పరీక్షలకు అనుసరణీయ సలహాలు-3

  • మీ కోసం...!

ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటి నుంచే మీపై కన్నేశాయి. వీటి పి.ఆర్‌.ఒ.లు 'ఇప్పుడే చేరితే భారీ డిస్కౌంట్‌లు ఇస్తామ'ని, పరీక్షలయ్యాక అయితే మీరు అందుకోలేరని ఇంటికొచ్చి మరీ మీ తల్లిదండ్రులను బెదిరిస్తూ, బతిమాలుతూ ఉంటారు. వీరి ప్రలోభాలకు లొంగి, మీ ఏకాగ్రతను దెబ్బతీసుకోకండి. పరీక్షా ఫలితాలు వచ్చాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని నిర్ద్వంద్వంగా చెప్పండి.

- మీలో కొంతమంది సగటు విద్యార్థులు ఉంటారు. వారు తమ స్థయిర్యాన్ని కోల్పోవాల్సిన అవసరమేం లేదు. మీ శక్తికి తగ్గట్టుగానే పరీక్షలను ఎదుర్కోండి. ఒకవేళ పొరపాటున ఏదైనా సబ్జెక్టులో తప్పితే దిగులుపడి ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ పరీక్షలు వెనువెంటనే ఉంటాయని మరవొద్దు. దాంతో మనకు విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాదు. మిగతావారితో మీరు సమానం అవుతారు.

- మనకొచ్చే పాఠ్యాంశ అనుమానాలను నివృత్తి చేసుకోడానికి ఇది సమయం కాదని వెనుకంజ వేయొద్దు. అసలు వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఉపాధ్యాయులు గేలిచేస్తారని సిగ్గుపడాల్సిన పనికూడా లేదు. ఒకవేళ ఏ ఉపాధ్యాయుడైనా అలా అంటే తేలిగ్గా తీసుకోండి. మీ సమస్యల్లో ఒకదానికి పరిష్కారం దొరికిందని సంతోషించండి.

- మిత్రులతో, ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవకు దిగే సమయం కాదిది. గొడవ పడితే మన ఏకాగ్రత, స్థిరచిత్తం కాస్తా బీటలు వారతాయి. అవి మళ్ళీ యథాస్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అనవసరంగా విలువైన సమయం కోల్పోయిన వారమవుతాము. సాధారణంగా నూటికి తొంభైతొమ్మిది వివాదాలు గోటితో పోయేవే! కానీ, మనమే వాటిని పెద్దవి చేసుకుంటాం. ఈ సూక్ష్మాన్ని గ్రహించి, ఎప్పుడూ శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

- చదువు ధ్యాసలో పడి పరిశుభ్రతను విస్మరిస్తాం. కానీ, ఎంత శారీరక పరిశుభ్రతను కలిగి ఉంటే మన మనసు అంత తాజాగా ఉంటుందనేది వాస్తవం. సాధారణ పరిశుభ్రతా కార్యక్రమాలను వాయిదా వేయకుండా కొనసాగించాలి. లేకుంటే అంటువ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి సమయంలో వాటి బారిన పడితే శారీరకంగా, మానసికంగా ఎంతో బలహీనపడతాము.

(పరీక్షలకు ఎలా వెళ్లాలో

ఎలా రాయాలో వచ్చేవారం),

- శాఖమూరి, 9441075753

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్