ఎటో వెళ్లిపోయింది మనసు

చిన్ననాటి స్నేహం ఎంతో మధురమైంది. వయసుతోపాటు ఇద్దరి వ్యక్తుల మధ్య ఆ స్నేహం ఎలాంటి ఆటుపోట్లకు గురైంది, మార్పులకు లోనైంది..అన్న పాయింట్‌తో వస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత హీరోహీరోయిన్లు. సి.కళ్యాణ్‌ నిర్మాత కాగా, అలనాటి నటి చంద్రకళ కుమార్తె రేష్మ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...'12 ఏళ్ళ తర్వాత గౌతమ్‌మీనన్‌తో సినిమా చేస్తున్నా. నాలుగు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయింది. చిత్రానికి సంబంధించి సంగీతం అంతా లండన్‌లోనే ఇళయరాజా చేశారు. ప్రత్యేకమైన శ్రద్ధతో కొత్త తరహాలో ఉండాలని ఆయన చేసిన తీరు అభినందనీయం. నాని, సమంత అద్భుతంగా నటించారు. 'చందమామ' సినిమాతో మంచి నిర్మాతగా పేరొచ్చింది. దాన్ని మించిన చిత్రమవుతుందనే నమ్మకముంది. ఈనెలాఖరులో ఆడియోను, జూన్‌లో సినిమాను విడుదల చేయనున్నా'మని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ...'తెలుగులో నాకిది మూడవ సినిమా. ఘర్షణ తర్వాత గ్యాప్‌ తీసుకుని ఏ మాయచేసావె చేశాను. ఇప్పుడు కళ్యాణ్‌తో చేశాను. నాని, సమంత మంచి నటీనటులు. సంగీతంలో కొత్తదనం ఉండాలని లండన్‌లో నిర్వహించా'మని తెలిపారు.

నాని మాట్లాడుతూ...'చిన్నతనం నుంచే ఇళయారాజ సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఆయన సంగీత సారథ్యంలో ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా స్పూర్తిపొందిన దర్శకుల్లో గౌతమ్‌మీనన్‌ ఒకరు. ఆయన దర్శకత్వంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆడియో రిలీజ్‌ కోసం నేను ఎంతగానో ఆతృతగా ఉన్నాను. త్వరలో సినిమా కూడా విడుదల కానుంది' అని తెలిపారు. 'ఈ చిత్రం నాకు పర్సనల్‌ మూవీ. గౌతమ్‌గారి దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది' అని తెలిపారు.

ఇంకా కృష్ణుడు, విద్యు, అనుపమ, శ్వేత తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్‌, కెమెరా: ఎం.ఎస్‌.ప్రభు, ఓంప్రకాష్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌.

Publiture