలు గ్రామా లవి, ఏఏ ఊర్లలో అలాంటి పేర్లు విన్నావు అంటూ ప్రశ్నిస్తూ అనేక వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆ రాత్రికి ఆ సంభాషణ ఆగిపోయింది.ఉదయం ఆయన వద్దకు వెళ్లేసరికి తన లైబ్రరీలలో వుండే జిల్లా గెజిటీర్లు అన్నీ ముందు వేసుకుని చూస్తున్నారు. నేను కనబడగానే 'మా అమ్మ చిన్నప్పుడు మా పొలాలన్నీ చూపిస్తూ వాటికి పేర్లు చెబుతుండేది. రాత్రి అవి గుర్తుచేసుకున్నాను. అందులో నీవు చెప్పినటువంటి పేర్లు వున్నట్లే అనిపిస్తున్నది. ఆ రోజుల్లో వాటికి కొంత ప్రాధాన్యత వుంటుందని అనుకోలేదు. వాటిని పరిశీలించడం అవసరమే'' అన్నారు. ''భూమి సమస్యలో ఏజిల్లాలో ఎప్పుడు ఏ మార్పులు వచ్చాయో ఈ గెజిటీర్లలో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూస్తున్నాను'' అని కూడా అన్నారు. ఒక చిన్న ప్రశ్న, అంతకన్నా చిన్న ఆధారం.. ఆయనలో అంత జిజ్ఞాసను కలిగించడం నాకు ఆవ్చర్యం కలిగించింది.

అందులోనూ మనకున్న అతికొద్ది క్యాడర్‌లో మొత్తం పరిశోధనలకే కొందరికీ కేటాయించగల అవకాశం తక్కువని, తక్షణ సమస్యలకు తోడ్పడే పరిశోధనలకు అధ్యయనాలకే మనం పూను కోలేకుండా వున్నామని అనేకసార్లు ఆయన నాతో అని వున్నారు. అందుకే ఈ సమస్య పరిశీలించడం మనకు వెంటనే ఉపయోగపడుతుందా అని అడిగాను. ఒకప్పుడు వ్యవసాయ కార్మికులు భూములు వుండి, ఆ తర్వాతకాలంలో అయిపోయినాయని, ఆ పోవడానికి కారణాలు చెప్పి ఒప్పించగలిగితే భూపోరాటానికి ప్రచార రీత్యా తోడ్పడుతుంది గదా? అలాగే కులం అడ్డు తొలగించుకుని వారు భూములు ఏ పరిస్థితులలో పొందారో, అందుకు జరిగిన పోరాటాల రూపమేమిటో తెలిస్తే మన పోరాట రూపాలను నిర్ణయించుకునేందుకు కూడా తోడ్పడుతుందిగదా అన్నాను.

ఒక కొత్త విషయం ఎంత చిన్నదైనా దానిని ఉద్యమానికి ఎలా ఉపయోగించుకోవాలనే జిజ్ఞాస. ఇది ఆయన ప్రతిచర్యలో కనిపించే అంశం. ప్రతి కమ్యూనిస్టు అలవర్చుకోవలసిన అంశం అని నా అభిప్రాయం. రాజకీయంగా కమ్యూనిజాన్ని ఆమోదించడం చాలదు. అన్ని విషయాలను ఆవగాహన చేసుకుని, వాటిని ఉద్యమానికి ఉపయోగించే శక్తిపరులుగా కమ్యూనిస్టు కార్యకర్తలు తయారుకావాలి అనేవారు ఆయన ఎల్లప్పుడూ.అందుకే రోజువారీ కార్యకలపాలలో మునిగి తేలే కామ్రేడ్స్‌ గూడా తమ విజ్ఞానాన్ని బహుముఖంగా పెంచుకోవాలని అనే వారు సుందరయ్యగారు. నెల్లూరుజిల్లాలో పనిచేస్తున్న రోజుల్లో అది నాకు సాధ్యం కావడంలేదు అని అన్నానొకసారి. ఆ మాటకే కోపం వచ్చింది ఆయనకు 'ఎందుకు కాదు. వారంలో ఒకరోజు నేను పని చెయ్యనని చెప్పు. ఆ ఒక్కరోజూ చదువుకు కేటాయించు'' అని గద్దించి చెప్పారు.కమ్యూనిస్టులు నిరంతరం విజ్ఞానులు కావడానికి శతవిధాలా ప్రయత్నిచాలని ఆయన వాదించేవారు. తాను అందుకు కృషి చేసేవారు. అదేవిధంగా ఇతర కామ్రేడ్స్‌ను ప్రోత్సహించేవారు.ఇందుకు అనేక నిదర్శనాలుఉన్నాయి. ఆయనతో నాకున్న కొద్ది సాన్నిహిత్యంలో నేను గ్రహించిన విషయాలివి. సుందరయ్య బుహుముఖ కార్యకలాపాల నుండి మనం నేర్చుకోవలసిన అంశాలలో ఇది ప్రాముఖ్యత గల విషయమని అనుకుంటున్నాను.

వి శ్రీహరి

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్