ప్రభుత్వ విధానాల వల్లే ధరల పెరుగుదల

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఉద్ఘాటించారు. ధరలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ, టిడిపిలు సంయుక్తంగా శనివారం ఆందోళనలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ వర్కుషాపుకు ముఖ్య అతిథిగా ఆయన తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ధరలను నియంత్రించే విధంగా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల్లో కేటాయింపులు లేవన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు, బడా వ్యాపారులకు 25వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేలా బడ్జెట్‌ ఉందని చెప్పారు. వ్యవసాయ రంగం బాధ్యతల నుంచి తప్పుకునేలా సబ్సిడీల్లో కోత పెడుతోందన్నారు. అందులో భాగంగానే బడ్జెట్‌కు ముందు ఎరువుల ధరలు పెంచిందని చెప్పారు. ధరలు ఇంతటితో ఆగవని, ఎరువుల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 7, 8 తేదీల్లో అఖిల భారత స్థాయిలో ఢిల్లీలో వామపక్షాలు, లౌకిక పార్టీలను కలుపుకుని సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రధాన అజెండా ధరలపైనే ఉంటుందని చెప్పారు. 12న ధరలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో చలో పార్లమెంట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీలోనూ ప్రధానంగా ధరలపైన ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. వ్యాట్‌ వల్ల ధరలు మరింత పెరిగాయన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థంగా ఉందన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యానికి ఈ బడ్జెట్‌లో 500 కోట్లు కోత పెట్టిందని తెలిపారు. విద్యుత్‌ సబ్సిడీని 1500 కోట్లు కోత విధించిందన్నారు. గత బడ్జెట్‌ ఆరువేల కోట్లు ఉండగా, ఈ ఏడాది 4,500 కోట్లు కేటాయించారని చెప్పారు. టిటిడి కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు, వాయిద్య కళాకారులు, అటవీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టిటిడి యాజమాన్యం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. తిరుపతిలో పాలకమండలి జరిపితే సమస్యలను ఎక్కడ పరిష్కరించాలోనని భయపడి కన్యాకుమారికి మార్చుకోవడం కార్మికుల పట్ల నిర్లక్ష్యవైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఎట్టకేలకు స్పందించి పాలకమండలి కమిటీ వేసిందని, చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు కందారపు మురళి, నగర కార్యదర్శి వి.నాగరాజు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్