టైటిల్ చూడగానే ఆ చిత్రం తాలూకు రంగు తెలిసిపోతుంది. సినిమా చూస్తున్నా.. ఇదేదో కొత్తగా ఉందే అనిపించేలా ఉండాలి. మరో కథ బుర్రలోకి రాకూడదు. వచ్చిందీ అంటే అందులో ఏదో తేడా ఉన్నట్లే. థ్రిల్లర్ సినిమా అయితే థ్రిల్ కల్గించేదిగా ఉండాలే కానీ గిలిగింతలు పెట్టించకూడదు.
ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రం అలాంటి ఫీలింగే కలిగిస్తుంది. తీసింది మంచు కుటుంబమే అయినా అందులో నందమూరి బాలకృష్ణ నటించడంతో
ఓ క్రేజ్ ఏర్పడింది. చాలా హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే తన అభిమానుల్ని బాలయ్య తృప్తి పరిచాడనే చెప్పాలి. ప్లాష్‌బ్యాక్ స్టోరీని పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్ది, మిగతా సంగతంతా దర్శకుడు మరిచిపోయాడని అనిపిస్తుంది. ఆ సంగతులేంటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
నాలుగు దశాబ్దాలకు చెందిన రత్నగిరి సంస్థానం ఆస్తి గంధర్వమహల్. ఇందులోకి మనోజ్ కిరాయికి వస్తాడు. అప్పట్లో ఒక వెలుగువెలిగిన ఆ మహల్‌ను ఇప్పుడు అద్దె కిస్తూ వారసుడైన రాయుడు (ప్రభు) జీవితాన్ని వెళ్ళదీస్తుంటాడు. పెద్దకుమార్తె మధుమిత పెండ్లికిగాను వియ్యంకుడికి గంధర్వమహల్ రాసిస్తాడు రాయుడు. ఇది నచ్చని మనోజ్ అడ్డుకుంటాడు. పైగా మహల్‌ను తీసుకుంటే 1813నాటి రుద్రమనేని వంశానికి చెందిన నరసింహనాయుడు (బాలకృష్ణ) ఆత్మవచ్చి పీడిస్తుందని నమ్మిస్తాడు. మరోవైపు రాయుడు రెండో కుమార్తె జగతి (దీక్షాసేథ్)ని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. ఇంకోవైపు ఓ ముదుసలి ఆ మహల్‌చుట్టూ తిరుగుతుంది? అసలు ఈమె ఎవరు? ఆత్మ పీడిస్తుందని మనోజ్ ఎందుకు చెప్పాడు? తను ప్రేమించిన అమ్మాయి ప్రేమను పొందాడా? అన్నది తెరపై చూసుకోవాల్సిందే.
ఓ మహల్.. అక్కడ తీరనికోరికతో సమాధి చేయబడ్డ వ్యక్తి. ఏదోవిధంగా బయటికి వచ్చి కోరిక కోసం రగిలిపోయే సన్నివేశాలు...'అరుంధతీ' చిత్రమైతే, పాడుపడిన భవంతి. అందులో దెయ్యం ఉందని తెలుసుకుని యజమానిని కాపాడడం కోసం డాక్టర్‌గా వచ్చిన స్నేహితుడు. ఆ దెయ్యం యజమానురాలిపై ఆవహిస్తే.. భూత వైద్యుని సాయంతో వైద్యుడు చేసిన పోరాటం....ఇదంతా 'చంద్రముఖి'. ఈ రెండు చిత్రాలను కలిపి అటూ ఇటూ కథను మారిస్తే 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. అసలు ఇటువంటి కథను నిర్మాతలు తీసుకోవడమే ఉలిక్కిపడే విషయం. కథా గమనంలో ఏ సన్నివేశంలోనూ పట్టు లేదు. మనసును కదిలించలేవు. చెల్లెలి బాగు కోసం ఆస్తిని త్యాగం చేయడం వంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ ఇమిడిపోయాడు. రాజదర్బం, హంగు, ఆర్భాటాలతో తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన పాత్ర వల్లే సినిమాకు ప్రయోజనం చేకూరిందనే చెప్పాలి. ఆహార్యం, హావభావాలు చూడతగినవిగా ఉన్నాయి. ఇంతటి హుందా పాత్రకు, ఇప్పటి ట్రెండ్‌కు తగిన యువకుడిగా మంచు మనోజ్ తరహా పూర్తి విరుద్ధమైంది. తాను చేసిందే కరెక్ట్ అనుకొనే ఇందులో పలు గెటప్స్‌లో అలరించే ప్రయత్నం చేశాడు. పరిచయంతోనే తన పాత్రేమిటో చెప్పేస్తాడు. సైకోగా నటించాడు. మితిమీరిన ప్రవర్తన వల్ల కొన్నిచోట్ల విసుగూ పుట్టిస్తాడు. తన పాత్ర విషయంలో ఇంకా నేర్చుకోవాల్సింది, గెటప్స్‌లో ఏవి సరిపోతాయో తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
నిర్మాతగా మంచు లక్ష్మీప్రసన్న గంధర్వమహల్‌లోకి ప్రవేశం, పతాక సన్నివేశాల్లో చూపిన అభినయం బాగుంది. కథలో కీలకమైన మలుపు తగ్గ హైపు లక్ష్మీప్రసన్న బాగా సరిపోయింది. ముసలిదానిలా రక్తికట్టించింది. సోనూసూద్ ఆత్మ ఆమెలో ప్రవేశించినప్పుడు ఆమె పలికించే హావభావాలు ఆకట్టుకున్నాయి. మహల్‌ను కట్నంగా తీసుకుని దాన్ని అమ్మేద్దామనుకునే నెగెటివ్ పాత్రలో సాయికుమార్ నటించాడు. భూత వైద్యునిగా అజరు సరిపోయాడు. మిగతావన్నీ సాదాసీదా పాత్రలే.
సంభాషణల్లో పెద్ద పసలేదు. నేపథ్య సంగీతం, సంగీతం ఇద్దరు ఇచ్చినా థ్రిల్లర్ చిత్రాల్లో ఫీల్ కన్పించదు. కళానైపుణ్యం చిత్రానికి ఆకర్షణ. ఫొటోగ్రఫీ పర్వాలేదు. కథ పాత చిత్రాల్ని కలిపి రాసుకున్నారా, కొత్తదనం చూపించారా? అన్నది పక్కనపెడితే. సినిమాకు సరిపోయే కథ ఉంది. కానీ దాన్ని స్క్రీన్‌ప్లేలో ఆసక్తిగా చూపించాలంటే అనుభవం కూడా ఉండాలి. ఆ లోపంతో మొదటి భాగమంతా చికాకుగా ఉంటుంది. కథను చెప్పడంలోనే గందరగోళ పడటంతో చివరివరకు చూసే ఓపికకూడా ప్రేక్షకుడికి నశిస్తుంది. ఆ సమయంలో బాలకృష్ణ పాత్రకూడా కన్పించకపోతే కునికిపాటు వచ్చేదే. అందుకే మొదటిభాగం చివర్లో కన్పించేట్టుగా దర్శకుడు జాగ్రత్త తీసుకున్నాడు. దానికితోడు ఇంటర్వెల్ ట్విస్ట్ పేలవంగా ఉంది. ఉలిక్కిపాటు లేక ఊ కొట్టలేక...ప్రేక్షకుడు థియేటర్ తలుపు వైపు చూస్తుంటాడు. చివరివరకూ ఎలాంటి ట్విస్ట్‌లూ లేకుండానే సినిమా పూర్తవుతుంది. - పి.మురళి