కెప్టెనంటే...

కెప్టెన్‌ కావాలని కలలు కనే వారెందరో. ముఖ్యంగా క్రికెట్‌లాంటి విశేష ప్రజాదరణ పొందిన ఆటలో ఈకలలు హెచ్చుపాళ్లలో ఉంటాయి. కలలు సాకారమైన ప్రతి కెప్టెనూ రాణించడం జరిగే పని కాదు. జట్టులోని ఆటగాళ్ల వ్యక్తి బలాబలాలను బేరీజు వేసుకోవడం అవసరానికి తగిన విధంగా ఆయా ఆటగాళ్ల నుంచి ఫలితాలను రాబట్టడం వెరసి జట్టుకు విజయాలు సాధించి పెట్టడం-ఇదీ కెప్టెన్‌ బాధ్యతలు ఒక్క మాటలో ఏ పరిస్థితుల్లోనైనా రాణించే వాడే నిజమైన కెప్టెన్‌. విజయాల్లోనే జట్టు పరాజయాలకూ బాధ్యత వహించే తత్వమే కెప్టెన్‌ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.

భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవరించిన వారిలో అత్యుత్తమ కెప్టెన్‌ ఎవరనే ప్రశ్నపై నిరంతర చర్చ జరుగుతూనే ఉంది. 1983లో వరల్డ్‌కప్‌ గెలిచినపుడు కపిల్‌దేవ్‌ పేరు తరువాత 2011 వరల్డ్‌కప్‌ గెలిచినపుడు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ పేరు చర్చల్లో నిలిచింది. ఒక్కో మారు ఒక్కో పేరు తెర మీదకు రావడం జట్టు ఓటమి పాలయినపుడు తెరమరుగు కావడం అనుభవంలో నిలిచే విషయం. ఈక్రమంలో భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్‌ కాకపోయినా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరుగా గుర్తింపు పొందిన ఆటగాడు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ. మైదానం లోపల-వెలుపల, డ్రెసింగు రూంలోనూ, మీడియా ఎదుటా ఎక్కడైనా కావచ్చు.. జట్టు పక్షాన నిలిచిన కెప్టెన్‌గానూ గంగూలీకి పేరుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగిన తరువాత ఇపుడు జరిగే ఐపిఎల్‌-5 లో పుణె వారియర్స్‌ జట్టు కెప్టెన్‌గా గంగూలీ తిరిగి ప్రత్యక్షమై నాడు. మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ నిఖంజ్‌ సారథ్యంలో 1983లో భారత జట్టు వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. కపిల్‌ తరువాత చాన్నాళ్లకు బ్యాట్సమన్‌గా ప్రవేశించిన గంగూలీ జట్టుకు కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌ ప్రతిష్టను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు మసకబారుస్తున్న 2000 సంవత్సరం నాటి రోజులవి. జట్టు ప్రదర్శనలో దిగువ స్థాయిలో ఉంది. అలాంటి సమయంలో స్టీవ్‌ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా టీం తన గెలుపు పరంపరను కొనసాగించడానికి భారత గడ్డ మీద కాలు పెట్టింది. అలా కాలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టుకు భారత క్రికెట్‌ పదునును రుచి చూపిన ఘనత నిస్సందేహంగా గంగూలీదే. ఆస్ట్రేలియా విజయాలను అడ్డుకోవడమే కాదు దిగజారిన ప్రమాణాలను సమున్నతంగా తీర్చిదిద్దాడు. ఆనాటి సిరీస్‌ విధ్వంసకారునిగా పలువురి ప్రశంసలు అందుకున్న ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌లో దాగున్న ప్రతిభను గుర్తించింది గంగూలీయే. వికెట్లు తీయలేక, పరుగులు ఆపలేక ఇక పనై పోయిందనే బాధాకర విమర్శలను హర్భజన్‌ నిత్యం వింటున్న రోజులవి, ఒక రకంగా కెరీర్‌ ముగిసిపోయిందా అనే సమయంలో గంగూలీ కల్పించిన ఎంపిక అవకాశం జట్టు ముఖచిత్రాన్ని ఎలా తిప్పిందీ గుర్తు తెచ్చుకోవచ్చు. అదే టూర్‌కు ముందు అవస్థలు పడుతున్న మరో ఆటగాడు వివిఎస్‌ లక్ష్మణ్‌. జట్టులోకి తీసుకుంటారా అనే అనుమానాలు వెన్నాడిన స్థితి లక్ష్మణ్‌ది. కానీ గంగూలీ ఎంపిక నిర్ణయాన్ని లక్ష్మణ్‌ సరైనదేనని నిరూపించాడు. నాడు ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో లక్ష్మణ్‌ సాధించిన చరిత్రాత్మక 281 పరుగుల ఇన్నింగ్స్‌ని మరిచిపోగలమా? మూడో స్థానంలో ఎవరిని దింపాలనేది సహజ సమస్యగా నిలిచిన సందర్భమది. క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బందులు పడే డిపెండబుల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఆస్థానంలో ఆడుతున్నాడు. అంతే ద్రావిడ్‌ స్థానంలో లక్ష్మణ్‌ను దింపడంతో జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. జట్టు, జట్టులోని ఆటగాళ్ల ప్రతిభ సమయానుకూలంగా ఉపయోగించుకోవడ మెలాగో తెలియబట్టే గంగూలీ ఉత్తమ కెప్టెన్‌ అనిపించుకున్నాడు. తరువాత వచ్చిన యువరాజ్‌ సింగ్‌, వీరేంద్రసెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లేలకు జట్టులో సముచిత స్థానం దక్కడానికి గంగూలీయే కారణం. ఈ ఆటగాళ్లలో భద్రత భావానికి ఊపిరి పోసి వారితోనే అద్భుతాలు చూపిన వాడు గంగూలీ.

