భారీ భూకంపం బారిన పడి తీవ్రంగా నష్టపోయిన చిలీకి ఐదు మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్టు భారత్ ప్రకటించింది. భూకంప బాధిత ప్రాంతాల్లో చేపట్టే సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు.
దీనిపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం బారిన పడిన చిలీని ఆదుకునేందుకు తమ వంతు సాయంగా భారత్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విపత్కాలంలో చిలీ ప్రజలకు అండదండగా ఉండటమే కాకుండా ఐదు మిలియన్ల నగదు సాయాన్ని చేయనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు తెలిసిన, ఎదుర్కొన్న దేశంగా చిలీ ప్రజల దయనీయ పరిస్థితిని గుర్తించడమే కాకుండా, వారి బాధను సైతం అర్థం చేసుకోగలమన్నారు. భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత్ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సింగ్ తెలిపారు.
ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ నేతృత్వంలో చిలీ బాధిత ప్రజలను ఆదుకునేందుకు వీలుగా ఒక అనధికార సమావేశం జరిగింది. ఇందులో ఆయన పై విధంగా మాట్లాడారు. ప్రకృతి విపత్తు జరిగిన వెంటనే భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చిలీ అధ్యక్షుడు మిచెల్ బచ్‌లెట్‌కు ఫోన్ చేసి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేయడమేకాకుండా, ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.