కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం


  • లాఠీఛార్జి...ఇద్దరిపై కేసులు
  • నేడు జిల్లా బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు

సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించమన్నందుకు బూటుకాళ్లతో తన్నారు... మంచి భోజనం పెట్టాలని డిమాండ్‌ చేసినందుకు లాఠీఛార్జీ బహుమానంగా ఇచ్చారు... తొమ్మిదిరోజుల పాటు క్షేత్రస్థాయిలో హాస్టళ్ల సమస్యలను పరిశీలించన అనంతరం అధికారులకు నివేదించేందుకు వచ్చిన విద్యార్థులకు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలకు కలెక్టరేట్‌ ఎదుట ఈ సత్కారం జరిగింది..పెనుగులాట.. తొక్కిసలాట.. నినాదాలు.. హాహాకారాలు.. రక్తగాయాలు.. తెగిన చెప్పులతో కలెక్టర్‌ కార్యాలయ ఆవరణ రణరంగాన్ని తలపింపజేసింది. బూటు కాళ్లతో తొక్కి.. డొక్కల్లో కుమ్మి.. చేతులు, కాళ్లు విరిగే విధంగా తోసేసి.. పైకి మాత్రం ఏమీ లేనట్లుగా పోలీసులు అరాచకం చేశారు. బలవంతంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అదుపులోకి తీసుకుని జీపులో వేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇద్దరు నేతలపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపించారు. పోలీసుల పైశాచికత్వానికి నిరసనగా శుక్రవారం జిల్లాలోని విద్యాసంస్థల బందుకు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.

తొమ్మిది రోజుల పాటు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో సైకిల్‌ యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయేందుకు ఆఖరు రోజు గురువారం కలెక్టరేటును విద్యార్థులు దిగ్బంధించారు. ఇందులో భాగంగా ఆ కలెక్టరేటు ఆవరణలో శాంతియుతంగా నిరసన తెలిపారు. కలెక్టరొచ్చి తమ సమస్యలు వినాలని ప్రాధేయపడ్డారు. అధికారుల నుంచి స్పందన రాలేదు. తమకు న్యాయం కావాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ఉపక్రమించారు. వీరి చర్యను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికిపోవాలని విద్యార్థులు, వారి చర్యను అడ్డుకుంటూ పోలీసుల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఇంతలో డిఆర్‌ఓ యాదగిరి అక్కడకొచ్చారు. సమస్యలు విన్నవించేందుకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమాధికారులు రావాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టారు. దీంతో డిఆర్‌ఓ అక్కడినుండి వెనుదిరగాల్సి వచ్చింది. విద్యార్థుల కోరికను నెరవేర్చలేక వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు పూనుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. అరెస్టుకు సహకరించని విద్యార్థులను ఒక్కొక్కరిని డొక్కల్లో కుమ్ముకుంటూ, బూటుకాళ్లతో తన్నుకుంటూ ఒక్క కుదుపుతో ఈడ్చుకుంటూ ఎత్తుకెళ్లి జీపుల్లో కుక్కారు. ఇలా అరెస్టు చేసి తీసుకెళుతున్న జీపులను మిగిలిన విద్యార్థులు వెంబడించారు. వేలూరు జాతీయరహదారిలో ఈ జీపులను అడ్డుకున్నారు. దీంతో వాహనాల్లోనుంచి విద్యార్థులు కిందికి దూకేసి రోడ్డుపైనే పడుకున్నారు. పోలీసులు కలెక్టరేటు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపైన పడుకున్న వారిపై తమ క్రౌర్యాన్ని చూపించారు. తీవ్రంగా పెనుగులాడుతున్నా వదలకుండా వారిని బలవంతంగా జీపులో ఎక్కించారు. పలువురు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఇందులో భాస్కర్‌, రోశయ్య అనే ఇద్దరు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై 127, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన కేసులు నమోదుచేశారు. పోలీసుల తీరుకు నిరసనగా శుక్రవారం జిల్లా బంద్‌కు ఆ సంఘం జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకత్వం నాగేశ్వర్‌రావు, ఉత్తన్న, పూర్ణచంద్ర, మహేష్‌, రోశయ్య, హైమావతి, భాస్కర్‌నాయక్‌ ,కిరణ్‌, వేణు, దాము, విజయశంకర్‌ పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్