జిహెచ్‌ఎంసి నిర్వాకం ఎవరూ లేని సమయంలో గుడిసెలు కూల్చివేత

  • సుందరీకరణ పేరుతో రోడ్డుపాలు
  • ఆగ్రహించిన గిరిజనులు

హైదరాబాద్‌లోని ట్యాంకు బండ్‌ వద్ద ఉన్న సంజీవయ్య పార్కు సమీపంలో గరిజనుల గుడిసెలను జిహెచ్‌ఎంసి అధి కారులు శనివారం నాడు కూల్చి వేశారు. గుడిసెవాసులు లేని సమయంలో అధికారులు ఈ దారుణానికి వడిగట్టారు. విష యం తెలుసుకున్న గిరిజనులు తమ నివాసాలకు చేరుకుని ఆగ్ర హంతో అధికారు లకు ఎదురు తిరిగారు. తామను కున్న పని ముగించుకున్న అధికారులు అక్కడ నుంచి మెల్లగా జారు కున్నారు. దీంతో గిరిజనులు అధికారుల వాహనం అద్దాలు పగులగొట్టారు. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. నగరంలో అక్టోబర్‌లో జరిగే జీవ వైవిధ్య సదస్సు దృష్ట్యా పార్కు పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ కోసం గుడిసెలను కూల్చాల్సి వచ్చిందని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. సంవత్సరాలుగా నివశిస్తున్న తమకు పునరా వాసం కల్పించకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చివేయడం అన్యాయమని గిరిజనులు వాపోయారు. సుందరీకరణ పేరుతో తమను రోడ్డు పాలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు పునరావాసం కల్పించాలని వారు కోరారు.

కూల్చివేతపై గిరిజన సంఘం ఖండన:.......

గిరిజనుల గుడిసెలను జిహెచ్‌ఎంసి అధికారులు తొలగించడాన్ని ఆ సంఘం నగర కార్యదర్శి ధర్మా నాయక్‌ తీవ్రంగా ఖండించారు. గుడిసె వాసులంతా రెక్కల కష్టంపై ఆధారపడి జీవించేవారని, అందరూ పనులకు పోయిన సమయంలో జిహెచ్‌ఎంసి అధి కారులు వచ్చి గుడిసెలు తొలగించడం దారుణమని మండిపడ్డారు. నగర సుందరీకరణ పేరుతో నగరంలో ఉన్న నిరుపేదలను తొలగించే కార్యక్రమంలో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. ఒక పక్క ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెబుతూనే... మరోవైపు అనేక సంవత్సరాలుగా నివాసముంటున్న గుడిసెవాసులను నిరాశ్రయులను చేయడం విడ్డూ రంగా ఉందన్నారు. తొలగించిన గుడిసెవాసులకు అదే స్థలంలో పక్కా ఇళ్లు కట్టించాలని గిరిజన సంఘం డిమాండ్‌ చేసింది. గుడిసెల్ని తొలగించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.