ఎన్.టి.ఆర్. కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 'బాద్‌షా' చిత్రం ఆదివారంనాడు లాంఛనంగా ప్రారంభమైంది. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో జరిగిన పూజకార్యక్రమాలకు సినీరంగప్రముఖులు హాజరయ్యారు. డా|| డి. రామానాయుడు స్క్రిప్ట్‌ను దర్శకునికి అందజేశారు. కథానాయకుడు రామ్‌చరణ్ తేజ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. వెంకటేష్ కెమేరా స్విచ్చాన్ చేశారు.
చిత్రం గురించి శ్రీనువైట్ల వివరిస్తూ... 'దూకుడు' తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఎన్.టి.ఆర్.ను దృష్టిలో ఉంచుకుని నా స్టైల్‌లో ఉండే కథాంశమిది. స్క్రిప్ట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పాలు ఎక్కువ. కోన వెంకట్ చక్కటి సంభాషణలు రాశాడు. ఏప్రిల్ 20 నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. మొదట విదేశాల్లో షూటింగ్ ఉంటుంది. తమన్ ఒక ట్యూన్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఆండ్రూ కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్‌తోకూడిన ప్రేమకథా చిత్రం అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ఎంతోమంది సినిమా తీయమని అడుగుతున్నా... మా బేనర్‌లో సినిమా తీయడానికి శ్రీనువైట్ల అంగీకరించారు. దూకుడుకంటే పెద్ద హిట్ మా బేనర్‌లో ఇవ్వాలని ఆశ. గోపీమోహన్, కోనవెంకట్ చక్కటి కథను సమకూర్చారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.