స్వీయ అనుభవాలనే కాబోలు 'నాయకత్వ కళ (ది ఆర్ట్‌ ఆఫ్‌ కెప్టెన్సీ) పేరిట గంగూలీ గ్రంధస్తం చేశాడు. జట్టు రూపుదిద్దుకున్న క్రమంలోనే అందులోని ఆటగాళ్ల ప్రతిభను గుర్తించడం కెప్టెన్‌కు అవసరమని అందులో గంగూలీ పేర్కొన్నాడు. అత్యుత్తమ ఫలితాలు సాధించాలంటే ప్రతి ఆటగాడు తనలోని ప్రతిభకు ప్రేరణ కల్పించడం తద్వారా వారి మీద వారికి నమ్మకాన్ని బలీయం చేయడం ముఖ్యమని విశ్లేషించాడు. మైదానం లోపల-వెలుపల చేసిందే గంగూలీ తన పుస్తకంలో అక్షరబద్ధం చేశాడు.

అన్ని వేళలా ముందుండి జట్టును నడిపించడమే కెప్టెన్‌ పని. కర్రపెత్తనం చేసే భూస్వామ్య యజమాని తనం కూడదని స్పష్టం చేశాడు. ఆటగానిగా అద్భుతాలు సాధించలేకపోవచ్చు కాని జట్టు అద్భుతాల వెనుక మాత్రం గంగూలీ ఉన్నాడు. తనను మించి పోతారేమోననే సంకుచిత భావనను తుడిపేసి ఆయా ఆటగాళ్ల ప్రతిభకు పదును పెట్టడం వారి కెరీర్‌ ఉన్నతీకరణకు గంగూలీ బాగా అండదండగా నిలిచాడు. బాధ్యతాయుతంగా ఆడటం నేర్పాడు. సమిష్టితత్వాన్ని నూరిపోశాడు. విధాన నిర్ణయాల్లో సీనియరు- జూనియరు అంతరాన్ని తొలగించిన కెప్టెన్‌ బహుశ గంగూలీనేమో! కష్టాల్లో చేయూతనందించ కుండా తన జట్టులోని ఏ ఒక్క ఆటగాడి విశ్వాసానికి కెప్టెన్‌ పాత్రుడు కాలేడని చాటాడు.

ఐపిఎల్‌-5లో తన కెప్టెన్సీలోని పుణె వారియర్స్‌ జట్టులోకి వెస్టెండీస్‌ ఆటగాడు మార్లోన్‌ శామ్యూల్స్‌ను ఎంపిక చేసుకున్న తీరు తాజా ఉదాహరణ. మ్యాచ్‌ గెలుపు ద్వారా గంగూలీ నమ్మకాన్ని శామ్యూల్‌ రుజువు చేశాడు. అంతేనా జెస్సీ రైడర్‌, స్టీవ్‌ స్మిత్‌, అశోక్‌ దిందా, వయసు మీద పడిన చేవ చావని ఆశిష్‌నెహ్రాల ఎంపికలోనూ గంగూలీ సాహసాన్ని గుర్తించగలుగుతాము.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్